Is there no rebirth if one dies there?
అక్కడ తుదిశ్వాస విడిస్తే ఇక పునర్జన్మ ఉండదని హిందువుల నమ్మకం.ఆపుణ్య క్షేత్రం మరేదో కాదు ‘కాశీ’. అందుకనే కొందరు ‘వారణాసి’ కెళ్ళి సత్రాల్లో నివాసముంటారు…అక్కడే మరణించాలని కోరుకుంటారు.కొందరైతే కుటుంబ సభ్యుల సహకారంతో చివరి రోజుల్లో అక్కడి కెళతారు.
ఈ రెండో కేటగిరీ వాళ్ళ కోసం కాశీలో ‘ముక్తి భవన్’, ‘ముముక్షు భవన్’ పేరిట ప్రత్యేక సత్రాలు నడుస్తున్నాయి. మరి కొన్నిసత్రాలు కూడా ఉన్నాయి. కానీ పై రెండు కొన్నేళ్ల నుంచి అంత్యదశలో ఉన్నవారికోసం సేవలు అందిస్తున్నాయి.
ఈ ముక్తి భవన్ దాదాపు లో స్థాపితమైంది. ఇందులో 12 గదులు ఉన్నాయి. ఎవరైనా వెళ్లి అక్కడ ఉండొచ్చు. దాల్మియా ఛారిటబుల్ ట్రస్ట్ దీన్నినిర్వహిస్తుంది. ఇక్కడ చేరిన వారు 15 రోజుల్లో మరణించకపోతే వెనక్కి తిప్పి పంపుతారు. లేదా మేనేజర్ మరికొద్ది రోజులు ఉండే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ఇక ఖచ్చితంగా కొద్దీ రోజుల్లో చనిపోతారు అనుకున్న వారినే చేర్చుకుంటారు.
ఇక్కడ బస చేయడానికి ప్రత్యేకంగా చార్జీలు అంటూ ఏమి వసూలు చేయరు. చనిపోయినవారి అంత్యక్రియలు కూడా ట్రస్ట్ మనుష్యులే చేస్తారు. ఆ భవనం లో ఉన్న గుళ్లోనే కర్మకాండలు కూడా నిర్వహిస్తారు. అందుకోసం అక్కడ ప్రత్యేకంగా పండిట్లను కూడా నియమించారు.
కాశీలో మోక్షం పొందాలన్న నమ్మకం ఉన్న వ్యక్తులకు, హిందువులకు మాత్రమే భవన్లో ఉండటానికి అనుమతి ఇస్తారు. అంటు వ్యాధులు ఉన్నవారిని అనుమతించరు. ఇక్కడ లాడ్జింగ్ ఉచితం.ఈ ముక్తి భవన్ లో ఫలహారశాల వంటిది ఏదీ లేదు.అంత్యదశలో ఉన్న వారితో ఉండేవారికి భోజనం కూడా ట్రస్ట్ అందిస్తుంది.
ఆధ్యాత్మిక సంతృప్తిని అందించాలని ట్రస్ట్ విశ్వసిస్తున్నందున ఆహారం నుండి కర్మ కాండల వరకు కయ్యే అన్ని ఖర్చులను ట్రస్ట్ భరిస్తుంది.ఇప్పటికి 14 000 కంటే ఎక్కువ మంది ఇక్కడ చనిపోయారని అంటారు.
అన్ని చావులు, బంధువుల రోదనలు చూసిన నిర్వాహకులు ఎలా జీవించాలో అక్కడికొచ్చిన వారికి వివరిస్తుంటారు.ఎవరితోనైనా మనస్పర్థలు ఉంటే చావటానికి ముందు వాటిని తొలగించుకోమని చెబుతుంటారు నిర్వాహకులు.
మనిషి ఎలా జీవించినా ప్రశాంతంగా చనిపోవాలని కోరుకుంటారు. మనలోనూ దాదాపు అందరూ ఏదో ఒక విషయమై.. ఎవరితోనో ఒకరితో విభేదించి అలానే బ్రతికేస్తుంటాము. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మనస్పర్థలను పరిష్కరించుకోవాలి. ప్రశాంతంగా జీవించాలి.ఈ ముక్తిభవన్ కి మనదేశం నుండే కాదు ఇంగ్లాండ్, జపాన్, మారిషస్ నుండి కూడా వస్తుంటారు.
ఇక ముముక్షు భవన్ లో అంత తొందరగా రూములు దొరకవు. అక్కడ 116 వరకు రూములు ఉన్నాయి. అక్కడ నామినల్ చార్జీలు వసూలు చేస్తారు. దీర్ఘకాలిక బస సదుపాయం కూడా ఉంది. అందుకు ప్రత్యేక చార్జీలు ఉంటాయి.
ఇవి కాకుండా మరి కొన్ని సత్రాల్లో కూడా బస చేయవచ్చు. అవి కొంత కమర్షియల్ పద్దతిలో నడుస్తాయి. భోజన ఖర్చులు మనమే భరించాలి. ఇక్కడ ఉండేవారు కలిసి పండుగలు జరుపుకుంటారు.దీపావళి రోజు దీపాలువెలిగిస్తారు.
హోలీ వేళ రంగులతో ఆడుకుంటారు. కలిసి పూజలు చేస్తారు.ఉదయాన్నే గుడికి వెళ్తుంటారు. కలిసి భోజనం చేస్తారు.ఆలోచనలు,అనుభవాలను పంచుకుంటారు.
—————-KNM