Harappan culture………
హరప్పా సంస్కృతి (సింధు లోయ నాగరికత) ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, గొప్ప కాంస్య యుగ (Bronze Age) నాగరికతలలో ఒకటి. క్రీస్తుపూర్వం (BC) 2500 నుండి 1900 మధ్య కాలంలో ఈ నాగరికత అత్యున్నత దశకు చేరుకుంది.
మన దేశంలోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలలో ఈ సంస్కృతి విస్తరించింది. హరప్పా సంస్కృతి అనగానే అందరికీ గుర్తొచ్చేది వారి అద్భుతమైన నగర నిర్మాణం. నగరాల్లో రోడ్లు అన్నీ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలుగా నిలువుగా, అడ్డంగా (గ్రిడ్ పద్ధతిలో) ఉంటూ, ఒకదానికొకటి లంబకోణంలో (90 డిగ్రీలు) ఖండించుకునేవి.
ఇళ్ళ నిర్మాణానికి ఒకే కొలతతో ఉన్న నాణ్యమైన కాల్చిన మట్టి ఇటుకలనుఅప్పట్లో ఉపయోగించారు.
నగరాలను రెండు భాగాలుగా విభజించారు. ఎత్తైన పశ్చిమ భాగాన్ని కోట (Citadel) అని, తూర్పు వైపు ఉన్న దిగువ భాగాన్ని సాధారణ ప్రజలు నివసించే లోయర్ టౌన్ అని పిలిచేవారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ను అప్పట్లోనే వారు అద్భుతంగా నిర్వహించారు.
ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అత్యంత అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థను వీరు రూపొందించారు. ప్రతి ఇంటి నుండి వచ్చే మురుగునీరు వీధిలోని ప్రధాన కాల్వకు అనుసంధానించబడి ఉండేది. ఈ కాల్వలను రాతి పలకలతో లేదా ఇటుకలతో పూర్తిగా కప్పి ఉంచేవారు.కాల్వలను శుభ్రం చేయడానికి అక్కడక్కడా మ్యాన్‌హోల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇది వారి పరిశుభ్రతకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
మహా స్నానవాటిక… ఇది మొహెంజోదారోలో దొరికిన ఒక అద్భుత కట్టడం. మతపరమైన ఆచారాల కోసం సమాజమంతా కలిసి స్నానం చేయడానికి దీన్ని వాడేవారని భావిస్తారు. నీరు లీక్ అవ్వకుండా దీనికి తారు పూత పూశారు. హరప్పాలో పెద్ద ఎత్తున ధాన్యాన్ని నిల్వ ఉంచే గిడ్డంగులను కనుగొన్నారు. శాస్త్రబద్ధంగా గాలి వెళ్లేలా వీటిని నిర్మించారు.
నాటి ప్రజలు ప్రకృతిని, చెట్లను (రావి చెట్టు), జంతువులను (ఎద్దు) పూజించేవారు. ముద్రికలపై ఉన్న ‘పశుపతి’ (శివుని ప్రాచీన రూపం) ‘మాతృదేవత’ విగ్రహాలు వీరి ప్రధాన దైవాలు. హరప్పా ప్రజలు వాడిన లిపి బొమ్మల రూపంలో ఉంటుంది.
దీనిని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు (సర్పలేఖనం/Boustrophedon) రాసేవారు. అయితే, ఈ లిపిని శాస్త్రవేత్తలు ఇప్పటికీ పూర్తిగా చదవలేకపోయారు.వేల సంవత్సరాల నాటి ప్రాచీన హరప్పా సంస్కృతి శిథిలాలు ఎక్కడైతే దొరికాయో, దానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఆధునిక “హరప్పా” పట్టణం ఉంది.
ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల సాహివాల్ జిల్లాలో, రావి నది పాత ప్రవాహ మార్గానికి సమీపంలో ఉంది. ఇది ప్రస్తుతం దాదాపు 15,000 మంది జనాభా కలిగిన ఒక చిన్నపట్టణం.బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఒక చారిత్రక రైల్వే స్టేషన్ కూడా ఈ ఆధునిక హరప్పా పట్టణంలో ఉంది.
క్రీస్తుపూర్వం 2600 – 1900 కాలంలో ఇదే ప్రాంతంలో అత్యంత వైభవంగా వర్ధిల్లిన ప్రాచీన నగరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు మొదట ఇక్కడే కనుగొన్నారు. పురావస్తు నియమాల ప్రకారం ఒక నాగరికతకు చెందిన మొదటి స్థావరం ఎక్కడ దొరికితే, ఆ నాగరికతకు అదే పేరు పెడతారు. అలా ఈ పట్టణం పేరు మీదుగానే ఆ ప్రాచీన సంస్కృతికి “హరప్పా నాగరికత” (సింధు లోయ నాగరికత) అనే పేరు వచ్చింది.
క్రీ.పూ 1900 తర్వాత ఈ గొప్ప నాగరికత క్రమంగా అంతరించిపోయింది. దీని పతనానికి ఖచ్చితమైన కారణం తెలియకపోయినప్పటికీ… సింధు నదికి వచ్చిన పెద్ద వరదలు, భూకంపాలు, నదులు ఎండిపోవడం, వాతావరణ మార్పులు లేదా ఆర్యుల దండయాత్రల వల్ల ఈ సంస్కృతి అంతమై ఉండవచ్చని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.

