An entertaining movie…….
‘ఊపిరి’ (Oopiri) నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామా. 2016 లో విడుదలైన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. నాగార్జున కెరీర్ మొత్తం లోనే చెప్పుకోదగిన సినిమాలలో ఇది అగ్రభాగంలో ఉంటుంది.
ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఫ్రెంచ్ చిత్రం ‘ది ఇంటచబుల్స్’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కథ ఏమిటంటే ?
విక్రమాదిత్య (నాగార్జున) ఒక కోటీశ్వరుడు. ఒక ప్రమాదం వల్ల మెడ కింద నుంచి శరీరం పనిచేయని (పక్షవాతం) స్థితికి చేరుకుంటాడు.కేవలం వీల్ చైర్‌కే పరిమితమైన అతన్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ అవసరమవుతాడు. ఆ ఉద్యోగం కోసం జైలు నుండి పెరోల్‌పై వచ్చిన శీను (కార్తీ) అనే యువకుడు వస్తాడు.
పూర్తిగా భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య స్నేహం ఎలా చిగురించింది? శీను రాకతో విక్రమాదిత్య జీవితం ఎలా మారింది? అనేదే ఈ సినిమా కథ.
నాగార్జున కేవలం తన కళ్ల కదలికలతో, ముఖ కవళికలతో విక్రమాదిత్య పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఇక కార్తీ తన నటన, కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో సినిమాకు ప్రాణం పోశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు అతిపెద్ద బలం.కార్తీ చేసిన పాత్ర కు ముందు ఎన్టీఆర్ ని అనుకున్నారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో కార్తీ తెరమీద కొచ్చాడు.
వంశీ పైడిపల్లి ఒక విదేశీ కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా చక్కగా మార్చారు.ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించారు. విక్రమాదిత్య సెక్రటరీగా తమన్నా గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా, తన నటనతో మెప్పించింది.
ప్రకాష్ రాజ్ , తనికెళ్ళ భరణి,జయసుధ ,ఆలీ వి చిన్నపాత్రలే అయినప్పటికీ వారి పరిధి మేరకు బాగా చేశారు. స్టార్ హీరోయిన్ అనుష్క ఒక చిన్నపాత్రలో, మరో ఫేమస్ తార శ్రియ చిన్నపాత్రల్లో కనిపిస్తారు.
కార్తీ నాలుగు గోడల మధ్య ఉండే నాగ్ ను బైక్ పై టౌన్ లో తిప్పే సన్నివేశం బాగుంటుంది. ఆ సమయం లో నాగ్ ఫీలింగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ప్రకాష్ రాజ్ కార్తీ వేసిన ఆర్ట్ ను చూసే సన్నివేశం ..నాగ్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడే సీన్, అనుష్క నాగార్జున ను కలిసే సీన్ ..అపుడు నాగార్జున హావభావాలు,కార్ చేజింగ్ సీన్స్, కార్తీ నాగ్ కి కృతజ్ఞతలు చెప్పే సీన్స్ అలరిస్తాయి.
నాగ్ ఒకే అనకపోతే ఈ సబ్జెక్టు అటక ఎక్కేది.. ఈ విషయాన్ని డైరెక్టర్ వంశీ ఒక సందర్భంలో చెప్పారు. తెలుగు సినీ రంగంలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని సాహసం చేసిన నాగ్ చేసాడనే చెప్పుకోవాలి. వంశీ పైడిపల్లి నాగ్ పాత్రను బాగా మలిచారు. అందుకు తగ్గట్టుగానే నటనను రాబట్టారు.
కార్తీ కూడా బాగా చేశారు. అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. డబ్బు కంటే మనుషుల మధ్య ఉండే బంధాలు, సంతోషం, స్నేహం ఎంత ముఖ్యమో ఈ సినిమా చాలా సున్నితంగా, మనసుకు హత్తుకునేలా చెబుతుంది.
గోపీ సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి ఎమోషనల్ సీన్‌ను బాగా ఎలివేట్ చేసింది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాను చాలా రిచ్‌గా చూపించింది.ఛైజింగ్ ,బైక్ సీన్స్ బాగా తెరకెక్కించారు. సినిమా క్లాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీయడం వల్ల, సెకండాఫ్‌లో కొన్నిచోట్ల కథనం కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది.
ఒరిజినల్ సినిమా చూసిన వారికి లేదా రెగ్యులర్ డ్రామా సినిమాలు చూసేవారికి ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించవచ్చు.‘ఊపిరి’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పే ఒక మంచి అనుభూతి.
మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఆశించే వారికి సినిమా నచ్చకపోవచ్చు, కానీ కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూడాలనుకునే వారికి తప్పక నచ్చే సినిమా.ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్, నెట్‌ఫ్లిక్స్,యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

