త్వరలో అందుబాటులోకి రామోజీ ఓటీటీ వేదిక !

Sharing is Caring...

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఓటీటీ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. తెర వెనుక ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఓటీటీ వేదికలకు ఆదరణ పెరుగుతున్ననేపథ్యంలో రామోజీ ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే 12 భాషల్లో బాలభారత్ చానళ్లను రామోజీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఛానళ్లన్నీ ప్రత్యేకంగా బాలల కోసం మాత్రమే రూపుదిద్దుకున్నాయి.  పిల్లలను ఉత్తేజ పరిచే అంశాలతో పాటు వినోదం,విజ్ఞానం అందించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇంకా అద్భుతమైన కథలు .. పాత్రలు అబ్బురపరిచే యానిమేషన్ , లైవ్ యాక్షన్లతో కూడిన సీరియల్స్ తయారవుతున్నాయి.  కామెడీ, యాక్షన్,అడ్వెంచర్, థ్రిల్లర్ , ఫాంటసీ వంటి అంశాలతో సీరియళ్లు కూడా రూపొందిస్తున్నారు.

కాగా ఓటీటీ ఫ్లాట్ ఫారం కొత్త వెంచర్. దీని ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అందిస్తారు. ఇప్పటికే రామోజీ  వివిధ భాషల్లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై 85 సినిమాలు వరకు తీశారు. అలాగే ఈ టీవీ ప్రారంభించిన సమయంలో వందలాది సినిమాలు కొనుగోలు చేశారు. 99 ఏళ్ళ లీజ్ హక్కులతో కొన్న ఆ సినిమాలను, సొంత సినిమాలను కొత్తగా రాబోయే ఓటీటీ లో పెడతారు.అలాగే ఈటీవీ కోసం తయారు చేసిన సీరియళ్ల లో హిట్ అయిన సీరియళ్లను ఓటీటీ లో ఉంచుతారు. ఇక బాల భారత్ కోసం రూపొందిస్తున్న యానిమేషన్ సీరియళ్లను ఈ కొత్త వేదికపై ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతారు. కొన్నాళ్ల నుంచి బయట సినిమాలను కొనుగోలు చేయడం ఆపేసిన రామోజీ మరల కొత్త  చిత్రాల హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇప్పటికే ఓటీటీ రంగంలో net flix,amajon prime,hot star,sun next,jio,alt balaji వంటి సంస్థలు దూసుకుపోతున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ aha పేరిట ఓటీటీ ని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ఓటీటీ యాప్స్ కు ఆదరణ పెరిగింది. కావలసినపుడు చూసుకునే సౌలభ్యం ఉండటం .. సరసమైన ధరలకే సినిమాలు చూసే అవకాశం, విడుదలైన నెలరోజులకే ఓటీటీ లోకి సినిమాలు వస్తుండటం తో ఈ యాప్స్ కు డిమాండ్ పెరిగింది. కరోనా టైం లో ఈ యాప్స్ కు డిమాండ్ అంత ఇంత కాదు. కుటుంబం మొత్తం సినిమాకు వెళితే సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బుతో ఒకటి ,రెండు యాప్స్ కి చందా కడితే ఏడాది పాటు ఇంట్లోనే కూర్చొని సినిమాలు, వెబ్ సిరీస్ చూడవచ్చు.

మంచి సినిమాలు, సిరీస్ అందిస్తే ఆ ఓటీటీ కి ఆదరణ పెరుగుతుంది. రామోజీ ఈ వ్యాపార సూత్రంతోనే ఈ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సంస్థలో ఉన్న రచయితలకు అదనంగా మరి కొంతమంది ని తీసుకుంటున్నారు. వీరితో ప్రేక్షకులను మెప్పించే విధంగా సిరీస్ తయారు చేయించనున్నారు. సొంత స్టూడియో .. ఫిలిం బ్యాంక్ ఉండటం రామోజీకి ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. ఓటీటీ పబ్లిసిటీ కి చేతిలో పేపర్, ఛానల్స్ ఉన్నాయి. ఈటీవీ విన్ పేరిట ఇప్పటికే రామోజీ ఒక మొబైల్ యాప్ ను కొంత కాలంగా నడుపుతున్నారు. దాన్నే ఓటీటీ యాప్ గా వాడతారా ? కొత్త యాప్ ను తెస్తారా ? అన్న విషయం లో క్లారిటీ రావాల్సిఉంది. 

————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!