భయపెడుతున్న ‘ఎల్ నినో’ కథ ఏంటి ?

Sharing is Caring...

Drought stricken………..

ఎల్ నినో” (El Niño) ఇటీవల కాలంలో ఎక్కువగా వినబడుతున్న మాట ఇది. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఒక సహజ వాతావరణ మార్పు ప్రక్రియ ను ఎల్ నినో  అంటారు.స్పానిష్ భాషలో “ఎల్ నినో” అంటే “చిన్న పిల్లవాడు”  లేదా “క్రీస్తు చైల్డ్” అని అర్థం. దక్షిణ అమెరికా దేశమైన పెరూ తీరంలోని మత్స్యకారులు డిసెంబర్ (క్రిస్మస్) సమయంలో సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని గమనించి ఈ పేరు పెట్టారు. 

ఎల్ నినో ఎలా మొదలవుతుంది? 

సాధారణ రోజుల్లో, భూమధ్యరేఖ వెంబడి వీచే తూర్పు గాలులు  పసిఫిక్ మహాసముద్రంలోని వేడి నీటిని ఆసియా, ఆస్ట్రేలియా వైపు నెడతాయి. దీనివల్ల భారతదేశం,ఇండోనేషియా పరిసరాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. కానీ ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యవస్థ తలకిందులవుతుంది. ఆసియా వైపు వీచే తూర్పు గాలులు హఠాత్తుగా బలహీనపడతాయి లేదా వెనక్కు వీస్తాయి.

దీనివల్ల సముద్ర ఉపరితలంలోని వేడి నీరంతా వెనక్కి తిరిగి, దక్షిణ అమెరికా (పెరూ, ఈక్వెడార్) తీరానికి చేరుకుంటుంది. సముద్రపు నీరు సాధారణం కంటే 0.5°C నుండి 2°C లేదా అంతకంటే ఎక్కువ గా వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణం గందరగోళంగా మారుతుంది.

ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావాలు 

దక్షిణ అమెరికా (పెరూ, ఈక్వెడార్)ఎడారి ప్రాంతాలలో భారీ వర్షాలు, విధ్వంసకర వరదలు వస్తాయి. సముద్రంలో చేపల సంఖ్య  తగ్గిపోతుంది.ఆస్ట్రేలియా, ఇండోనేషియా లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. అడవుల్లో మంటలు సంభవిస్తాయి.అమెరికా దక్షిణ ప్రాంతాలలో భారీ తుఫానులు, వరదలు సంభవిస్తాయి.

భారతదేశానికి ఎల్ నినో ఒక శాపం లాంటిది. బలమైన ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పుడు భారత దేశంలో నైరుతి రుతుపవనాలు (Monsoon) బలహీనపడతాయి. దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గిపోయి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎండ తీవ్రత పెరిగి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయి.వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల ఖరీఫ్ పంటల సాగు దెబ్బతింటుంది, తద్వారా ఆహార సంక్షోభం ఏర్పడి ధరలు పెరుగుతాయి.

అధికారిక వాతావరణ సంస్థల నివేదికల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో పరిస్థితులు వేగంగా మారుతూ ఎల్ నినో తీవ్రత పెరుగుతోంది. ఇది రాబోయే కాలంలో మరింత బలపడి “సూపర్ ఎల్ నినో” గా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

జూన్ 2026 నాటికి లభించిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత వాతావరణ శాఖ అధికారిక నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల లోటుకు కారణమవుతున్న “ఎల్‌నినో” ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని పలు జిల్లాలపై తీవ్రంగా ఉండబోతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానంగా నీటిపారుదల వసతులు తక్కువగా ఉండి, వర్షాలపైనే ఆధారపడే మెట్ట ప్రాంతాల జిల్లాలలో కరువు, తీవ్ర ఉష్ణోగ్రతలు … భూగర్భ జలాల క్షీణత వంటి ముప్పులు ఎక్కువగా పొంచి ఉన్నాయి.

తెలంగాణలోని దాదాపు 12 జిల్లాలు ఎల్‌నినో ముప్పు పరిధిలో ఉన్నట్లు వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతాలలో దీని ప్రభావం ఎక్కువ. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,  జోగులాంబ గద్వాల జిల్లాల పై ప్రభావం ఉంటుంది 

అలాగే నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలపై ప్రభావం ఉంటుంది ,కరీంనగర్ వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు  ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.హైదరాబాద్ నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి  ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు ఉన్నాయి.ఇప్పటికే నగరం లో నీటి సమస్య మొదలైంది.  

ఆంధ్రప్రదేశ్‌లో సగటున 25% కంటే తక్కువ సాగునీటి సౌకర్యం ఉన్న మెట్ట ప్రాంతాలు, రాయలసీమ జిల్లాలలో ఖరీఫ్ పంటల సాగుకు ఎల్‌నినో వల్ల తీవ్ర ఆటంకం కలగనుంది.అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు,  నంద్యాల జిల్లాలు (ఈ జిల్లాలలో వర్షపాత లోటు ఎక్కువగా ఉంటుంది).

వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని వెనుకబడిన మెట్ట ప్రాంతాలు. విజయనగరం,  పార్వతీపురం మన్యం జిల్లాలలోని కొన్ని వర్షధారిత ప్రాంతాలపై ప్రభావం ఉంటుంది .జూన్ నాటికి దేశవ్యాప్తంగా 43% మేర లోటు వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు సమయానికి పడక ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది.

నేపథ్యంలోనే వరి లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే సంప్రదాయ పంటల కంటే, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు) వైపు వెళ్లాలని కృషి విజ్ఞాన కేంద్రాలు సూచిస్తున్నాయి.

భూగర్భ జలాలుఎండ తీవ్రత వల్ల రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవడం, బోర్లలో నీరు అడుగంటిపోవడం జరుగుతుంది.ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!