Lady Ghajini……
నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘ఝాన్సీ’ (Jhansi) వెబ్ సిరీస్ …జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో కూడిన సిరీస్ ఇది. ఝాన్సీ (అంజలి) అనే ఒక యువతికి గతం లో ఏమి జరిగిందో ? తాను ఎవరో గుర్తుండదు.
కేరళలోని ఒక జలపాతంలో కొట్టుకొచ్చిన ఆమెను సంకీత్ (ఆదర్శ్ బాలకృష్ణ) కాపాడి ఆశ్రయం ఇస్తాడు. ఇద్దరూ ఒక చిన్న పాపతో కలిసి సహజీవనం చేస్తుంటారు.కానీ, ఝాన్సీకి తరచూ కొన్ని భయంకరమైన కలలు, అపరిచిత వ్యక్తుల ముఖాలు గుర్తుకొస్తుంటాయి.
అనుకోకుండా తన కళ్లముందే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే, తను నేర్చుకోకుండానే మార్షల్ ఆర్ట్స్, గన్ ఫైటింగ్ వంటి యుద్ధ విద్యలలో అద్భుతమైన ప్రతిభ చూపిస్తుంది. అసలు ఆమె గతం ఏంటి? ఆమె అసలు పేరు మహిత నా? ఆమెకు బార్బీ (చాందినీ చౌదరి)తో ఉన్న సంబంధం ఏంటి? గోవాలోని ఒక పెద్ద నేర ముఠా/వేశ్యా గృహం నుండి ఆమె ఎలా తప్పించుకుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్ కథ .
సిరీస్ కథ అంతా అంజలి చుట్టూ నడుస్తోంది. ఝాన్సీ పాత్రలో అంజలి చాలా వైవిధ్యమైన షేడ్స్ చూపించింది. గతాన్ని తెలుసుకోవాలనే తపన పడే ఒక అమాయక తల్లిగా,శత్రువులను చీల్చిచెండే యాక్షన్ వుమన్ గా ఆమె అద్భుతంగా నటించింది.
సీజన్-1 ముగింపు, సీజన్-2 ప్రారంభ ఎపిసోడ్‌లలో వచ్చే ట్విస్టులు వీక్షకులలో ఆసక్తిని కలిగిస్తాయి.కథలో భాగంగా మహిళలపై జరిగే అన్యాయాలు, యాసిడ్ దాడుల వంటి అంశాలను చూపించిన విధానం బాగుంది.
సిరీస్‌లోని కొన్ని ఎపిసోడ్‌లు చాలా సాగతీతగా అనిపిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లను మరింత ఆసక్తికరంగా మలచాల్సింది.కథపై దర్శకుడు మరింత కసరత్తు చేస్తే బాగుండేది.
మనం ‘గజినీ’ లేదా హాలీవుడ్ సినిమాలు/సిరీస్‌లలో చూసిన “గతం మర్చిపోయిన హీరో/హీరోయిన్ రివెంజ్ తీర్చుకోవడం” అనే పాత లైన్‌పైనే ఈ కథ నడుస్తుంది. నటి తాళ్లూరి రామేశ్వరి ఇందులో ‘అంసా బేగం’ పాత్రను పోషించారు. హీరోయిన్ ఝాన్సీ (అంజలి) గతాన్ని పూర్తిగా మర్చిపోయిన సమయంలో ఆమె ఫ్లాష్‌బ్యాక్ మిస్టరీని విప్పే పాత్ర తాళ్లూరి రామేశ్వరిదే.
ఆమె చెప్పే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ద్వారానే సిరీస్‌లోని అసలైన రహస్యాలన్నీ వీక్షకులకు తెలుస్తాయి.. తన వయసుకు, అనుభవానికి తగ్గట్టుగా ఆమె చాలా హుందాగా, గాంభీర్యంతో కూడిన పవర్‌ఫుల్ నటనను కనబరిచారు.
చాందినీ చౌదరి వంటి ప్రతిభావంతమైన నటికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఇచ్చారు. అలాగే ముమైత్ ఖాన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సీజన్-1 ఎక్కడ ముగిసిందో (గోవాలో బిల్లు క్లబ్ గ్యాంగ్ చేతికి ఝాన్సీ చిక్కడం), సీజన్-2 కథ అక్కడ నుండే ప్రారంభమవుతుంది. తన గతం గురించి తెలుసుకోవడానికి ఝాన్సీ (అంజలి) వేశ్యాగృహ నిర్వాహకులను గన్‌తో బెదిరిస్తుంది.
దీనితో కథ పూర్తిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. ఝాన్సీ అసలు పేరు ‘మహిత’ అని, ఆమెకు ప్రాణస్నేహితురాలైన బార్బీ (చాందినీ చౌదరి)తో ఉన్న బంధం ఏంటో చూపిస్తారు. చీకటి సామ్రాజ్య నేత కాలేబ్ (రాజ్ అర్జున్) కొడుకు ఈథన్‌ను మహిత ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆమెకు పుట్టిన కొడుకు ఏమయ్యాడు? బార్బీకి మహితపై పగ ఎందుకు పెరిగింది? ఈ ప్రశ్నల చుట్టూనే రెండవ సీజన్ 4 ఎపిసోడ్‌లు తిరుగుతాయి.
అంజలి చేసిన ఫైట్స్ బాగున్నాయి,ఆమె నటనలో తీవ్రత (Intensity) ఎక్కడా తగ్గలేదు. మొదటి సీజన్ చూసిన ప్రేక్షకులకు ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు (ఫ్లాష్‌బ్యాక్, విలన్‌తో శత్రుత్వం) ఈ సీజన్‌లో సమాధానాలు దొరుకుతాయి.
ఈ వెబ్ సిరీస్‌కు ప్రముఖ తమిళ చలనచిత్ర దర్శకుడు తిరు దర్శకత్వం వహించారు..శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అర్వి సినిమాటోగ్రఫీ సిరీస్‌కు మంచి రిచ్ లుక్‌ని తీసుకువచ్చాయి. రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడేవారికి సిరీస్ నచ్చుతుంది.బలమైన స్క్రీన్‌ప్లే లేకపోవడం వల్ల ఇది కేవలం ఒక యావరేజ్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే… ‘ఝాన్సీ’ ఒక లేడీ గజినీ తరహా కమర్షియల్ థ్రిల్లర్ సిరీస్. అంజలి పవర్‌ఫుల్ యాక్షన్ పర్‌ఫార్మెన్స్ కోసం, రొటీన్ రివెంజ్ డ్రామాలను ఇష్టపడేవారు ఒకసారి చూడవచ్చు.

