No horror, a little thriller……
అతిథి’ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్,థ్రిల్లర్ అన్నారు కానీ భయం పుట్టించే సన్నివేశాలు లేవు.థ్రిల్ కలిగించే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఊహించని ట్విస్టులు కూడా ఉన్నాయి.
రాజా రవి వర్ధన వీర వర్మ.(వేణు తొట్టెంపూడి) ఒక కథా రచయిత. భార్య సంధ్య (అదితి గౌతమ్)తో కలిసి ఒక పెద్ద, ఒంటరి భవంతిలో నివసిస్తుంటాడు. ఒక తుఫాను రాత్రి, మాయ (అవంతిక మిశ్రా) అనే ఒక అపరిచిత యువతి ఆశ్రయం కోసం రవివర్మ ఇంటికి వస్తుంది.
మరోపక్క, దెయ్యాలు లేవని నిరూపించడానికి ‘దెయ్యాల మిట్ట’కు వెళ్లిన యూట్యూబర్ సవారి (వెంకటేష్ కాకుమాను) అక్కడ ఏదో భయంకరమైన శక్తిని చూసి భయపడి, ప్రాణభయంతో అదే ఇంటికి చేరుకుంటాడు. అక్కడ మాయ ను చూసి ఆమె దెయ్యమని వర్మకు చెబుతాడు. అతగాడు నమ్మడు..
ఆమె నిజంగానే దెయ్యమా? ఆమె చుట్టూ ఉన్న రహస్యం ఏంటి? ఆ రాత్రే ఆ ఇంట్లోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ (రవివర్మ) వీళ్లను ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు? అక్కడ అసలు దెయ్యం ఎవరు ?
చివరికి అక్కడ ఏం జరిగింది అనేదే ఈ సిరీస్ కథ. ఆరు ఎపిసోడ్స్ గా కథను తెరకెక్కించారు. వీటిలో కొన్నింటిని వేణు చెబుతాడు. అవి ఆకట్టుకునేలా ఉన్నాయి.
మొదటి ఉప కథలో …. మ్యూజిక్ టీచర్ ఒక చిన్న పాపకు పియానో నేర్పించడానికి ఆమె ఇంటికి వస్తుంటాడు.ఆ పాపకు పియానో క్లాసులు సరిగ్గా నేర్పించాలంటే.. అందుకు బదులుగా తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. చివరికి ఆ టీచర్ ఏమైనాడు ?
రెండో ఉప కథలో ‘ పని చెప్పండయ్యా ‘అంటూ వెంటపడే పని వాడి పాత్ర బాగుంటుంది.పని చెప్పలేకపోయిన రఘు పాత్ర ఏమైంది ?ఇది కామెడీ ఎపిసోడ్.భయపడే సీన్లు లేవు.ఈ కథలకు అసలు కథకు లింక్ లేదు. ఇలాంటి కథలనే ఆరు ఎపిసోడ్స్ గా తీస్తే బాగుండేది.
అరిషడ్వర్గాల (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం)* వల్ల మనిషి పతనమవుతాడనే విషయాన్ని ఈ సిరీస్లో కథల రూపంలో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు భరత్.. హారర్ ఎలిమెంట్స్ ను పెద్దగా ఎలివేట్ చేయలేకపోయారు. రొటీన్ సీన్స్ ఎక్కువ.
కొన్నిసన్నివేశాలు బాగా తీశారు. చివరి ఎపిసోడ్‌లో చాలా విషయాలు ఒకేసారి జరిగిపోతాయి. కథను ముగించాలనే హడావుడి స్పష్టంగా కనిపిస్తుంది, దీనివల్ల ముగింపు అంతగా సంతృప్తికరంగా అనిపించదు. కొన్నిఆసక్తికరమైన మలుపులు, మంచి నటనతో సాగే ఒక యావరేజ్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇది. కొత్తదనం కోరుకునే హారర్ అభిమానులకు ఇది అంతగా నచ్చకపోవచ్చు, కానీ రొటీన్ థ్రిల్లర్స్ చూసేవారికి నచ్చుతుంది.
వేణు తొట్టెంపూడి ఒక విభిన్నమైన, సీరియస్ పాత్రలో చాలా సెటిల్డ్‌గా, బాగా నటించారు. మాయ పాత్రలో అవంతిక మిశ్రా తన నటనతో, గ్లామర్‌తో ఆకట్టుకోగా.. యూట్యూబర్ సవారి పాత్రలో వెంకటేష్ కాకుమాను భయపడుతూనే మంచి వినోదాన్ని పంచారు.మొదటి 3 ఎపిసోడ్‌లు చాలా ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతాయి.. అక్కడ నుంచి సాగదీసినట్టు అనిపిస్తుంది. కథపై మరింత కసరత్తు చేస్తే బాగుండేది.
కపిల్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) హారర్ వాతావరణాన్ని బాగా ఎలివేట్ చేసింది. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ బాగుంది. ఒక సారి చూడవచ్చు.

