ఎవరీ అర్లేకర్ ? గవర్నర్ ఎలా అయ్యారు ?

Sharing is Caring...

Person in the news ………..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న ‘హంగ్’ (Hung Assembly) పరిస్థితుల్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి.ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒక్కసారిగా ఆయన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, రాజ్యాంగపరమైన సంక్షోభ పరిష్కారంలో గవర్నర్ పాత్రపై కొత్త చర్చకు తెరలేపారు.

ఎవరీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ?

రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఏప్రిల్ 23, 1954న గోవాలోని పంజిమ్‌లో జన్మించారు. ఆయన తండ్రి విశ్వనాథ్ అర్లేకర్, తల్లి శ్రీమతి తిలోత్తమ అర్లేకర్. అర్లేకర్ తన పాఠశాల విద్యను గోవాలోని వాస్కోడగామాలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి చేశారు.

అనంతరం వాస్కోడగామాలోని ఎంఈఎస్ (MES) కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు చిన్నతనం నుండే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తో ఉన్న అనుబంధం ద్వారా ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగింది. 1989 నుండి భారతీయ జనతా పార్టీ (BJP)లో క్రియాశీల సభ్యుడిగా చేరి, నాలుగు సంవత్సరాల పాటు గోవా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఎమర్జెన్సీ (1975–1977) సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తన తండ్రితో కలిసి జైలు శిక్షను అనుభవించారు. ఆయన 2002 నుండి 2007 వరకు గోవా శాసనసభ సభ్యుడిగా సామాజిక సమస్యలు, అభివృద్ధి,  పర్యావరణ పరిరక్షణపై తన గళాన్ని వినిపించారు.

2012 నుండి 2017 వరకు గోవా అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కాలంలో, భారత దేశంలోనే అసెంబ్లీని మొట్టమొదటిసారిగా ‘పేపర్‌లెస్’ (కాగిత రహిత) వ్యవస్థగా మార్చి దేశవ్యాప్త ప్రశంసలు అందుకున్నారు. అలాగే గోవా ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

జూలై 2021లో  అర్లేకర్ హిమాచల్ ప్రదేశ్ 21వ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఫిబ్రవరి 2023లో ఆయన బీహార్ 30వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి, తన సేవలను కొనసాగించారు.జనవరి 2, 2025న కేరళ 23వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

2026 మార్చి 12న తమిళనాడు గవర్నర్‌గా (అదనపు బాధ్యతలు) ప్రమాణ స్వీకారం చేశారు.అప్పటివరకు తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన ఆర్.ఎన్. రవి ని  పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చేసిన నేపథ్యంలో అర్లేకర్ ఈ బాధ్యతలు చేపట్టారు.  

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం హంగ్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి.

గవర్నర్ అర్లేకర్ తన పాత బీజేపీ-RSS నేపథ్యం కారణంగా అధికార పార్టీ (బీజేపీ) కి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.అన్నాడీఎంకే లేదా ఇతర పార్టీలతో బీజేపీ రహస్య బేరసారాలు (Horse-trading) సాగించడానికి గవర్నర్ కావాలనే సమయం ఇస్తున్నారని సీపీఎం (CPI-M) పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది.

మరోవైపు గవర్నర్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, “మ్యాజిక్ ఫిగర్” (118) లేకుండా ఒక బలహీనమైన ప్రభుత్వాన్ని నియమించడం వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, ఎమ్మెల్యేల కొనుగోలు పెరుగుతాయని, అందుకే ముందే స్పష్టత కోరుతున్నానని మీడియా కు విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!