“ప్రమాణ స్వీకార ఖర్చు మాదే ..నాకారులో నేనొస్తా” విజయ్ సంచలన నిర్ణయం !!

Sharing is Caring...

Mohammed Rafee…………

రాటుదేలాలి! దెబ్బ పై దెబ్బ తగలాలి! రాజకీయ రంగంలో నిలదొక్కుకోవాలంటే కొంత సున్నితత్వం వదులుకోవాలి! అదే జరుగుతోంది! అంతా మంచికే జరుగుతోంది! జనం భలే వాళ్ళబ్బ! ఎవ్వరికి మ్యాజిక్ ఫిగర్ అందకుండా చేశారు! చదరంగం ఆడిస్తున్నారు!

విజయ్ అన్ని సీట్లు సాధించి డక్కాముక్కలు తిని రాటుదేలిన డిఎంకె, అన్నాడిఎంకె లను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకుంటారని ఎవ్వరు ఊహించలేదు! అందరి అంచనాలను పటాపంచలు చేసి 11 సీట్లకు తక్కువగా నిలబెట్టారు! ఇప్పుడు ఆ పదకొండు పెద్దగా కష్టపడకుండానే సిద్దమయ్యాయి! అంత ఈజీగా గవర్నర్ రెడ్ కార్పేట్ వేయడానికి సిద్ధంగా లేరు!

ఆయన ఒత్తిళ్ళు ఆయనకు ఉంటాయి! సహజంగా ఏ గవర్నర్ అయినా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు! ప్రమాణ స్వీకారం చేయిస్తారు బల నిరూపణకు కాస్త సమయాన్ని ఇస్తారు! కానీ, అక్కడ మరో రాంలాల్ వున్నారు! ఆయనకు వచ్చిన ఆదేశాల మేరకు పాటించి తీరాల్సిందే! అందుకే ఆయన ఒక తిరకాసు పెట్టారు!

మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే లతో సంతకాలు చేయించి చూపిస్తే అప్పుడు ఆయన పిలుస్తారట ప్రభుత్వ ఏర్పాటుకు! అప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారట! ఇది పెద్ద నేరం ఏం కాదు కానీ, న్యాయ నిపుణుల సలహాతో ఆయనకు నచ్చినట్లు నిర్ణయం తీసుకోవచ్చు కానీ, సంక్షోభం రాకుండా చర్యలు, అందుకే సంతకాలు అంటూ పేచీ పెట్టడమే అభ్యంతరకరం!

ఎలాగూ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఇంకో రెండు చిన్న చితకా పార్టీలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి! సరే, దానికి కూడా విజయ్ ఓకే అన్నారు. నిన్ననే వారి పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో జాబితా సిద్ధం చేసి ఇచ్చేసారు! మిగిలిన మద్దతుదారుల సంతకాలకు సిద్ధమవుతున్నారు.

స్టాలిన్ హుందా రాజకీయాల గురించి ఒక్క మాట చెప్పుకోవాలి! ఇక్కడ మెచ్చుకోవాలి! ఆయన పాలన అలాగే చేశారు! ఓడినా ఇప్పుడు కూడా అంతే హుందాగా వున్నారు! విజయ్ కే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని సూచించారు. మన మీడియా పుట్టించిన ద్రవిడ పార్టీల కలయిక అంతా ఒట్టిదే, అవి పుకార్లు మాత్రమే అని కొట్టి పడేసారు!

విజయ్ ప్రభుత్వం జోలికి రామని, తాము అడ్డు పడమని, ఆయనకు ఆరు నెలల వరకు సమయం ఇచ్చి చూస్తామని, ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదని స్టాలిన్ చెప్పేసారు! మిత్ర పక్షాలు విజయ్ ఆహ్వానిస్తున్నారు ఏం చేయాలని అడిగితే, తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అది పూర్తిగా మీ స్వేచ్చ నిర్ణయమని ఎంతో హుందాగా అన్నారు!

అన్నా డిఎంకెలో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం విజయ్ వైపు చూస్తున్నారు! విజయ్ కు మద్దతు ఇచ్చి అధికారంలోకి వెళ్దాం, ఇప్పటికే అధికారం కోల్పోయి చాలా ఏళ్ళు అయ్యిందని వాదిస్తున్నారు! అందుకే రిసార్టు క్యాంపులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది! మరో వైపు గవర్నర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించాలని విజయ్ నిర్ణయించుకున్న తరుణంలో ఇవాళ గవర్నర్ ఒక మెట్టు దిగారు! కోర్టు వరకు వెళ్ళక్కరలేదు, ముందు మీకే అవకాశం అని విజయ్ కు హామీ ఇచ్చారు!

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది! బిజెపితో పొత్తు పెట్టుకున్న అన్నా డిఎంకెతో పొత్తు పెట్టుకోనని విజయ్ ప్రకటించారు! అయితే ఇక్కడ విజయ్ పార్టీలో లాటరీ అల్లుడు ఆరవ్ రెడ్డి సెక్రటరీ జనరల్! ఆయన ఎమ్మెల్యే గా గెలిచారు. అత్త లీమా రోజ్ అన్నా డిఎంకె లో ఎమ్మెల్యే గా గెలిచారు! ఆమె అక్కడ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నదని పుకార్లు మొదలయ్యాయి! అలాంటివేం నమ్మొద్దని అరవ్ రెడ్డి అంటున్నారు!

ఇదిలా ఉండగా, దేశంలో మున్నెన్నడూ జరగని రీతిలో ప్రమాణ స్వీకార ఖర్చు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెట్టొద్దని, మొత్తం TVK పార్టీ భరిస్తుందని విజయ్ ప్రకటించారు. ఇప్పటికే అధికారులు విజయ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇంటి దగ్గర భద్రత పెంచారు! అయినా సరే, నా కారులో నేనొస్తా, ఏర్పాట్లు మీరు చేయండి ఖర్చు మాకు వదిలేయండి అని చెప్పడం ఒక సంచలన నిర్ణయమే అనాలి!

ముఖ్యమంత్రి కాబోతున్నప్పుడే ఎలా దోచేయాలి అని ఆలోచించే ఈ రోజుల్లో రాజకీయం పట్ల అవగాహన లేదనుకుంటున్న తరుణంలో విజయ్ వరసగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి! ముఖ్యంగా ఆయన ఓపికగా వ్యవహరిస్తున్న తీరు, హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టని తీరు, మీడియా ముందు ఒక్క మాట మాట్లాడని తీరు చూస్తుంటే ఇతను పక్కా చేతల మనిషి అనిపిస్తోంది! సినిమా చూపిస్తాడనే అనిపిస్తోంది!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!