Ch.Siva Ramprasad…………………..
అంతులేని కథ’ చిత్రంలో జయప్రద నటన ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అంతకు ముందు వరకు చిన్నపాత్రలకే పరిమితమైన ఆమెను, ఈ సినిమా ఒక పరిణతి చెందిన నటిగా ప్రపంచానికి పరిచయం చేసింది.
ఈ సినిమాలో ఆమె ‘సరిత’ అనే మధ్యతరగతి యువతిగా నటించారు. బాధ్యత లేని అన్నయ్య, పెద్ద కుటుంబం,వీరి పోషణ కోసం తన ఆశలను చంపుకుని, అందరినీ శాసించే ఒక “రాక్షసి”గా, అదే సమయంలో లోలోపల కుమిలిపోయే అభాగ్యురాలిగా అద్భుతమైన భావోద్వేగాలను పలికించారు.
డైరెక్టర్ బాలచందర్ మార్క్ క్లోజప్ షాట్స్‌లో ఆమె కళ్లు పలికించే భావాలు ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ఆమె చూపిన పరిణతి, త్యాగం ఆమె నటనకు నిదర్శనం. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే జయప్రదను “ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ”గా అభివర్ణించారు. ఆ అందానికి ఈ చిత్రంలోని గంభీరమైన అభినయం తోడై ఆమెను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది.
ఈ మూవీతో శ్రీప్రియ, ఫటాఫట్ జయలక్ష్మి మంచి గుర్తింపు పొందారు. నాటి సామాజిక స్థితిగతులను ఆవిష్కరించే నిలువుటద్దం..దర్శకుడిగా కె బాలచందర్ చేసిన ఓ సాహసం..అందులోని నటీనటుల కెరీర్‌నే మార్చేసిన ఓ అద్భుతం.. నటులను కాదు పాత్రలను మాత్రమే కళ్ల ముందు కదలాడించిన ప్రతిభ.
ఇలా ఎన్ని చెప్పినా, ఎంత పొగిడినా కె బాలచందర్ దర్శక ప్రతిభ ముందు తక్కువే అవుతుంది.. ఆ అద్భుత దృశ్య కావ్యం విడుదలై 50 ఏళ్లు అవుతోంది .హీరోయిజమే పరమావధిగా సినీ ఇండస్ట్రీ నడుస్తున్న వేళ హీరోయిన్ బేస్డ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన సినిమా అంతులేని కథ.
పెద్ద హీరోలు లేకుండా అప్పుడే ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకోవాలనే వారినే తన సినిమాలో పెట్టుకుని హిట్ చేశారు బాలచందర్. ఎంతో మంది హీరోలకు హీరోయిన్లకు తన సినిమాల్లో చాన్స్ ఇచ్చి వారికి బ్రేక్ ఇచ్చిన బాలచందర్ ఈ అంతులేని కథ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ పరిచయం చేశారు… ఆనాడు రజనీ కాంత్‌కు ఇచ్చిన పారితోషకం జస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమే.. నేడు ఆయన రేంజ్ ఏంటో మనకు తెలిసిందే. అలాగే కమల్‌హాసన్ కూడా..
ఇక ఈసినిమా గురించి మాట్లాడుకుంటే తమిళ్ సినిమా ‘అవల్ ఒరు తుడర్ కథయ్’కు తెలుగు రీమేక్ ఈ మూవీ… 25 సినిమాలు హీరో సెంట్రిక్‌గా తీసిన బాలచందర్ తన పంథాను మార్చుకుని ఒక్కసారిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అనగానే అందరూ కూడా ఎందుకొచ్చిందీ విపరీతం అంటూ ఆయన్ని హేళన చేసినవారు లేకపోలేదు.
అయితే తన కథను నమ్ముకున్న బాలచందర్ సినిమాను పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇంకో దర్శకుడు ఈ చిత్రాన్ని తీస్తే దాని పర్యవసానం ఎలా వుండేదో తెలియదు కానీ బాలచందర్ వల్లే ఈ అంతులేని కథ అటు తమిళ్‌లోనూ ఇటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ కొట్టింది.ఇప్పటికీ ఈ చిత్రంలోని పాటలు అందరి నోటా వినపడుతూ వుంటాయి.. అటు రేడియోలో, ఇటు టీవీల్లో అప్పుడప్పుడూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వుంటాయి.
ముఖ్యంగా దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట …తాళి కట్టు శుభవేళ, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు పాటలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. అలరిస్తాయి కూడా. MS విశ్వనాధం సంగీతం.. ఆత్రేయ పాటలు మాటలు..మరచిపోలేం.
రజనీకాంత్ కి మంచి క్యారెక్టర్..బాధ్యత లేని అన్నయ్యగా, తాగుబోతుగా.. మంచిగా మారిన తర్వాత చనిపోవటం రజనీ క్యారక్టర్‌లో లీనమై చేశాడు. ఆ తర్వాత తెలుగులో అనేక క్యారెక్టర్లు చెయ్యడానికి ఈ సినిమానే పునాది.
ఇంట్లో అద్దెకుండే కుర్రోడుగా నారాయణ రావు.. వితంతు సోదరిగా శ్రీ ప్రియ నటించారు. తెలుగులో నారాయణ రావు చేసిన పాత్ర తమిళ్‌లో కమల్ హాసన్ చేశారు. రజనీకాంత్, శ్రీప్రియ ,జయ లక్ష్మి రెండు భాషల్లో వాళ్ళ క్యారక్టర్‌నే చేశారు. తెలుగులో మాత్రం ఆఫీస్‌లో బాస్‌గా కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేశాడు.
జయలక్ష్మి తెలుగులో చాలా సినిమాలలో చెల్లి పాత్రలు వేసింది. అయితే ఈ సినిమాతోనే ఆమె ఒక్కసారిగా స్టార్ అయ్యిందనే చెప్పాలి…ఈ సినిమాలో ఆమె ఫటాఫట్‌గా మారి కుర్రకారుకు కి పిచ్చెక్కించడమే కాకుండా ఫ్యూచర్‌లో ఇంటి పేరుగా మార్చేసుకుని ఎన్నో చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది. తరువాత తమిళ్ యాక్టర్ లవ్‌లో పడి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంది… అదొక విషాదగాధ.
ఫైట్స్, డ్యూయెట్స్, ఏమీ లేకుండా తీసి సూపర్ హిట్ చేశారు దర్శకుడు బాలచందర్.. ఆ టైంకే కలర్ సినిమాలు రాజ్యమేలుతున్నా కూడా ఈ చిత్రాన్ని మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లోనే తీశారు ..ఆయన ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చేవారట తరువాత చిత్రాలను కూడా ఆయన బ్లాక్ అండ్ వైట్‌లోనే తీసారట. తెలుగులో మరోచరిత్ర ఈ కోవలోనిదే.
ఇదే సినిమాను కన్నడలో ‘బెంకియల్లి అరళిద హూవు’ పేరుతో తీశారు. సుహాసిని ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఈ కన్నడ వెర్షన్‌కు కూడా కె. బాలచందర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా యూ ట్యూబ్ లో ఉంది చూడని వారు ఉంటే చూడవచ్చు.

