D కంపెనీ తో వర్మ హిట్ కొడతారా ?

Sharing is Caring...

what is new in the old story …………………………. అసలు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఏం చేస్తున్నాడో ఏమో ? కానీ రామ్ గోపాల్ వర్మ “దావూద్ ఇబ్రహీం” మాత్రం రేపటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్  పై కనిపించబోతున్నాడు.  దావూద్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ  “డీ కంపెనీ” పేరిట ఒక కొత్త  సినిమా తీసాడు. మార్చిలో థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్  కారణంగా ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన స్పార్క్ ఓటీటీ లోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇందుకు సంబందించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. 

మాఫియా నేతల కథలతో సినిమాలు తీయడంలో వర్మ అందేవేసిన చేయి. గతంలో సత్య,సత్య 2,కంపెనీ, డీ  తదితర చిత్రాలన్నీ మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో తీసినవే. కంపెనీ కథ అయితే దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ లో వ్యక్తుల గురించే. వర్మ కాకుండా అనురాగ్ కాశ్యప్,నిఖిల్ అద్వానీ,మిలన్ లూద్రియా వంటి దర్శకులు కూడా దావూద్ ఇబ్రహీం జీవిత ఘటనలతో కొన్ని సినిమాలు తీశారు. అంతకు ముందు దీవార్ లాంటి సినిమాలు కూడా వచ్చాయి. వీటిలో కొన్ని తెలుగులో రీమేక్ కూడా అయ్యాయి. మాఫియా డాన్ అనగానే హత్యలు , మానభంగాలు, ప్రేలుళ్ళు, దోపిడీలు, ఛేజింగ్, స్మగుల్డ్ యాక్టీవిటీ చుట్టూ అల్లిన దృశ్యాలు మినహా కొత్త  సంఘటనలు ఏవీ కానరావు.

జీవిత కథ అనగానే కల్పన ఉండదు. కొత్తదనం ఉండదు. మరి వర్మ ఈ అరిగిపోయిన కథ లో కొత్తగా చూపేది ఏముంటుంది ? ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడు అనేది సినిమా విడుదల అయితే కానీ తేలదు. ఇరవైఏళ్ళ వయసులో దావూద్ ఇబ్రహీం ముంబై లోని డోంగ్రీ ప్రాంతంలో గ్యాంగ్ స్టర్ గా ఎలా ఎదిగాడు అనే అంశంపై కథ రాసుకుని తీసిన చిత్రమిది వర్మ అంటున్నారు.  టీజర్ చూస్తే మటుకు అంత గొప్పగా .. కొత్త గా ఏమీలేదు. సినిమాలో కొత్తగా ఏమి చూపారా అని వర్మ అభిమానులు.. వ్యతిరేకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక అసలు దావూద్ ఇబ్రహీం గురించి చెప్పుకోవాలంటే హాయిగా పాకిస్తాన్ లోని కరాచీ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. గత ఏడాది కరోనా బారిన పడి కోలుకున్నాడు. కుమారుడు వారసత్వం వద్దని మౌలానా గా మసీదు లో ఉంటున్నాడు. 93 ప్రేలుళ్ళ తర్వాత దావూద్ ఇండియా వదిలి వెళ్ళాడు. అక్కడ నుంచి అతగాడి అనుచరులను వరుసగా పోలీసులు లేపేశారు. దావూద్ నుంచి విడిపోయిన చోటారాజన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. మరో అనుచరుడు చోటా షకీల్ పాకిస్తాన్ లోనే ఉన్నాడని అంటారు. ఇతగాడు చనిపోయాడని కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే అవన్నీ కల్పితమే అంటారు. మరోసారి ఇతగాడి గురించి చెప్పుకుందాం. 

————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!