ఏమిటీ జ్యూస్ జాకింగ్ ??

Sharing is Caring...

Be careful…………….

కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నారా ? అయితే ఈ పోస్ట్  మీకోసమే .. చదవండి..  విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు,హోటళ్లు లేదా మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాలలో ఉండే USB ఛార్జింగ్ పోర్ట్‌ల ద్వారా హ్యాకర్లు మీ ఫోన్‌లోని డేటాను దొంగిలించడం లేదా మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడాన్ని జ్యూస్ జాకింగ్ (Juice Jacking)  అంటారు.

ఇది ఒక రకమైన సైబర్ దాడి.USB కేబుల్స్ కేవలం ఛార్జింగ్ కోసమే కాకుండా డేటా బదిలీ (Data Transfer) కోసం కూడా ఉపయోగపడతాయి. హ్యాకర్లు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలోని USB పోర్ట్‌లను లేదా కేబుల్స్‌ను ముందే తారుమారు చేసి ఉంచుతారు.అత్యవసరమైన సందర్భాలలో  మీరు మీ ఫోన్‌ను ఆ పోర్ట్‌కు కనెక్ట్ చేసినప్పుడు, మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారం (పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలు, ఫోటోలు, కాంటాక్ట్‌లు) హ్యాకర్లకు చేరుతుంది.

ఇటీవల కాలంలో ఇలా ఎక్కువగా జరుగుతోంది. చాలామంది మోసపోయారు. ఈ సైబర్ ముప్పు నుండి తప్పించుకోవడానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

@ పబ్లిక్ ప్లేసులలో USB పోర్ట్‌లకు బదులుగా నేరుగా ఎలక్ట్రికల్ వాల్ అవుట్‌లెట్‌లను (AC sockets) ఉపయోగించండి.
@ ఎల్లప్పుడూ మీ సొంత పవర్ అడాప్టర్. కేబుల్‌ను వెంట ఉంచుకోండి.
@  ప్రయాణాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ స్టేషన్ల మీద ఆధారపడకుండా సొంత పవర్ బ్యాంక్ ఉపయోగించడం సురక్షితం.

@ USB డేటా బ్లాకర్ (USB Data Blocker) దీన్నే”USB కాండమ్” అని కూడా అంటారు. ఇది ఛార్జింగ్ కేబుల్‌కు, USB పోర్ట్‌కు మధ్య ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది కేవలం విద్యుత్తును మాత్రమే అనుమతిస్తుంది, డేటా బదిలీని పూర్తిగా నిలిపివేస్తుంది. దాన్నివాడటం అలవాటు చేసుకోండి.  
@ ఫోన్‌ను ప్లగ్ చేసినప్పుడు “Trust this computer” లేదా “Share data” అని అడిగితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ‘No’ లేదా ‘Charge only’ ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇక జ్యూస్ జాకింగ్‌కు సంబంధించి అధికారికంగా నమోదైన బాధితుల వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. 
నోయిడాలోని ఒక ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థిని గుర్తుతెలియని ఛార్జర్‌ను ఉపయోగించినప్పుడు ఆమె ఫోన్ హ్యాక్ అయింది. హ్యాకర్ ఆమె వ్యక్తిగత ఫోటోలు, చాట్‌లను దొంగిలించి, ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు.

ముంబై పోలీసులు 2023 చివరలో నగరంలోని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో అక్రమ డేటా సేకరణ సెటప్‌లను గుర్తించారు. ఈ స్కామ్‌లో 50 మందికి పైగా బాధితుల వ్యక్తిగత డేటా దొంగిలించారు. ఒక వ్యక్తి విమానాశ్రయంలోని పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్‌ను ఉపయోగించిన కొద్దిసేపటికే,అతని బ్యాంక్ ఖాతా నుండి ₹80,000 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఛార్జింగ్ పోర్ట్‌లోని చిప్ ద్వారా మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యి డేటా చోరీకి గురైనట్లు దర్యాప్తులో తేలింది.

ప్రశాంత్ అహూజా అనే వ్యక్తి  నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను మార్చి, ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి హ్యాకర్లు ప్రయత్నించారు. అయితే బ్యాంక్ భద్రతా ఫీచర్ల వల్ల ఆ ప్రయత్నం విఫలమైంది.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇటీవలే  విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికుడి నుండి ఛార్జర్ తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది జ్యూస్ జాకింగ్ ముప్పుకు దారితీయవచ్చని సైబర్ నిపుణులు అప్పట్లో హెచ్చరించారు.

మీరు ఒకవేళ ఇలాంటి మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా 1930 నంబర్‌కు కాల్ చేయవచ్చు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!