నల్లమల అరణ్యేశ్వరిని దర్శించారా ?

Sharing is Caring...

దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు.

శ్రీశైలానికి 20 కిమీ దూరంలో దుర్గమారణ్యంలో ఇష్ట కామేశ్వరి కొలువైంది. అక్కడి గిరిజనులు చెప్పే వివరాల ప్రకారం సుమారు 5000 సం క్రితం ఇష్టకామేశ్వరి ఇక్కడ స్వయం భూ .. దేవతగా వెలిసింది.అప్పటి నుండి అక్కడి గిరిజనులే అమ్మవారికి నిత్య పూజలు చేస్తున్నారు. ఇక అమ్మవారి  ఆలయం ఒక చిన్న గుహాలా ఉంటుంది. అమ్మవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు మోకాళ్ల మీద వెళ్ళాలి. అమ్మవారిని  దర్శించి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి 40 రోజులలో తీరతాయని భక్తుల నమ్మకం.అందుకే ఆమెకు ఇష్ట కామేశ్వరి అనే పేరు వచ్చింది.

అమ్మవారు నాలుగు భుజాలను కలిగి వుంటుంది. రెండు చేతులలో తామర పుష్పాలను,మిగతా రెండు చేతుల్లో జపమాల, శివలింగం ధరించి కనిపిస్తుంది.అమ్మవారి నుదుట మీద బొట్టు పడుతున్న సమయంలో ఒక మనిషికి బొట్టు పెడుతున్నామా అన్న అనుభూతి కలుగుతుంది. నుదురు ప్రాంతం మెత్తగా తగులుతుంది. ఈ ఆలయానికి  చేరుకోవడం అంత సులభం కాదు. జీపులు మాత్రమే అక్కడికి వెళతాయి.

ప్రయివేట్ వాహనాలకు  అనుమతి ఇవ్వరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతితో  కాంట్రాక్టు జీపులు మాత్రమే నడుస్తాయి. శ్రీ శైలం నుండి డోర్నాల కు వెళ్ళే దారిలో సుమారు 11 కి.మీ దాటాక ఎడమ చేతి వైపు దట్టమైన అడవులలో నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ నుండి ఆ ప్రాంతం పూర్తిగా అటవీ శాఖ వారి రక్షణలోఉంటుంది. శ్రీ శైలం లో నంది జంక్షన్ నుంచి రోజు కు 10 జీపులు ఆలయ ప్రాంతానికి వెళుతుంటాయి. ఒకొక్క జీప్ లో సుమారు 10 మంది మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంది.

జీప్ లు ఆ ప్రాంతం చేరుకోగానే.. అటవీ శాఖ అధికారులు ప్రయాణికుల వివరాలు తీసుకుని ఆ అటవీ మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. జీపులో ప్రయాణం పెద్ద రాళ్ల మీదుగా, గతుకుల బాటలో సాగుతుంది. చుట్టూ కొండలు .. ఎత్తైన చెట్లు , చల్లని గాలి … వాతావరణం భిన్నంగా .. ప్రశాంతంగా ఉంటుంది.

జీపులు ఆలయానికి కొద్దీ దూరంలో ఆగుతాయి. ఒక విధంగా ఇష్ట కామేశ్వరి ఆలయానికి వెళ్లడం సాహస యాత్రే అని చెప్పుకోవాలి. ఆ జీపుల్లో ఒళ్ళు హూనం అవుతుంది. అయితే అమ్మవారిని చూశామన్న ఆనందంలో నొప్పులు మర్చిపోతాము. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!