Bharadwaja Rangavajhala………………. Rain songs that make the audience happy
వాన పాటలను తెరకెక్కించడం లో మన దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు. ఒక్కొక్కరిది ఒక్కో పోకడ. అక్కినేని,ఎన్టీఆర్ ల కాలం నుంచి ఈ నాటి వరకు ఎన్నో వానపాటలు ప్రేక్షకులను అలరించాయి.
తమిళ సినిమాల టైటిల్స్ చాలా పొయిటిక్ గా పెడుతూ ఉంటారు. భారతీరాజా తీసిన ఓ సినిమాకు మణ్ వాసనై అని పేరు పెట్టారు. అంటే మట్టివాసన అని అర్ధం.
తొలకరి చినుకులకు తడిసిన నేలలోంచి ఓ సుగంధం అలముకుని మనసుల్ని తన్మయపరుస్తుంది. వానపడ్డప్పుడు ప్రతి ఒక్కరికీ ఇది అనుభవమే. మన జీవితాలు వానలతోనే ముడిపడి ఉన్నాయి.
వేసవి తాపానికి నోర్లు తెరచుకుని నెర్రలు బారిన పుడమితల్లి వాన చినుకులతో దాహం తీర్చుకుంటుంది. చినుకులు ఎక్కడో భూమి గుండెలోతుల్లో దాక్కున్న విత్తనానికి జీవం పోస్తాయి. అంతే కాదు…ప్రేమికుల మనసుల్లో కూడా కొత్త భావాలను జీవం పోస్తాయి.
చలిచలిగా గిలి వేస్తుంటే…గిలిగింతలు పెడుతూ ఉంటే అని పాడిస్తాయి. తన్మయపరుస్తాయి.
అదే ఆత్మబలం సినిమాలో ఆత్రేయ చెప్పింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే అని … చెప్పలేదూ … మర్చిపోతారు .. ఇప్పుడైనా గుర్తు తెచ్చుకోండి …హన్నా …వర్షం ఎండిన నేలతల్లినే కాదు ప్రకృతిలోని ప్రతి జీవాన్నీ కుదుపుతుంది.
వాన ఒక ఆనందం… వాన ఒక ఆహ్లాదం… వాన ఒక సంబరం… వానే బతుకులకు భరోసా…సినిమాల్లో వాన పాటలు చూసినా మనసులు పులకించేది అందుకే… జగపతీ వారి ఆత్మబలంతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా చిటపట చినుకులు పల్లవితోనే ప్రారంభమయ్యే పాటలున్నాయి.
రెండు పాటలు అక్కినేని నటిస్తే ఒక పాట కృష్ణ నటించారు. అలాగే రెండు చిటపటచినుకులు ఆత్రేయ రాస్తే మూడో చిటపట చినుకులు మాత్రం వేటూరి రాశారు. అక్కాచెల్లెళ్లు సినిమాలో చిటా పటా చినుకులతో కురిసిందీ వానా అనే పాటలేదూ అది రెండో చిటపట చినుకులన్నమాట…
జగపతీ బ్యానర్ లో ముచ్చటగా మూడో సారి వచ్చిన చిటపట చినుకుల పాట ముద్దులకొడుకులో ఉంది. ఈ మూడో చిటపట చినుకుల పాట మాత్రం వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. మొదటి రెండు పాటలు రాసిన ఆత్రేయ ప్రారంభించిన మాటలతోనే పల్లవి కూర్చి ముద్దుకొడుకు పాట పూర్తి చేశారు వేటూరి.
చిట పట చినుకుల మేళం…తడిపొడి … తపనల తాళం అంటారు గురువుగారు.
అంటే ఏమిటో నాకూ పెద్దగా తెల్దనుకోండి… సన్నివేశం ఉద్వేగభరితం అయితే చాలు…దర్శకుడు వర్షాన్ని బొట్టుపెట్టి మరీ పిలిచేస్తాడు. ఈ ట్రెండుకు నాంది పలికింది మణిరత్నమే కావచ్చు. ఫైట్స్ మాత్రమే కాదు… హీరో హృదయం మీదకు నాయిక నడచివచ్చిన సందర్భాల్లోనూ వర్షం పడడం తప్పడం లేదు. ఆయన్ని చాలా మంది కుర్ర డైరెక్టర్లు ఫాలో అయిపోయి వర్షమో వర్షం అని ట్యాంకర్లకు ట్యాంకర్లు వర్షాన్ని పట్టుకురమ్మని నిర్మాతల్ని షంటేస్తున్నారు.
వానతో ప్రత్యేక సెంటిమెంటల్ ఎటాచ్ మెంట్ ఉన్న దర్శకుడు మణిరత్నం. తన చిత్రాల్లో వర్షంలో పాటైనా ఉండాలి. లేకపోతే ఫైటన్నా ఉండాలి. వర్షం ఆహ్లాదపరచడమే కాదు.. ఒక్కోసారి భయపెట్టేస్తుంది కూడా. అందుకే ఈ రెండు సందర్భాల్లోనూ మణిరత్నం వర్షాన్నే ఆశ్రయిస్తాడు.
మౌనరాగం లో ఓ అమ్మాయి…తన మనసులోని బాధను దిగమింగేసి…రీఛార్జి కావడానికి వర్షంలో నర్తిస్తుంది. అందుకే మేఘమొచ్చెనో…లాలి పాడెనో అని పాడేస్తుంది. మణిరత్నమే తీసిన మరో అందమైన వాన పాట గీతాంజలి సినిమాలో కనిపిస్తుంది. వేటూరి కలం నుంచే వచ్చిన ఈ గీతాన్ని ఇళయరాజా స్వరపరిచారు.
తుంటరి కథానాయిక ప్రవేశం కోసం ఈ వాన పాటను వాడుకున్నాడు మణిరత్నం. వానదేవుడే…కల్లాపి చల్లగా… వాయుదేవుడే ముగ్గేసి వెళ్లగా… నీలికొండ గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరి కోసమో… ఇదీ నాయకి తరపున వేటూరి అల్లిన కవిత్వం.
ప్రేక్షకులకు గ్లామర్ విందులు చేయడం ద్వారా సినిమా వసూళ్లు పెంచిన దర్శకుడు రాఘవేంద్రరావు కూడా వాన పాటల స్పెషలిస్టే. అరవైలకి దగ్గర పడ్డ ఎన్టీఆర్ కు నిండా ఇరవైకి చేరని శ్రీదేవిని జోడీ చేసి వేటగాడులో రాఘవేంద్రరావు తీసిన వానపాట… ధియేటర్లను మోతెక్కించింది. ఆకుచాటు పిందె తడిసే అంటూ చినుకుల్లో ఎన్టీఆర్ శ్రీదేవి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఎన్టీఆర్ తోనే కాదు… ఆ తర్వాత జనరేషన్ హీరోలతోనూ వానపాటలు తీసి సక్సస్ అందుకున్నారు దర్శకేంద్రుడు. ఇళయరాజా తో రాఘవేంద్రుడి తొలి చిత్రం ఆఖరిపోరాటంలో స్వాతి చినుకు సందె వేళలో అంటూ మరోసారి శ్రీని వానలో తడిపి ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేశారాయన.
వేటగాడు తర్వాత ఆ స్థాయిలో ఓ కమర్షియల్ సినిమా స్ట్రెంగ్త్ పెంచిన వాన పాట గ్యాంగ్ లీడర్ లో కనిపిస్తుంది. చిరంజీవి, విజయశాంతి నర్తించిన ఈ వాన పాట బప్పీలహరి స్వరకల్పనలో సాగుతుంది.
అప్పుడే కాదు…ఎప్పుడు ఆ పాట విన్నా రచ్చ రచ్చే … వానా వానా వెల్లువాయే… ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డు వాన పాటలు ఉన్నాయి.