ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది ?

Sharing is Caring...

‘సింహాసనం’ సినిమా మంచి సాంకేతిక విలువలతోనే తీశారు. రెండో సారి ఈ సినిమా చూస్తుండగా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం చేపట్టి , నటించి, నిర్మించిన తొలి చిత్రం ‘సింహాసనం’. 1986 మార్చి లో విడుదలైన ఈ జానపద చిత్రం అప్పట్లో బాక్సాఫీస్  రికార్డులు బద్దలు కొట్టింది. 

తెలుగు చిత్రసీమలో తొలి 70 ఎమ్.ఎమ్. సినిమాగానూ ‘సింహాసనం’ చరిత్రకెక్కింది.  ‘సింహాసనం’ చిత్రం లో కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. అంతకు ముందు సినిమాల్లో చూడని సూపర్ స్టార్ ను ఈ సినిమాలో చూడవచ్చు. చాలా యాక్టీవ్ గా .. డిఫరెంట్ మాడ్యులేషన్ తో కృష్ణ ఈ సినిమాలో అభిమానులను అలరించేలా నటించారు. 

ఈ సినిమా కు రచయిత మహారథి స్క్రిప్ట్ సమకూర్చారు. 1969 లో వచ్చిన జానపద చిత్రం ‘గండికోట రహస్యం’ సినిమాకు ‘సింహాసనం’ మూవీకి  కొన్ని పోలికలు ఉన్నాయి. ‘గండికోట రహస్యం’ లో హీరో ఎన్టీఆర్ కూడా రెండు పాత్రలు పోషించారు. ‘సింహాసనం’ లో విషకన్య పాత్ర, రాజగురువు  పాత్రను అదనం గా సృష్టించారు.ఇలాంటి పాత్రలే ‘చాణక్య చంద్రగుప్త’ లో కనిపిస్తాయి. కైకాల సత్యనారాయణే చంద్రగుప్త లో రాక్షసమంత్రిగా .. సింహాసనంలో రాజగురువు గా నటించారు.

ఇందులో కొన్ని పాత్రల ద్వారా ఆ నాటి సీఎం ఎన్టీఆర్ పై చురకలు వేయించారు. సత్యనారాయణ పోషించిన రాజగురువు పాత్ర .. డైలాగులు చూస్తే అది ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారా అనిపిస్తుంది. “నా దగ్గరేముంది బూడిద” అని ఒక చోట సత్యనారాయణ అంటాడు. ఆ పాత్ర కూడా కాషాయ దుస్తులు ధరిస్తుంది. అప్పట్లో ఎన్టీఆర్ కూడా కాషాయ దుస్తులు ధరించేవారు.

ఇదంతా చేయడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. సూపర్ స్టార్ సీతారామరాజు తీసిన నాటి నుంచే ఎన్టీఆర్ కి  కృష్ణకు విభేదాలు మొదలైనాయి. ‘కురుక్షేత్రం’ తో మరింత పెరిగాయి. 1984లో ఎన్టీఆర్ కి  నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి అధికార పగ్గాలు చేపట్టారు. నాదెండ్ల సీఎం కాగానే కృష్ణ ఆయనను అభినందిస్తూ ఓ ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు.

అయితే నెల రోజుల వ్యవధిలోనే నాదెండ్లను గద్దె దించి ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు కృష్ణను శత్రువులా ట్రీట్ చేసేవారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మరణంతో ప్రధాని అయిన రాజీవ్ గాంధీ కృష్ణ ను పార్టీలోకి ఆహ్వానించారు.  కాంగ్రెస్ లో చేరిన  కృష్ణ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేపట్టారు. నంద్యాలలో కృష్ణ బహిరంగ సభ ముగించుకుని వెళ్తుండగా  తెలుగుదేశం అభిమానులు రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో కృష్ణ కంటికి గాయం అయింది. కృష్ణ కంటి గాయం తోనే కర్నూలు లో కూడా ప్రచారం నిర్వహించారు. 

తనపై ఎన్టీఆరే దాడి చేయించారని కృష్ణ అప్పట్లో మీడియా మీట్ పెట్టి మరీ చెప్పారు. అప్పటి నుంచి కృష్ణ తెలుగుదేశం పైనా, ఆ పార్టీ అధ్యక్షుడైన ఎన్టీఆర్ పైనా నేరుగానే  విమర్శలు చేయడం మొదలెట్టారు. డైరెక్టుగా ఎన్టీఆర్ పాత్రనే కోటా శ్రీనివాసరావు చేత చేయించారు. ఆ సినిమా పేరు మండలాధీశుడు. 1987 లో ఈ సినిమా విడులైంది. ఈ పరంపరకు ముందుగా సింహాసనం లో ఒక ట్రయిల్ వేశారు కృష్ణ. ఎన్టీఆర్ ను విమర్శిస్తూ హీరో కృష్ణ తీసిన సినిమాలు గురించి మరో మారు చెప్పుకుందాం.

కృష్ణ ఎన్టీఆర్ కు వీరాభిమాని.. ఆవిషయం ఆయన ఓపెన్ గానే చెప్పారు. దేవుడు చేసిన మనుష్యులు సినిమా కూడా ఎన్టీఆర్ తో తీశారు. కృష్ణ కొన్ని విషయాల్లో ఎన్టీఆర్ ను అనుసరిస్తూ స్టార్ డం ఎంజాయ్ చేశారు. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రంతో దర్శకుడైతే, కృష్ణ జానపదం తో దర్శకుడు అయ్యారు. ఎన్టీఆర్ తన చిత్రాలకు కథ, చిత్రానువాదం, దర్శకత్వం వహించేవారు. అదే రీతిలో సింహాసనానికి కృష్ణ కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం నిర్వహించారు.

ఇక సింహాసనం ఆరోజుల్లో  మొదటి వారం 1 కోటి 51 లక్షల 65వేల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా మొత్తం మీద  రూ.4.5 కోట్లు వసూలు చేసిందని అంటారు. చెన్నైలోని వి.జి.పి.గార్డెన్స్ లో ‘సింహాసనం’ వంద రోజుల వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలకు ఏపీ నలుమూలల నుంచి కృష్ణ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఈ చిత్రాన్ని హిందీలో జితేంద్ర హీరోగా ఏకకాలంలో ‘సింఘాసన్’ పేరిట తెరకెక్కించారు. ఆ చిత్రానికి కూడా కృష్ణ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.హిందీ లో కూడా ఆదరణ పొందింది.ఈ సినిమా విడుదలై 36 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికి ఫ్రెష్ గా ఉన్న ఫీల్ కలుగుతుంది. యూట్యూబ్ లో సినిమా ఉంది. ఆసక్తిగలవారు చూడవచ్చు. 

——–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!