ఎన్నికలకు ముందు బీజేపీ లో చేరిన అపర్ణా యాదవ్ కి యోగి క్యాబినెట్లో ఛాన్స్ లభించవచ్చని
వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ముందు మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తారని అంటున్నారు. అదే నిజమైతే అపర్ణా యాదవ్ లక్కీ ఛాన్స్ కొట్టినట్టే.
ఈ ఏడాది ప్రారంభంలో అపర్ణా యాదవ్ బీజేపీ లో చేరారు. ఈ అపర్ణా యాదవ్ ఎవరో కాదు స్వయానా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు. ములాయం రెండవ భార్య సాధనా గుప్తా కుమారుడైన ప్రతీక్ యాదవ్ ను అపర్ణా 2011లో వివాహం చేసుకున్నారు.అపర్ణా 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు.
ఈమె తండ్రి అర్వింద్ సింగ్ బిస్ట్ జర్నలిస్టుగా పనిచేసి యూపీ సమాచార కమిషనరుగా చేశారు.
అపర్ణ తల్లి అంబీ బిస్ట్ లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగిని. అపర్ణా అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాలు అంశంపై మాంచెస్టర్ యూనివర్శిటీలో పీజీ చదివారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నార్సీకి అపర్ణా మద్ధతు పలికారు.
ఆర్టికల్ 370 రద్దును కూడా అపర్ణా యాదవ్ సమర్ధించారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి అపర్ణా గతంలో 11 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.చాలాకాలంగా ప్రధాని మోడీతో ,సీఎం యోగితో టచ్ లో ఉన్నారని అంటారు. ఇవన్నీ గమనించే అఖిలేష్ టిక్కెట్ ఇవ్వడానికి సుముఖత చూపలేదు.
గతంలో మాజీమంత్రులు స్వామి ప్రసాద్ మౌర్యా, దారాసింగ్ చౌహాన్, ధరం సింగ్ సైనీలతో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీని వదిలి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. వారి బాటలోనే నడిచి సమాజ్ వాదీ పార్టీ అధినేత సొంత బావ అఖిలేష్ యాదవ్ కు షాక్ ఇస్తూ అపర్ణా బీజేపీ తీర్థం స్వీకరించడం యూపీ లో సంచలనం సృష్టించింది.
ఉత్తర ప్రదేశ్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న క్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. క్యాబినెట్ బెర్తుల విషయంపై ఢిల్లీ స్థాయిలో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు.
ఈ సారి గత మంత్రివర్గంలో మంత్రులుగా పని చేసిన పలువురిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త కేబినెట్‌లో అపర్ణా యాదవ్, పంకజ్ సింగ్, శలభ్ మణి త్రిపాఠి, అసీమ్, అరుణ్, రాజేశ్వర్ సింగ్, దయాశంకర్ సింగ్ లకు మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం.