ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) షేర్ల బైబ్యాక్ ఆఫర్ ప్రకటించింది. వాటా దారులనుంచి ఒక్కో షేరును రూ.57.50 చొప్పున కొనుగోలు చేస్తుంది. 13.02 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఇందుకు దాదాపు రూ.749.10 కోట్లు వెచ్చించనుంది. ప్రస్తుతం నాల్కో షేర్లు రూ.47.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత కొంత కాలంగా నాల్కో షేర్ల ధరలు పెద్దగా పెరిగిన దాఖలాలు లేవు.షేర్ 52 వారాల గరిష్ట ధర రూ. 50 కాగా కనిష్ట ధర రూ 25 మాత్రమే. కంపెనీ మంచిదే అయినప్పటికీ .. పని తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బై బ్యాక్ ఆఫర్ ను ఉపయోగించుకోవడం తెలివైన నిర్ణయం. దీర్ఘకాలంలో లాభాలు పొందాలనుకుంటే ప్రస్తుత దశలో షేర్లను కొనవచ్చు.రికార్డు తేదీ ఫిబ్రవరి 8 గా కంపెనీ ప్రకటించింది.
ఈ కంపెనీ ఈక్విటీ లో ప్రభుత్వానికి 56 శాతం వాటా ఉంది. నాల్కో ఆసియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం కాంప్లెక్స్‌ను కలిగి ఉన్నది. ఇందులో బాక్సైట్ మైనింగ్, అల్యూమినా రిఫైనింగ్, అల్యూమినియం స్మెల్టింగ్ అండ్ కాస్టింగ్, విద్యుత్ ఉత్పత్తి, రైలు, పోర్ట్ సంబంధింత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నాల్కోబాక్సైట్ గని ఒరిస్సాలోని కొరాపుట్ జిల్లాలోని పంచపట్మాలి హిల్స్ వద్ద ఉంది. ఇది ఓపెన్-కాస్ట్ గని యంత్రాల సహాయంతో పనిచేస్తుంది. 1985 లోఇది ప్రారంభమైంది. అల్యూమినా రిఫైనరీకి ఫీడ్-స్టాక్‌ను అందిస్తుంది. నాల్కో అల్యూమినా రిఫైనరీ కొరాపుట్ జిల్లాలోని డామన్జోడి వద్ద ఉంది. ప్రపంచంలోని మొదటి పది అల్యూమినా రిఫైనరీలలోఇది ఒకటి. దీని అల్యూమినియం స్మెల్టర్ ఒరిస్సాలోని అంగుల్లోఉంది.
కంపెనీ తన ఉత్పత్తులను యుఎస్ఎ, జార్జియా, ఇరాన్, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, యుఎఇ దేశాలకు ఎగుమతి చేస్తున్నది.
నాల్కో భారీ ఎత్తున విస్తరణ, వివిధీకరణ పధకాలను చేపట్టబోతోంది. ఇందుకోసం 30 వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. 2027-28 ఆర్ధిక సంవత్సరం లోగా ఈ విస్తరణ .. వివిధీకరణ పనులను పూర్తి చేయాలన్న అంచనాలో ఉంది. కంపెనీ భవిష్యత్ అంచనాలు బాగానే ఉన్నప్పటికీ షేర్ ధర కదలికలో అంత స్పీడ్ లేదు. 2019 మార్చితో పోలిస్తే 2020 మార్చి నాటి ఆర్ధిక ఫలితాలు అంత ప్రోత్సాహకరం గా లేవు.
—————KNM