Bharadwaja Rangavajhala………………………….
తెలుగు సినిమా స్థాయిని పెంచిన కెమేరా దర్శకుల్లో విన్సెంట్ ఒకరు. 1928లో పుట్టిన విన్సెంట్ సొంతూరు కేరళలోని క్యాలికట్.విన్సెంట్ తండ్రికి ఆ రోజుల్లోనే ఫొటో స్టూడియో ఉండేది. కేమేరామెన్ మాత్రమే కాదు ఆయన ఆర్టిస్టు కూడా. అలా చిన్నతనంలోనే విన్సెంట్ కు కెమేరా వంటపట్టింది.
సీనియర్ ఇంటర్ పూర్తి చేసి చలో చెన్నై అన్న విన్సెంట్ జెమినీ స్టూడియోలో అప్రెంటిస్ గా చేరాడు. జెమినీలోనే సౌత్ ఇండియన్ కెమేరా మెన్లకు ఆదిగురువు కమల్ ఘోష్ ఉండేవారు. కమల్ ఘోష్ అద్భుతమైన కెమేరామెన్. దక్షిణాదిన తొలి డ్యూయల్ రోల్ చిత్రం అపూర్వ సహోదరులు ఆయన తీసిందే. ఆ కాలంనాటి కెమేరాతో రంజన్ ను ఇద్దరుగా చూపించడానికి ఆయన చాలా కష్టపడ్డారు.
ఆ సినిమా తమిళ, హిందీ వర్షన్లకు ఆయనే కెమేరా దర్శకుడు.ఆయన దగ్గర అసిస్టెంట్ గా విన్సెంట్ జీవితం ప్రారంభమైంది. కమల్ ఘోష్ దగ్గర పనిచేస్తున్నప్పుడే భానుమతి కళ్లల్లో పడ్డారు విన్సెంట్.భానుమతి స్వీయ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తూ…తీసిన చండీరాణికి సెల్వరాజ్ అధికారికంగా డిఓపి. అయితే అవుట్ డోర్ వర్క్ కోసం విన్సెంట్ ను తీసుకున్నారు.
నేరుగా తెలుగులో వచ్చిన తొలి ద్విపాత్రాభినయ చిత్రంగా చండీరాణిని చెప్పుకోవాలి.చండీరాణి తర్వాత నీల కోయిల్ అనే మళయాళ చిత్రానికి పూర్తిస్థాయి కెమేరా దర్శకత్వం వహించారు విన్సెంట్. అక్కినేని నాగేశ్వర్రావు నటించిన చిత్రాలకు ఎక్కువగా సెల్వరాజ్ కెమేరా దర్శకత్వం వహించేవారు.చండీరాణి సమయంలో సెల్వరాజ్ తోనే కలసి పనిచేశారు విన్సెంట్.
సెల్వరాజ్ తర్వాత ఎఎన్నార్ నటించిన సినిమాలకు ఎక్కువగా కెమేరా బాధ్యతలు చూసింది విన్సెంటే. అలాగే ఎ.వి.ఎమ్ వారి లేతమనసులు, భక్త ప్రహ్లాద లాంటి చిత్రాలకు కూడా విన్సెంటే కెమేరా దర్శకుడు. అక్కినేని నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ ప్రేమనగర్ కు తెలుగులో ఎస్.వెంకటరత్నం డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా వ్యవహరించారు.
అదే సినిమాను హిందీలో రీమేక్ చేసే సమయంలో విన్సెంట్ ను తీసుకున్నారు కె.ఎస్.ప్రకాశరావు. నిజానికి ప్రకాశరావు దర్శకత్వం వహించిన చాలా చిత్రాలకు విన్సెంటే కెమేరా దర్శకుడు. కె.బాపయ్య తొలి సూపర్ హిట్ మూవీ సోగ్గాడు కూడా విన్సెంట్ కెమేరాలో పురుడు పోసుకున్నదే. విన్సెంట్ గొప్పతనం ఏమిటంటే…గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో సాధ్యమైనంత వరకు లైటింగ్ ఏర్పాట్ల తోనూ కెమేరా వర్క్ ద్వారానే ట్రిక్ షాట్స్ తీయడం.
ఆయన భక్త ప్రహ్లాద నుంచి అన్నమయ్య వరకు ఇదే పద్దతి అనుసరించారు. గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత కూడా… సాధ్యమైనంత వరకు తను పనిచేసిన సినిమాల్లో వాటిని ఉపయోగించేవారు కాదు. మిచెల్ కెమేరా కన్నా ముందు డెబ్రీ కెమేరా ఉండేది. పెద్ద పెట్టెలాగా ఉండేది.ఆ కెమేరా రోజుల్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు విన్సెంట్. మొదట డెబ్రీ, ఆ తర్వాత మిచెల్ నుంచి మొదలు పెట్టి రీసెంట్ డిజిటల్ కెమేరాల వరకు అన్నిటి మీదా ఆయన పనిచేశారు.
గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నారు. అన్నమయ్య సినిమా టైమ్ లో గ్రాఫిక్స్ ను సాధ్యమైనంత నిలువరించి తన పద్దతిలోనే తీసుకెళ్లిపోయారు. అన్నమయ్య చిత్రంలో గ్రాఫిక్స్ లా అనిపించే సీన్స్ అన్నీ లైటింగ్ ఎడ్జస్ట్ మెంట్స్ తో తీసినవే.వెంకటేశ్వర స్వామిని చూపించే సీన్స్ కూడా బ్యాక్ లైట్ ద్వారా తీసుకొచ్చిన ఎఫెక్టే కానీ…గ్రాఫిక్స్ కాదు. బ్యాక్ లైట్ ప్రయోగం ద్వారా ఒక హాలోని క్రియేట్ చేసి దాని తర్వాత వెంకటేశ్వరస్వామిని క్లియర్ గా చూపిస్తారు.
దీంతో ప్రేక్షకులకు వెంకటేశ్వరుని సాక్షాత్కారం జరిగినట్టే అనిపిస్తుంది. అదే టెక్నిక్ వాడి తీసిన షాట్ అది. భక్త ప్రహ్లాదలో స్థంభం చీల్చుకుని నరసింహావతారం బైటకు రావడం…హిరణ్యకసిపుడి వధ షాట్స్ అన్నీ కెమేరా వర్క్ తో చేసినవే తప్ప ఏ ఇతర టెక్నిక్కూ వాడలేదు.రాఘవేంద్రరావు డైరక్షన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికీ విన్సెంటే కెమేరా దర్శకుడు.
అందులో కూడా అనేక ట్రిక్ షాట్స్ లైటింగ్ ఉపయోగించడం ద్వారా ప్రయోగాత్మకంగా చిత్రీకరించారు. ముఖ్యంగా ‘అందాలలో అహా మహోదయం’ పాట విన్సెంట్ ప్రతిభకు నిదర్శనం. తెలుగులో స్టార్ కెమేరామన్లుగా వెలిగిన కె.ఎస్.ప్రకాశ్, నవకాంత్, జైనన్ తదితరులు విన్సెంట్ దగ్గరే పనినేర్చుకున్నారు. కేవలం బిగ్ మూవీస్ మాత్రమే కాదు. స్మాల్ బడ్జట్ మూవీస్ కూడా విన్సెంట్ చేతిలో అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి.
స్వతహాగా కథాత్మక చిత్రాలను ఇష్టపడేవాడు విన్సెంట్.ఆయన మళయాళంలో దర్శకత్వం వహించిన తులాభారం చిత్రమే ఇందుకు ఉదాహరణ.అదే సిన్మా తెలుగులో మనుషులు మారాలి గా తీశారు వీఎమ్మార్. దర్శకుడుగా విన్సెంట్ తొలి చిత్రం భార్గవి నిలయం లో హీరోయిన్ గా విజయనిర్మల నటించడం విశేషం.
విన్సెంట్ కేవలం కెమేరా దర్శకుడు మాత్రమే కాదు. తన మనసుకు నచ్చిన కథలను తెరకెక్కించిన విజనున్న దర్శకుడు కూడా.మళయాళంలో ఆయన తీసిన తులాభారం చిత్రం అప్పట్లో పెద్ద సంచలనం. శారదను తొలిసారి ఊర్వశిని చేసింది ఆ చిత్రమే.మళయాళ రచయిత బాసి రాసిన నవల తులాభారం నచ్చి దాన్ని సినిమా తీయాలని సంకల్పించాడు.
అరవై దశకం లో భారతదేశంలో పీక్స్ కి వెళ్లిన దోపిడీ, పెరిగిపోయిన నిరుద్యోగం, దరిద్రం… సమస్యలను స్ట్రెయిట్ గా ప్రస్తావించిన సినిమా తులాభారం. తెలుగులోనూ లో బడ్జట్ మూవీస్ ను అందంగా తెరకెక్కించేందుకు సహకరించారు విన్సెంట్. కె.రాఘవేంద్రరావు తొలి చిత్రం బాబుకి విన్సెంటే కెమేరా బాధ్యతలు నిర్వహించారు.అలాగే దర్శకుడుగా రాఘవేంద్రరావు కు పాపులార్టీ తీసుకువచ్చిన జ్యోతి చిత్రానికి కూడా విన్సెంట్ పనిచేశారు.
పవర్ ఫుల్ కథలను చెప్పడానికి బ్లాక్ అండ్ వైట్ లో తీయడమే బెటర్ అనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తారు విన్సెంట్. జ్యోతి తర్వాత రాఘవేంద్రరావు చేసిన బిగ్ వెంచర్ అడవిరాముడుకూ వెన్ను దన్నుగా నిలబడ్డారు విన్సెంట్.అందులో ఎన్టీఆర్, జయప్రదల మీద చిత్రీకరించిన కోకిలమ్మ పెళ్లికి కోనంతా సందడి పాట ఓ అద్భుతం. ఆ పాట స్కీమే అదిరిపోతుంది.
వేటూరి కూడా చాలా ఇంటర్యూల్లో ఆ పాట చిత్రీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. రాఘవేంద్రరావు కి కె.ఎస్.ప్రకాశ్ పర్మనెంట్ డిఓపిగా మారడానికి ముందు వరకు విన్సెంటే కెమేరా దర్శకుడు.ప్రకాశ్ అకాల మరణం తర్వాత కూడా రాఘవేంద్రరావు చిత్రాలకు పనిచేసింది విన్సెంటే.
విశ్వనాథ్ డైరక్ట్ చేసిన చిరంజీవి చిత్రం ఆపద్బాంధవుడు కూడా విన్సెంటే కెమేరా బాధ్యతలు భుజాన వేసుకున్నారు.అందులో పాటలన్నీ చాలా ఆహ్లాదకరంగా చిత్రీకరించారు విన్సెంట్. విన్సెంట్ తో కోరి మరీ పనిచేయించుకున్న నిర్మాత కాట్రగ్డ మురారి.యువచిత్ర బ్యానర్ లో చివరి చిత్రం నారీ నారీ నడుమ మురారి కి విన్సెంటే కెమెరా దర్శకుడు.
బాలకృష్ణను గ్లామరస్ గానే కాదు హ్యాండ్సమ్ హీరోగా చూపించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు విన్సెంట్. ఈ సందర్భంగా మురారి చెప్పిన విషయం ఓటి గుర్తు చేసుకుందాం.నారీ నారీ మురారి సినిమా షూటింగు జరుగుతున్న సమయంలో విన్సెంట్ జేబులో వాజ్ లైన్ సీసా ఉండేదట.అదెందుకు అని అడిగితే మీ హీరో నడుం కింది భాగం మరీ లావుగా ఉంది నాయనా అది మేనేజ్ చేయడానికి నా తిప్పలు నేను పడుతున్నా అన్నార్ట విన్సెంట్.
కొడుకులనూ పాపులర్ డీఓపీలుగా చూసుకున్న విన్సెంట్ ఇక చాలంటూ 2015 ఫిబ్రవరి నెల్లో కన్నుమూశారు.విన్సెంట్ పేరు వినగానే దిల్ ఎక్ మందిర్ సినిమాలోని రఫీ సూపర్ హిట్ సాంగ్ యాద్ న జాయే గుర్తొచ్చి తీరుతుంది.
vincent ఫోటో గ్రఫీర్, అలాగే సినిమాటోగ్రఫీ లో ఆయా ప్రతిభ మీ వ్యాసం లో ప్రతిబింబించింది.