ఏమి రాసినా ఆయనకే చెల్లింది !

Sharing is Caring...

Arudra’s writings are amazing……………………….

“ఆశ్చర్యంగా రాస్తాడు ఆహ్ రుద్ర! “అన్నాడు ప్రముఖ కవి పట్టాభి. ఆ మాట నిజమే …ఆయన రచనలను పరికించి చూస్తే .. ఒకదాని కొకటి సంబంధం లేని సబ్జెక్టులు. భక్తి ..రక్తి ..ముక్తి ..శృంగారం అన్ని రసాలను ఆయన టచ్ చేశారు. ఏది రాసినా ఆరుద్రకే చెల్లింది. 

‘శ్రీరామ నామాలు శతకోటి.. ఒక్కొక్క పేరు బహుతీపి.’ అంటూ మీనా సినిమాలో రామాయణాన్నంతటిని ఒక్క పాటలోనే ఆవిష్కరించిన ఆరుద్ర గురించి తెలియని వారు ఆయన గొప్ప దైవభక్తి పరుడు అనుకుంటారు. కానీ ఆయన పక్కా హేతువాది. వీర కమ్యూనిస్టు. అంతేకాదు… అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకరు. 

ఆరుద్ర చిన్నతనం నుంచే స్వతంత్ర భావాలతో పెరిగారు. ‘స్కూల్ పరీక్షలకు వెళ్లేముందు దేవుడికి దణ్ణం పెట్టుకో’ అని తల్లిదండ్రులు చెబితే, ‘దేవుడొచ్చి పరీక్షలు రాస్తాడా?’ అని  సమాధానం చెప్పేవాడట. పదిహేడో ఏటనే ఆరుద్ర కలంపట్టారు. పురాణాలను పుక్కిట పట్టారు. అందుకే భక్తి  పాటలు అద్భుతంగా రాసేవారు.

ఎన్నో ఆణి ముత్యాల వంటి పాటలు ఆరుద్ర కలం నుంచి జాలువారాయి. శ్రీరాముడి ఫై ఆయన అద్భు‌త‌మైన పాటలు రాయడం ఒక చిత్రం.  ‘పలుకే బంగా‌ర‌మా‌యెరా కోదండ రామా’‌ (అందా‌ల‌రా‌ముడు), ‘మేలుకో శ్రీరామ −‌ మేలుకో రఘు‌రామ’‌; ‌‘శ్రీయు‌తమౌ శ్రీరా‌మ‌ నామం జీవా‌మృ‌త‌సారం’‌ (శ్రీ రామాం‌జ‌నేయ యుద్ధం), ‘వెడ‌లెను కోదం‌డ‌పాణి’ ( ‌‘సీతా‌ కల్యాణం) ‘చూసి‌న‌వా‌రిదె వైభోగం’‌ (సంపూర్ణ రామా‌యణం), ‌ ఇవన్నీ కూడా సూపర్ హిట్ సాంగ్స్ … ఇందులో బాపు సినిమాలే ఎక్కువ.

ఇక భక్తి పాటలు కాకుండా ” పవిత్ర బంధం లో ” గాంధీ పుట్టిన దేశమా ఇది” .. పాట ఈ నాటి దేశ పరిస్థితికి అద్దం పడుతోంది. ఆంద్ర కేసరిలో “వేదంలా ప్రవహించే గోదావరి ” అందాల రాముడు లో ” ఎదగడానికికెందుకురా తొందర “గోరంత దీపం లో ” రాయినైనా కాకపోతిని ” ఆత్మ గౌరవం లో ” రానని రాలేనని ఊరకె అంటావు.  ఆత్మీయులులో ” స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు” దేవదాసులో “కల చెదిరింది … కథ మారింది ” వంటి అనేక గొప్ప పాటలు రాశారు.

ఆరుద్ర పాటలు కొన్ని వింటుంటే అవి ఆత్రేయ శైలిలో ఉన్నాయా అనిపిస్తుంది. కృష్ణ దేవదాసు కి పాటలన్ని ఆరుద్ర రాశారు. సినిమాలకు పాటలే కాకుండా కథ మాటలు కూడా సమకూర్చేవారు. అగ్రశ్రేణి రచయితగా దాదాపు 30 ఏళ్ళు చిత్రపరిశ్రమలో ఉన్నారు. గూఢచారి 116.. మోసగాళ్లకు మోసగాడు సినిమాలకు ఆరుద్రనే కథా మాటలు  సమకూర్చారు. హీరో కృష్ణ  ఆ సినిమాకు డైరెక్షన్ చేయమని అడుగగా వద్దని తిరస్కరించారు.

ఇంకా డిటెక్టివ్ నవలలు మొదలు సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల వరకు ఆరుద్ర ఎన్నో గ్రంధాలు రాశారు. కూనలమ్మ పదాలను బాపుకి అంకితమిచ్చారు.ఈ కూనలమ్మ పదాల్లోనే
“రెండు శ్రీల ధరించి
రెండు పెగ్స్ బిగించి
వెలుగు శబ్ద విరించి
ఓ కూనలమ్మ!” అంటూ శ్రీ శ్రీ గురించి రాశాడు.  

అన్నట్టు మహాకవి శ్రీశ్రీకి వేలు విడిచిన మేనల్లుడు కూడా. అయన పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ‘అనుగ్రహం’ సినిమా స్క్రిప్ట్ విషయంలో శ్రీశ్రీ కి ఆరుద్ర కి చిన్నపాటి తేడాలొచ్చాయి. చాలా కాలం ఇద్దరి మధ్య మాటలు లేవు.

—————KNM

courtesy…. image owner

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. Ramjee April 6, 2025

Leave a Comment!

error: Content is protected !!