విధి లిఖితం కృష్ణుడిని వదల్లేదా ??

Sharing is Caring...

Destiny is written………………….

రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. ఎందరో కన్ను మూస్తుంటారు. ఏరోజున ఎవరికి మరణం రాసి పెట్టి ఉందో ఎవరికి తెలీదు. మరణాన్నితప్పించుకుందామని ప్రయత్నించినా అది విఫల యత్నమే.

మృత్యువు తన పని తాను చేసుకువెళ్తుంది. అంతా విధి లిఖితం ప్రకారం జరగాల్సిందే. విధిని ఎదుర్కొనే వారు లేరు. శ్రీ కృష్ణుడు అంతటివాడు మృత్యువు ముంచు కొచ్చినపుడు చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఎవరికి ఎలా రాసి పెట్టి ఉందొ అలానే జరుగుతుంది. ఎవరూ విధిని శాసించలేరు.      

“మహాభారతం” మౌసల పర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల ఘట్టం ఒక్కసారి పరిశీలిస్తే…ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధు గణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.

ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు విగతజీవై కనిపించాడు. అర్జునుడు కుమిలిపోయాడు. రోదించాడు.

అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి.ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలులేదు (అప్పటికే ద్వారక సముద్రంలో మునిగిపోయింది, చూసినవాడు అర్జునుడే ) చేసేదేమీలేక, మంత్రానికి బ్రాహ్మణులు,క్రియలు ఏమీ లేకుండానే అక్కడికక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు ఏ అర్భాటమూ, లేకుండా ముగించేశాడు.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు,ఎంతో బలగం, బంధు జనం,అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియలకు సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతిహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.మనమంతా కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఎప్పుడు ఎవరికి ఎలా రాసిపెట్టుందో ఎవరు చెప్పలేరు.ఎవరు ఊహించలేరు.జీవితం ముగింపు ఎలాఉంటుందో అంచనా వేయలేం.

——Theja  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!