Sheik Sadiq Ali………………………………..
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగి పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికోసమే ఈ ప్రత్యేక కథనం . ఆధునిక భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.
1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. నిజం చెప్పాలంటే , ఇప్పటికన్నా అప్పుడే చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి ఈతరం వారికి తెలియజెప్పటమే ఈ కథనం ముఖ్యోద్దేశ్యం.
ఇది ఒక యోగి జీవిత కథ. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశ రాజకీయాలను కంటి సైగతో శాసించిన ఒక బ్రహ్మచారి కథ. తారాజువ్వలా నింగికి ఎగసి నేలరాలిన ధీరేంద్ర బ్రహ్మచారి కథ. ఇందిరా గాంధీని, సంజయ్ గాంధీ ని, మొత్తం గాంధీ పరివారాన్ని నడిపించిన ఒక రాజగురువు కథ.
ఆద్యంతం మలుపులతో, సినీ ఫక్కీలో నడిచిన ఈ యోగి జీవిత కథ ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఎవరీ బ్రహ్మచారి? మా తరం, మాకన్నా ముందు తరం వారికి తెలిసిన కథే. కానీ, భారత భవిష్యత్తును నిర్దేశించే నవతరానికి ఈ కథ తెలియాల్సిందే.
13 వ ఏటే ఇల్లు వదిలి సన్యాసుల్లో కలిసిన ఒక కుర్రాడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? కట్టుబట్టలతో బయటికి వచ్చిన వాడు వేలకోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీకి రాజగురువు ఎలా అయ్యాడు?
ఎవరి మాటా వినడని ప్రఖ్యాతి చెందిన సంజయ్ గాంధీని ఎలా మచ్చిక చేసుకున్నాడు? ఇప్పటికీ మిస్టరీ వీడని విమాన ప్రమాదంలో ఎలా మరణించాడు? ఇవన్నీ ఆద్యంతం ఆసక్తికరం.
బీహార్ రాష్ట్రం మధుబన్ జిల్లా సాయిత్ చాన్పూర్ గ్రామంలో 1924 ఫిబ్రవరి 24 వ తేదీన పుట్టాడని కొందరు,1925 లో పుట్టాడని కొందరు చెబుతారు. అలాగే అతని అసలు పేరు ధీరేంద్ర చౌదరి అనీ,తండ్రి పేరు భంభోల్ చౌదరి అని కొందరు కాదు..కాదు అతని పేరు ధీరేంద్రశర్మ అని కొందరు అంటారు. నిజమేమిటో ఇప్పటికీ తెలియదు. ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1954 లో మాత్రమే.
కలకత్తాలో ప్రజలను పరిచయం చేసుకున్నపుడు ఆయన చెప్పిన వివరాలు చదివితే కొంచెం ఆశ్చర్యంగా అన్పిస్తుంది. ‘సన్యాసులకు సొంత ఊరూ ,పేరూ ఉండవు. కాబట్టి ఊరేదని అడగొద్దు. 13 వ ఏట భగవద్గీత ఇచ్చిన స్పూర్తితో ఇల్లు వదిలి వారణాసి వెళ్లి సన్యాసిగా మారాను. లక్నో కు సమీపంలో ఉన్న గోపాల్ ఖేరా ఆశ్రమంలో కార్తికేయ మహర్షి ఆశ్రమంలో చేరాను. ఆ మహర్షి 325 ఏళ్ళు జీవించి 1953 లో మరణించారు. వారు జీవించి ఉండగా అతిప్రాచీన భారతీయ యోగవిద్యను సాధన చేశారు.
ఆ విద్య భారత్ లో అంతరించి పోయింది. కేవలం టిబెట్ లో మాత్రమే మిగిలి ఉంది దాన్ని మళ్ళీ బతికించి భారత ప్రజలకు అందించాలనేది.వారి కోరిక. వారి వద్ద నేను నేర్చుకున్న విద్యను కలకత్తా ప్రజలకు నేర్పించెందుకే వచ్చాను. నా వయసు నిజానికి చాలా పెద్దది. కానీ చూడ్డానికి యువకుడిలా కన్పిస్తాను. దానికి నేను సాధన చేస్తున్న యోగ,సూక్ష్మ వ్యాయమాలే కారణం.’ ఇలా తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చిన ధీరేంద్ర తనను తాను నిర్వచించుకున్నాడు.
నిలువెత్తు విగ్రహం, ఆజానుబాహు,కాంతులీనే మేనిఛాయ,అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు. ఎలా తిప్పితే అలా తిరిగే దేహం ,వాటికి తోడూ అద్భుతమైన యోగ విన్యాసాలు. ప్రకృతి వైద్యం అదనపు ఆకర్షణలు. ఇవన్నీ చూసిన స్థానికులు ఆయనను ఆదరించారు.చిన్న అద్దె ఇంటిలో మొదలైన జీవితం అతికొద్ది కాలంలోనే ఖరీదైన భోగవంతమైన ఆశ్రమానికి మారింది. నగరంలోని ప్రముఖులు,ముఖ్యంగా సంపన్న కుటుంబాల మహిళలు అతని శిష్యులయ్యారు.
పాపులారిటీ, సంపాదనా పెరిగాయి. అక్కడి నుంచే అతని మహర్దశ మొదలైంది.యోగాసనాలు వేయటంలో ఇప్పటి రాందేవ్ బాబాను మించిన వాడు. తాను యోగా చేస్తుండగా తీసిన ఫోటోలు, వాటి వివరాలతో ‘సూక్ష్మ వ్యాయాం అండ్ యోగాసన’ అనే పుస్తకాన్ని రూపొందించాడు. అప్పుడే జయప్రకాశ్ నారాయణ కలకత్తా వచ్చారు. మిత్రుల సహకారంతో ఆయనను కలిసి తన పుస్తకానికి ముందు మాట రాయించుకున్నాడు. ఆ పుస్తకం బాగా ఆదరణ పొందింది.
ఆసక్తికరంగా రాస్తున్నారు సర్ ! అభినందనలు.