యోగికి కలిసొచ్చిన అంశాలేమిటో ?

Sharing is Caring...

సీట్లు కొన్ని తగ్గినా యూపీ లో బీజేపీ విజయఢంకా మోగించింది. 36 ఏళ్ల తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ కొత్త రికార్డ్ సృష్టించింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాజకీయ పార్టీలు పరిగణించాయి. దీంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది.

ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ తోపాటు సీఎం యోగి చేపట్టిన పధకాలు జనాల్లోకి వెళ్లాయి. మాఫియాపై ఉక్కుపాదం మోపి యోగి శాంతి భద్రతలకు ప్రాధాన్యమిచ్చారు. కరడు గట్టిన రౌడీషీటర్లను ఎన్‌కౌంటర్ చేయించేశారు.  యోగి శైలి గమనించిన రౌడీలు రాష్ట్రం వదిలి పారిపోయారు. వ్యూహాత్మకంగా గ్యాంగ్‌స్టర్‌ల ఇళ్లను, స్థావరాలను యోగి ప్రభుత్వం బుల్‌డోజర్లతో కూల్చేసింది. ఈ చర్యలన్నీ ప్రజలపై పెనుప్రభావాన్ని చూపాయి. యోగి పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం కూడా పార్టీకి ప్లస్ అయిందని చెప్పుకోవాలి. 

కేంద్రంలో మోడీ, యూపీలో యోగి ఉంటే అభివృద్ధి తధ్యమనే విషయాన్ని ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు అర్థమయ్యేలా ప్రచారం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అన్న మాట ప్రజల్లో బాగా నాటుకుపోయి పాజిటివ్ గా స్పందించారు.  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ .. కుల సమీకరణ వ్యూహాలు పన్నినప్పటికీ  ఓటర్లు తిరస్కరించారు.

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 275 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది.గత ఎన్నికలతో పోలిస్తే.. సమాజ్‌వాదీ పార్టీ పుంజుకున్నప్పటికీ.. 121 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్‌ లాంటి పార్టీలు మరీ ఘోరంగా  ఓడిపోయాయి. ప్రతిపక్షాలు అనైక్యత కూడా బీజేపీకి ప్లస్ అయింది పాలనలో యోగి మొదటి నుంచి తనదైన ముద్ర వేశారు. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే అజెండాతో యోగి పనిచేయడం బీజేపీకి కలసి వచ్చిన అంశం. 

గత ప్రభుత్వాల మాదిరిగా కొన్నివర్గాలను మాత్రమే సంతృప్తి పరిచే విధానాలకు యోగి సర్కారు మంగళం పాడింది. జనాలను ఆకట్టుకున్న అంశాలలో ఇదొకటి.సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామమందిర అంశం కోర్టు ద్వారా పరిష్కారం కావడం యోగి సర్కారుకు బాగా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా భూసేకరణ జరిగి దివ్య రామమందిర నిర్మాణం కొనసాగుతుండటం బీజేపీ కి అడ్వాంటేజ్‌గా మారింది.

అలాగే కాశీలో ఆలయ విస్తరణ పనులు హిందువుల సెంటిమెంట్ ను మరింత పెంచాయి.  కేంద్ర ప్రభుత్వ పథకాలను యూపీలో పకడ్బందీగా అమలు చేశారు. సాగుచట్టాలు..  జాట్ల ఓట్లను బీజేపీకి  దూరం చేశాయనే ప్రచారానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఈ కులం ఎక్కువగా ఉండే పశ్చిమ యూపీలో కూడా మెజార్టీ స్థానాల్లో కమలం వికసించింది. ఇక్కడ మిగిలిన హిందూ కులాలు కూడా బీజేపీ కి మద్దతు ఇచ్చాయి.

ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఆయుధాలుగా మలుచుకుని తిరిగి వారిపైనే ప్రయోగించడంలో ప్రధాని మోడీ దిట్ట.ఈ ఎన్నికల్లో ‘‘ చివరి రోజుల్లో కాశీకి వస్తారు’’ అంటూ అఖిలేశ్‌ చేసిన వ్యాఖ్యలను మోడీ తన ప్రచారంలో చక్కగా వాడుకొన్నారు. “తాను కాశీలో చనిపోవడాన్ని గౌరవంగా భావిస్తా” అంటూ  ప్రకటించి మోడీ భావోద్వేగాలను  ప్రేరేపించారు.  ఈ మాటలు కూడా సైలెంట్ గా పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద వ్యూహాత్మకంగా  పనిచేసి ఓట్లను రాబట్టుకుంది. మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టబోతున్నది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!