ఎవరీ చోటా రాజన్ ?

Sharing is Caring...

CHOTA DON  ……………… 

అండర్ వరల్డ్ డాన్ గా చలామణి అయిన చోటా రాజన్ కోవిడ్ సోకి చనిపోయాడని కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి. తర్వాత  అబ్బే కాదు..కాదు… బతికే ఉన్నాడని ఖండన వార్త లొచ్చాయి.అరెస్ట్ అయిన చాలాకాలం తర్వాత రాజన్ ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. రాజన్ ప్రస్తుతం తీహార్  జైలు నెం 2..లో ఉన్నాడు.

ఈ చోటా రాజన్ గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలున్నాయి. ఇతగాడొక డేంజరస్ క్రిమినల్. అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్కే. ప్రాణాలు తీయడంలో దిట్ట. ఒకప్పుడు ముంబాయి ని ఏలిన డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు.

2015 నుంచి చోటా రాజన్ న్యూ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్నాడు. రాజన్ పై సుమారు 80 కేసులు నమోదు అయ్యాయి. ఇవన్నీ విచారణలో ఉన్నాయి. వీటిలో దోపిడీలు.హత్యలకు సంబంధించిన కేసులే ఎక్కువ. వీటిపై విచారణ కోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేశారు.

2011 జూన్ లో మిడ్ డే పత్రికలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న జ్యోతిర్మాయ్ డే ని చోటా రాజన్ ఆదేశాల మేరకు ఒక గ్యాంగ్ కాల్చి చంపారు. విచారణ లో ఇది నిజమని తేలింది.  రాగ్స్ టు రిచెస్ పేరిట జ్యోతిర్మాయ్ డే ఒక పుస్తకం రాశారు. అందులో 20 మంది గ్యాంగ్ స్టర్ ల జీవితాల గురించి జ్యోతిర్మాయ్ డే రాశారు.

అందులో చోటా రాజన్ గురించి ఒక కథనం ఉంది. తన గురించి రాసాడన్న కోపంతో అతగాడిని రాజన్ చంపించాడు. ఈ కేసులో 41 మంది సాక్ష్యాలు కీలకం గా నిలిచాయి. 2018 లో చోటా రాజన్ ను ఈ కేసులో దోషిగా కోర్టు తేల్చి… జీవిత ఖైదు శిక్ష విధించింది.అప్పటికే తీహార్ జైలులో ఉన్న రాజన్ అక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా చోటా రాజన్ 2015 లో బాలీ లో పోలీసులకు దొరికాడు. అక్కడ నుంచి భారత్ కు తీసుకొచ్చారు. ఇండియాకొచ్చాక నకిలీ పాస్ పోర్ట్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. చోటా రాజన్ 1984 నుంచి దావూద్ ఇబ్రహీం తో కల్సి పనిచేసేవాడు. 1993 లో ముంబై లో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ ఇండియా విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి చోటారాజన్ సొంత దుకాణం పెట్టుకున్నాడు.

దావూద్ కంపెనీ (D కంపెనీ) వాళ్ళను తప్పించి తన మనుష్యులతో కంపెనీ ప్రారంభించాడు. ఒకప్పుడు బ్లాక్ లో టిక్కెట్లు అమ్మిన రాజన్ సొంత నేర సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని చెలరేగిపోయాడు. రాజన్ తొలి రోజుల్లో బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవాడు. ఒకసారి పోలీసులతో గొడవపడి వాళ్లపైనే దాడి చేసాడు. అప్పుడు కొన్నాళ్ళు జైలులో ఉన్నాడు.

బయటకొచ్చాక బడా రాజన్ దగ్గర పనిచేశాడు. బడా రాజన్ ను వేరే గ్రూప్ వ్యక్తులు కాల్చి చంపారు. దాంతో బడా రాజన్ గ్రూప్ కి తానే నాయకుడు అయ్యాడు. అలా బడా రాజన్ దగ్గర పని చేసి చోటా రాజన్ గా గుర్తింపు పొందాడు.ఆ గ్యాంగ్ తో సహా దావూద్ దగ్గర చేరిపోయాడు. సొంత కంపెనీ పెట్టుకున్నాక రాజన్ ఒకటని కాదు డబ్బులిస్తే చాలు ఏదైనా చేసేవాడు. ముంబయ్ పై పట్టు బిగించే యత్నంలో దావూద్ తోనే తలపడ్డాడు.

దావూద్ నమ్మకస్తులను చంపించాడు. దావూద్ కి కోపమొచ్చి చోటారాజన్ ను లేపేయమని చోటా షకీల్ ను రంగంలోకి దించాడు.  దాంతో కొన్నాళ్లు భయపడి బ్యాంకాక్ లో తలదాచుకున్నాడు. అక్కడ కూడా దావూద్ మనుష్యులు వెంబండించి టార్గెట్ చేశారు.చోటా రాజన్ ను చంపేందుకు చోటా షకీల్ ఎంతగానో ప్రయత్నించాడు.దావూద్ చోటారాజన్ గ్రూప్ ల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన మనుష్యులు ప్రాణాలు కోల్పోయారు.

చోటా షకీల్ దావూద్ కంపెనీలో నంబర్ 2 స్థానంలో ఉన్నాడు. రాజన్ తప్పుకున్న తర్వాత పెద్ద పెద్ద పనులన్నీ షకీల్ చక్కబెట్టే వాడు. రాజన్ హత్యకు పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ రెండు మూడు సార్లు తప్పించుకున్నాడు.అప్పటినుంచి రాజన్ తెర వెనుక నుంచే అనుచరులచే అన్ని పనులు చేయించే వాడు. రకరకాల పేర్లతో మారు వేషాల్లో సంచరించేవాడు.

ముంబయి లో ఉంటే చంపేస్తారనే భయంతో విదేశాల్లో ఎక్కువగా తిరిగే వాడు. అలా బాలి లో ఇండోనేషియా పోలీసులకు దొరికిపోయాడు. ఇక రాజన్ వ్యక్తిగత జీవితానికొస్తే … వివాహితుడే. ముగ్గురు ఆడపిల్లలున్నారు.

రాజన్ సోదరుడు దీపక్ నిఖల్జే రిపబ్లిక్ పార్టీ అఫ్ ఇండియా పార్టీ కి చెందిన ఎంపీ రాందాస్ అథవాలే అనుచరుడిగా ఉంటున్నారు. 2002 లో  రామ గోపాల వర్మ తీసిన ‘కంపెనీ’ సినిమా లో ‘చందు” పాత్ర రాజన్ దే.  …1999 లో విడుదలైన ‘వాస్తవ్ .. ది రియాలిటీ’ సినిమా కథ కు స్ఫూర్తి రాజనే  అంటారు.

—————–KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!