దెయ్యంతో మాటా -మంచీ

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………..

ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఏదో నీడ లాంటి ఆకారం లోపలి కొచ్చింది.
తలుపులు వేసిఉన్నాయి. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుండగా
ఎందుకు దయ్యాలంటే నీకంత చులకన ఆ ఆకారం అడిగింది.
నాకేం చులకన లేదుగానీ … ఇంతకీ మీరెవరు? ఎలా లోపలికి వచ్చారంటే చెప్పరేం ?
చెప్పాను కదా … నేను నీ ఫ్రెండునని …
నా ఫ్రెండా … నాకు తెలియకుండా నా ఫ్రెండు … అవునూ … నా రూమ్ లోకి ఎలా వచ్చారు? తాళం కూడా నేనెవరికీ ఇవ్వలేదే?
తాళం ఎవడికి కావాలండీ … మీరు తెలియని వాళ్లకి కావాలి. నాకు తాళంతో పనేముంది … మీ గురించి నాకు తెలియదా … నా గురించి మీకు తెలియదా…
మీరెవరో గుర్తు రావడం లేదుగానీ … ఎక్కడో చూసిన జ్ఞాపకం మాత్రం వస్తోంది … కొంపదీసి మీరు మా ఊరి కరణంగారబ్బాయా?
నువ్వెలా ఫిక్స్ అయితే అలా … నేనూ నువ్వూ చిన్నప్పుడు కలసి గోళీలాడుకున్నాం … అప్పుడే మరచిపోయావ్ …
మీరంటున్నారు … నాకైతే గుర్తు రావడం లేదు … పర్లేదనుకోండి … దాని గురించి కాదు నేను ఆలోచిస్తోంది … తాళం లేకుండా మీరెలా లోపలికి వచ్చారా అని.
నువ్వు అసలు విషయాల మీద మనసు పెట్టకుండా పనికి మాలిన విషయాల మీద ఎక్కువ ఆలోచిస్తావని మీ నాన్న నిన్ను వరండాలో నిలబెట్టి తిట్టేవాడా?
అవును తిట్టేవాడు.
ఆ అలవాటు ఇంకా నిన్ను వదల్లేదు … మీ నాన్న కూడా అదే బాధపడేవాడు …
మా నాన్న బాధపడేవాడా? ఎప్పుడు?
ఎప్పుడో అప్పుడు గానీ … నేనెలా లోపలకి వచ్చాననే పనికిమాలిన విషయం మీద మనసు పెట్టడం మానేసి … నేను చెప్పే విషయాల మీద మనసు పెట్టు …
చెప్పండి … అవునూ అసలు మీరు ఏం పనిమీద వచ్చారు?
నేనూ చాలా పెద్ద పనిమీదే వచ్చాను … నువ్వు జర్నలిస్టువి కదా… నీతో చెప్పుకుంటే మా బాధ తొలగిపోతుందేమో అని వచ్చాను… వచ్చేప్పుడు మీ నాన్నను అడిగాను కూడా …
మా నాన్నని ఇప్పుడు అడగడం ఏమిటి? ఆయన పోయి పదిహేనేళ్లు అయ్యింది …
అప్పుడే అడిగాను లేవయ్యా … ఓ ఖంగారు … విను … మధ్యలో వేలు పెట్టకు .
పెట్టనులెండి … చెప్పండి … ఏమిటి మీ బాధ ?
మా కాలనీ మొత్తంగా కబ్జాకు గురయ్యిందబ్బాయి … దీంతో మేం ఎక్కడికి పోవాలో తెలియని పరిస్తితుల్లో ఉన్నాం. ప్రభు త్వాలు మా గురించి పట్టించుకోవడం లేదు … చిన్న చిన్న మా ఇళ్లు పగలకొట్టి వాటి మీదే పెద్ద పెద్ద ఆపార్ట్ మెంట్లు కట్టేస్తున్నారు … చెరువులు కబ్జా చేస్తూంటే … చూసి పోనీలే అనుకున్నాం … ఇప్పుడు నేరుగా మా ఇళ్లే కబ్జా చేస్తుంటే … ఏం చెయ్యాలో అర్ధం కాక నీ దగ్గరకు వచ్చాం …
వచ్చాం అంటున్నారు … మీరొక్కరే కదా వచ్చింది ?
అంటే నేనొక్కణ్ణే మీకు కనిపిస్తున్నాను గానీ కనిపించకుండా ఇంకొంతమంది వచ్చారు లెండి …
కనిపించకుండా రావడం ఏమిటి? నాకు అస్సలు అర్ధం కావడం లేదు .
ఏం లేదులే … ఊరికే అన్నాను … ఎన్టీఆర్ అనేవారు కదా … చేశాం చేస్తున్నాం అని ఆ టైపులో అన్నానన్నమాట.
ఓహో అలాగా … మీరేం మాట్లాడినా నాకు భయం వేస్తోంది … ఇంతకీ మీ కాలనీ ఎక్కడ?
నిజాంపేటలో … బండారీ లే అవుట్ దగ్గర్లో …
అవునూ అక్కడ వ్యవసాయ భూముల్లో అపార్ట్ మెంట్లు కట్టేశారనీ … నాళాలు ఆక్రమించేవారనీ దీంతో నీళ్లు నేరుగా ఇళ్లల్లోకి చేరుతున్నాయనీ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రభుత్వం కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేసింది కూడా కదా … అలా కూల్చేసిన కాలనీల్లో మీదీ ఉందా ? అలా అయితే నేను మీకేం సాయం చేయలేను … ఎందుకంటే అది యాంటీ పీపుల్ అవుతుంది.
ఏడ్చేవులే … ఓ నలుగురి వాయిస్ వినిపించింది . … ఖంగరుగా వెనక్కి తిరిగి చూసాను.
ఇప్పుడు ఎవరో నలుగురు అరచినట్టు వినిపించింది … ఏడ్చావులే అన్నారు … నీకేమైనా వినిపించిందా?
వినబడలేదుగానీ … మాది యాంటీ పీపుల్ డిమాండ్ కాదు … ప్రో పీపులే… మీరు రేపోసారి మా ఏరియాకి వస్తే … మా బాబాయ్ మీకు పూర్తిగా వివరిస్తాడు … ఇదిగోండి … మా బాబాయ్ విజిటింగ్ కార్టు …
సర్లే వస్తాను …
రాకపోయావో (మళ్లీ నాలుగు వాయిస్ లు వినిపించాయి. )
అదుగో మళ్లీ ఎవరో వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు మీకు వినిపించలేదా?
లేదండీ … మీరేదో బాగా స్ట్రెస్ లో ఉన్నారు … మీరు రండి … రేపు మా బాబాయ్ మాట్లాడుతాడు …
సరే … సరే …
………………
రండి … రండి … నా పేరు సుబ్బారావు … నేను మీకు తెల్సు … నిన్న మావాడు మిమ్మల్ని కలిసాడు కదా…
మీరు నాకు తెలియకపోవడమేంటి నాన్నా … నువ్వేమిటిక్కడ …. ఇక్కడేం చేస్తున్నావ్?
నువ్వు మర్చిపోయినట్టున్నావ్ … ఇక్కడే పదేళ్ల క్రితం నన్ను తగలేశావ్ … గుర్తు పట్టలేదా…
ఏం మాట్లాడుతున్నావ్ నాన్నా … నేను నిన్ను స్మశానంలో కదా తగలేసింది ….
ఆ శ్మశానమేరా నాయనా ఇప్పుడు నువ్వు చూస్తున్నావే ఆ అపార్ట్ మెంట్స్ … ఆ శ్మశానాన్ని కబ్జా చేసి … ఇలా కట్టేశారు … దీంతో మేం వీధిన పడ్డాం … మొత్తం రెండు వేల గజాల స్థలం నాన్నా … నాలుగో ఐదో లేయర్లు ఉన్నాయి … దాదాపు డెబ్బై వేల నుంచీ లక్ష వరకూ దయ్యాలు నిర్వాసితులయ్యాయి నాన్నా … ఈ ఇష్యూని కాస్త మీ పేపర్లో రాయరా … నలుగురికి తెలుస్తుంది … నా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా … నిజాం నవాబు కాలంలో  శ్మశానం  కోసం కేటాయించిన స్థలం రా ఇది …
సారీ నాన్నా … నాకు దీని మీద ఆలోచించుకోడానికి కాస్త టైమ్ కావాలి.
నాకు తెల్సురా నువ్వు టైమెందుకు అడుగుతున్నావో … మొన్నా మధ్య బి.హెచ్.ఈ ఎల్ దగ్గర యాక్సిడెంట్లో చనిపోయిన కుర్ర జర్నలిస్టు దయ్యం చెప్పింది నాకు … కవర్ ఇవ్వకుండా … ఏ రిపోర్టరూ ఈ స్టోరీ ప్రింట్ చేయరూ అని …
అది కాదు నాన్నా …
పోనీ డ్రింక్ పార్టీ ఇవ్వమంటావా?
అబ్బా నాన్నా … నేను చెప్పేది వినవే ….
సర్లేరా నువ్వు ఆలోచించు … నాకు టైమయ్యింది … యమలోకం నుంచీ అడెంటెన్స్ తీసుకోడానికి క్లర్కు వచ్చే టైమయ్యింది … రేపు సాయంత్రం కలుద్దాం …
ఓకే నాన్నా ఓకే …. అని కన్నీళ్లు తుడుచుకుంటూంటాడు …
…..
బాబూ ఏమాలోచించావ్ ?
దేనిగురించి ?
దయ్యాలకన్నా మనుషులే చాలా ప్రమాదకరం అనీ … మనుషుల నుంచీ తమను తాము కాపాడుకోడానికి దయ్యాలు నానా తిప్పలు పడుతున్నాయ్…
మరి మా కాలనీ వ్యవహారం ఏం చేస్తావు నాయనా …
పాత ఫైల్స్ అవీ కావాలండీ … అప్పుడు స్టోరీ డవలప్ చేయవచ్చుగానీ ఈ స్మశానాల స్కామ్ లో చాలా మంది నాయకుల పేర్లు బయటకు వస్తాయి కదా …
దాన్ని తట్టుకోగనా అనేది నా భయం … అంతే కాదు మీడియా మేనేజ్మెంట్లు కూడా ఇలాంటివి పెద్దగా ఎంకరేజ్ చేయవు …
అవును ఇప్పుడు ఈ భవన నిర్మాతలే మీడియాధిపతులట కదా కస్టమేలే…
అయినా కాయితాలుంటే…
బాబూ నీకే కాయితం కావాలన్నా మేం తెచ్చిస్తాం … సెక్రటేరియట్ చెట్ల మీదున్న మన దయ్యం స్నేహితులు రాత్రి పూట అలా లోపలికి వెళ్లి ఇలా జిరాక్స్ తీసి మనకు తెచ్చిచ్చేస్తారు…
సరే నా ప్రయత్నం నేను చేస్తాను …
ఒకవేళ అక్కడ కుదరకపోతే కనీసం సోషల్ మీడియాలో అయినా గోల చేస్తానని హామీ ఇవ్వు …
చూస్తాను నేను దెయ్యం కాకుండా ఉండేలా ఏదైనా పథకం వేస్తాను
ఓకే బాబూ ఉంటాను మరి … జాగ్రత్త అన్నట్టు మనం ఓ కోడ్ వర్డ్ పెట్టుకుందాం. నీకు నాతో మాట్లాడాలనిపించినప్పుడు అహం అనుకో … వచ్చేస్తా …
ఓకే మాస్టారూ … ఉంటాను …
బై..

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!