A broken hearted lover……………………………
ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక ఆమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని అంటారు.
ఆమె ఆత్రేయ ప్రేమ ను సున్నితంగా తిరస్కరించిందని చెబుతారు. అందుకే ఆత్రేయ మనసు పై పాటలు పుంఖాను పుంఖాలుగా రాసారని తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు. ఆమె కూడా ఒక నటి అని పాత తరం జర్నలిస్టుల కథనం.ఆమె తన ప్రేమను తిరస్కరించిందని ఆత్రేయ దేవదాసు కాలేదు.
ఆత్రేయకు సినీపరిశ్రమకు రాకముందే పెళ్లయింది. అంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. అది టీనేజ్ లవ్.ఆమె పేరు పద్మ.అది ఫెయిలైంది. తర్వాత బంధువుల అమ్మాయి పద్మను పెళ్లి చేసుకున్నారు.ఇద్దరిపేర్లు పద్మ కావడం చిత్రం.అయితే వారి కాపురం సజావుగా సాగలేదు.
కృష్ణ, శారద జంటగా నటించిన “ఇంద్రధనుస్సు” సినిమాలోని పాట “నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి” అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఒక సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని ఆత్రేయ చెప్పుకున్నారు.
ఇక ఆత్రేయ పాటల కొస్తే ” మనసు గతి ఇంతే… మనిషి బ్రతుకింతే’ అని ‘ప్రేమ్‌నగర్’లో అన్నారు. ‘మనసు లేని బ్రతుకు ఒక నరకం – మరపులేని మనసొక నరకం’ అని ‘సెక్రటరీ’ లో ఓ పాట రాస్తే, ఇక ‘మూగమనసులు’లోని ‘ముద్దబంతి పూవులో’ అనే పాట రాసారు.అలాగే ‘‘మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు … మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్లిచ్చాడు’’ అని మరో సినిమాలో రాసాడు. మనసెంత చంచలమైనదో, మాయలాడో- అది మనిషిని కీలుబొమ్మను చేసి ఎలా ఆడిస్తుందో ఆత్రేయ ఒక మనోవైజ్ఞానికుడిలా విశ్లేషించి చెప్పారు.
ఇక గుప్పెడు మనసులో “ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే!’’ అంటూ అంతుచిక్కని మనసు గురించి, అర్థం కాని దాని స్వభావం గురించి అద్భుతంగా రాశారు. మరో సందర్భంలో ‘మనసు నిత్యమనీ, అది జన్మజన్మల బంధమనీ’ కూడా ఆయనే రాశారు. మూగమనసులు చిత్రంలో ‘మనిసి పోతే మాత్రమేమి మనసు ఉంటది మనసు తోటి మనసెపుడో కలిసిపోతది ’ అంటూ తనదైన శైలిలో చెప్పారు.
ప్రేమ పాటలు ,మనసుపాటలు రాయడం లో ఆత్రేయ శైలిని తోటి సినీకవులు కూడా ప్రస్తుతించారు. ”నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం… ఆత్రేయ ప్రేమగీతం” అని గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి ఆత్రేయ ప్రేమగీతాలకు కితాబిచ్చారు.అలాగే ప్రముఖ రచయిత సినారె కూడా ‘‘నవ్వినా.. ఏడ్చినా.. కన్నీళ్లే వస్తాయి .. ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా’’ పాట గురించి మాట్లాడుతూ ఆ రెండు పంక్తులు ఇరవై కావ్యాల పెట్టు అని పొగిడారు.
మనసు కవిగా ముద్ర పడినప్పటికీ ఆత్రేయ అనేక ఇతర గీతాలు కూడా రాసి ప్రేక్షకుల మెప్పు పొందారు. ‘బడిపంతులు’ చిత్రంలో ‘భారత మాతకు జేజేలు’ – ‘మంచి మనసులు’లో ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’, ‘తోడికోడళ్లు’ చిత్రంలో ‘కారులో షికారుకెళ్లే’ వంటి పాటలు ఎన్నో ఆయన రాశారు.
రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపించిన ఖ్యాతి ఆత్రేయది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పాటలు ఆయన రాసినవి ఉన్నాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే తేలికైన పదాలతో పాటలు రాయడం ఆత్రేయ ప్రత్యేకత. భారీ పద ప్రయోగాలు ఆయన పాటల్లో కనబడవు. తర్వాత తరంలో ఆత్రేయ లా తేలికైన పదాలతో పాటలు రాసిన కవులు తక్కువే.
————- K.N.MURTHY