Everything is strategic ……………………………..
హ్యాట్రిక్ కొడతామని చెబుతున్న కమలనాధులు కాశ్మీర్ లో అసలు పోటీ చేయడం లేదు. ఆర్టికల్ 370 ని రద్దు చేసామని అంటున్న బీజేపీ మరి కాశ్మీర్ లో ఎందుకు పోటీ చేయడం లేదు ?ఇదొక మంచి అవకాశం కదా .. కానీ ఎన్నికలకు దూరంగా ఉంది. జమ్మూ లో మాత్రం పోటీ చేస్తున్నారు. అదంతా వ్యూహాత్మకం అంటున్నారు.
ఓట్లు వచ్చినా? రాకపోయినా? రాజకీయ పార్టీ కాబట్టి … ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే కదా…? అంటే సరైన సమాధానం లేదు. అక్కడ బీజేపీపై వ్యతిరేకత ఉన్న విషయం బయట పడకూడదని పోటీకి దిగలేదు.కాశ్మీర్ లోయలోని 3 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఉధంపూర్, జమ్మూలో బిజెపి తన అభ్యర్థులను నిలబెట్టింది.
కానీ బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్-రాజౌరిలో దాని మిత్రపక్షాలకు మద్దతు ఇస్తుంది. ఇక్కడ బీజేపీ మిత్రపక్షాలు పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీలు. ఈ పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగినా అంత ప్రయోజనం ఏమి లేదని పరిశీలకులు అంటున్నారు. ఏదైనా ఫలితాలు వస్తేనే కానీ అసలు విషయం తేలదు.
గత లోకసభ ఎన్నికల్లో బీజేపీకి కాశ్మీర్ లోని మూడు నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను పరిశీలిస్తే అసలు బీజేపీకి బలం లేదని అంటారు. కాశ్మీర్ లోని మూడు పార్లమెంట్ స్థానాల్లో బారాముల్లా ఒకటి. ఇక్కడి నుంచి జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన నాయకుడు మహమ్మద్ అక్బర్ లోన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి కేవలం 7,894 ఓట్లు మాత్రమే వచ్చాయి.అక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 8,128. అంటే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నమాట. దీన్ని బట్టి కశ్మీర్ లో బీజేపీ బలం ఎంతో అర్థం అవుతుంది.
2014లో జరిగిన ఎన్నికల్లో అయితే 6,558 ఓట్లు మాత్రమే వచ్చాయి. శ్రీనగర్ నియోజకవర్గం లోనూ 2019లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా విజయం సాధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. అక్కడ బీజేపీకి ఆ ఎన్నికల్లో 4,631 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కూడా బీజేపికి వచ్చిన ఓట్లు 4,467 మాత్రమే. 2014 ఎన్నికల్లో నోటాకు శ్రీనగర్ నియోజకవర్గంలో 4979 ఓట్లు వచ్చాయి. అపుడు కూడా నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
ఇక కాశ్మీర్ లోని మూడో నియోజకవర్గం అనంతనాగ్ – రాజౌరి. ఇక్కడి నుంచి కూడా ప్రస్తుతం నేషనల్ కాన్పరెన్స్ పార్టీకి చెందిన నాయకుడు హస్నేయిన్ మసూది సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ స్థానంలో బీజేపీకి 2019 ఎన్నికల్లో 10వేల 225 ఓట్లు వచ్చాయి.
2014 ఎన్నికల్లో 4వేల 720 ఓట్లు వచ్చాయి. 2014లో నోటాకు వచ్చిన ఓట్లు 5,936. అంటే బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువన్నమాట. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ కి రాజీనామా చేసిన గులామ్ నబీ ఆజాద్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సొంతంగా పార్టీ పెట్టుకున్న విషయం తెలిసిందే.
లోక్ సభ ఎన్నికల తర్వాత కొంత కాలానికి జమ్మూ – కశ్మీర్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పోటీ చేసి తక్కువ ఓట్లు తెచ్చుకుంటే… ఆ ప్రభావం జరిగే శాసనసభ ఎన్నికలపై పడవచ్చని భావిస్తున్న కమలనాథులు ముందు జాగ్రత్త గానే పోటీకి దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
ఇక జమ్ము కాశ్మీర్‌లో ఏప్రిల్ 19న ఉదంపూర్‌లో.., ఏప్రిల్ 26న జమ్ములో.., మే 7న అనంతనాగ్ రాజౌరీలో..,పోలింగ్ జరిగింది . మే 13న శ్రీనగర్‌లో.., మే 20న బారాముల్లాలో.. పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు జరగనుంది.