living -together is no longer easy………………..
ఆ రాష్ట్రంలో ఎవరైనా ఒక అమ్మాయితో సహజీవనం చేయాలంటే తప్పనిసరిగా .. ముందుగా అధికారులకు సమాచారం ఇవ్వాలి.. అలాగే సహజీవనాన్ని నియంత్రించే కొత్త చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఆ రాష్ట్రం ఏదో కాదు ఉత్తరాఖండ్ .. ఇపుడు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రం పొందిన తరువాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని మతాలవారికి ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి నిబంధనలు వర్తిస్తాయి. గిరిజనులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
సహజీవనం సాగించాలనుకుంటున్న జంటలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న యువతీ,యువకులు సహజీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. నైతికతకు విరుద్ధంగా ఉన్న సహజీవనాలను రిజిస్టర్ చేయరు. సహజీవనం చేయాలనుకున్న వారిలో ఒకరికి వివాహమైనా .. ఒకరు మైనర్ అయినా ఈ సహజీవనం సంబంధాలను రిజిస్టర్ చేయరు.
సహజీవనం దరఖాస్తులలో ఏమైనా అనుమానాలు ఉంటే రిజిస్టార్ పోలీసులను విచారణ చేయమని కోరవచ్చు.సహజీవనం గురించి తప్పుడు సమాచారం ఇస్తే జరిమానా విధిస్తారు. సహ జీవనాన్ని రిజిస్టర్ చేయించకపోతే ఆరు నెలలు జైలు శిక్ష … 25 వేల జరిమానా విధిస్తారు.
సహజీవనంలో జన్మించిన పిల్లలకు చట్టబద్ధమైన హక్కులు వర్తిస్తాయి. ఈ బిల్లు ద్వారా బహు భార్యత్వం .. బాల్యవివాహాలపై పూర్తి నిషేధం అమల్లోకి వస్తుంది .. అన్ని మతాలలో బాలికలకు ప్రామాణిక వయసు, విడాకుల కోసం ఏకరీతి ప్రక్రియ వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.. విడాకులు, భర్త మరణం తర్వాత ఇస్లాం మహిళలు తప్పకుండా పాటించాల్సిన హలాలా వంటి పద్ధతులపై నిషేధాన్ని ఈ బిల్లులో పొందుపర్చారు.
మతాల వారీగా వివాహ సాంప్రదాయాలను మార్చలేదు. సప్తపది, నిఖా , ఆనంద్ కరాజ్ వంటివి అమలులో ఉంటాయి ఈ బిల్లును అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకి స్తోంది .. ఇది మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని అభ్యంతరం వ్యక్తం చేసింది.. గిరిజనులను మినహాయించడాన్నీ కూడా ప్రశ్నించింది. మొత్తం మీద చూస్తే ఇలాంటి చట్టాలు దేశవ్యాప్తంగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. మోసపూరిత ఉద్ద్యేశ్యంతో సహజీవనం చేయాలనుకునే వారి ఆటలు ఇక పై సాగకపోవచ్చు.