why pm modi is silent ……………………………….. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనవ్యూహం వెనుక మర్మమేమిటో ఎవరికి అంతు చిక్కడంలేదు. తనపై విమర్శలు గుప్పించినా మోడీ మౌనంగానే ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దాడులు జరిగాయి. ఈ దాడులపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్నికల జరిగిన తీరుపై ప్రతిపక్ష నేతలంతా ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయినా మోడీ మౌనంగానే ఉన్నారు. ఉంటున్నారు.
మరో వైపు కరోనా ముప్పు నుంచి దేశాన్ని కాపాడలేక పోయారంటూ .. ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించారనే విమర్శలు కూడా జోరందుకున్నాయి. ఈ విమర్శలకు కూడా మోడీ సమాధానం ఇవ్వలేదు. ఏడాది కిందట తటస్తులు కూడా మోడీ వైపు ఆశగా, ఆరాధనగా చూసారు. కరోనా గండం నుంచి దేశాన్ని మోడీ మాత్రమే గట్టెక్కించగల సమర్థుడని నమ్మారు. అలాంటి వారి ఆశలు కూడా ఇపుడు సన్నగిల్లుతున్నాయి. వారు కూడా మెల్లగా విమర్శిస్తున్నారు. వ్యతిరేకించడం మొదలెట్టారు. తాజా పరిస్థితులు చూసి మోడీ వీరాభిమానులు సందిగ్ధంలో పడుతున్నారు. ఇక అంతర్జాతీయ మీడియా అదే పనిగా విమర్శలు చేసినా కూడా మోడీ మౌనమే పాటిస్తున్నారు. ఆయన తరపున కూడా గట్టిగా ఖండించిన వారు లేరు. మోడీ వ్యవహార శైలి తెలిసినవారు మాత్రం ఇందులో కొత్త ఏమి లేదనే అంటున్నారు. పెద్ద సవాళ్లు ఎదురైనపుడు మోడీ నిశ్శబ్దంగా ఉంటారని .. అవకాశం వచ్చినపుడు మాత్రమే లెక్కలు తేల్చుకుంటారని చెబుతున్నారు.
అదలా ఉంటే గత ఏడాది ప్రధాని స్వయంగా ముందుకొచ్చి నెలల తరబడి లాక్ డౌన్ ను ప్రకటించారు. తరచుగా మీడియా ముందుకొచ్చి ప్రజలకు ధైర్యం చెప్పారు. కానీ ప్రస్తుత విపత్కర సమయంలో అలా చేసిన దాఖలాలు లేవు. ఇక లాక్ డౌన్ విషయం లో రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని ఇచ్చేసారు. మేధావులు,ఆరోగ్యరంగ నిపుణులు , విపక్షాలు, కోర్టులు లాక్ డౌన్ అంశాన్ని పరిశీలించాలని సూచించినా మోడీ ఏ విషయం తేల్చి చెప్పడం లేదు. లాక్ డౌన్ పెడితే దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుందేమో అని మోడీ ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తుంది.
లాక్ డౌన్ పై రాష్ట్రాలకు అధికారం ఇచ్చినా కంట్రోలింగ్ పవర్ కేంద్రం దగ్గరే ఉంచుకోవచ్చు. రెగ్యులర్ గా మానిటరింగ్ చేయవచ్చు. సమన్వయ లోపం లేకుండా చూడవచ్చు. ప్రభుత్వ మానిటరింగ్ సరిగ్గాలేదనే సుప్రీం కోర్టు చొరవ తీసుకుని జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ని వేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఎపుడో చేయాల్సిన పని .. కానీ సుప్రీం చేసింది. అసలు వీటన్నింటికి మించి విపత్తు సమయంలో గతంలో మాదిరి నేనున్నా అంటూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మోడీ దే. ఒక దేశ ప్రధానిగా అది మోడీ కర్తవ్యం. రాజకీయాలు,విమర్శలు,విజయాలు,పరాజయాలు ఎపుడూ ఉండేవే. ఎవరో ఏదో అన్నారని … మౌనం పాటిస్తే… ఒరిగేదేమి లేదు. కీలక సమయంలో … అందులో విపత్తు వేళ ప్రజల ముందుకొచ్చి భరోసా ఇవ్వాల్సింది పోయి మౌనం పాటిస్తే …. అది వేర్వేరు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ప్రధానిగా మోడీ ఒక భరోసా ఇస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది. బాధితులను ఆదుకోవడానికి అన్నిచేస్తున్నాం అంటే ప్రజలకు ఒక ధైర్యం కలుగుతుంది.
———— KNMURTHY