వారి మధ్య కోల్డ్ వార్ నడిచిందా ?

Sharing is Caring...

Anger on the nose is beauty on the face ……………………………………

జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది.  ఆత్మాభిమానం గల జమున కు చిరు కోపం ఉందంటారు.

ఇది తెలిసే కాబోలు ప్రముఖ రచయిత ఆత్రేయ  “ముక్కు మీద కోపం నీ మొహానికే అందం” అంటూ మూగ మనసులు సినిమాకు ఒక పాట కూడా రాసారు. చాలా సినిమాల్లో జమున అలాంటి పాత్రలనే పోషించారు. నిజ జీవితంలో కూడా కొంచెం అటు ఇటుగా ఆమె వ్యవహరించేవారని అంటారు.

అయితే అదంతా కెరీర్ బిగినింగ్ దశలోనే అని చెబుతారు. తర్వాత కాలంలో తల్లి తండ్రులు , పరిశ్రమ పెద్దలు మాట విని తన వ్యవహార శైలిని మార్చుకున్నారు.  తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటులైన ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు–   జమున ల మధ్య దాదాపు మూడేళ్ళ పాటు కోల్డ్ వార్ నడిచింది. 

తమ ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంటుందని, తమని గౌరవించడం లేని ఎన్టీఆర్, అక్కినేని ల ప్రధాన కంప్లెయింట్‌. షూటింగ్‌లకు లేట్‌గా వస్తుందని కూడా ఆరోపించేవారట. స్వతహాగా డిఫరెంట్ యాటిట్యూడ్‌కి కేరాఫ్‌ అయిన జమున వీరిని పెద్దగా లెక్కచేయలేదు. దీంతో జమున వ్యవహార సరళి నచ్చలేదనే నెపంతో అక్కినేని, ఎన్టీఆర్‌ ఇద్దరూ జమునతో నటించబోమని చెప్పేవారట. 

కానీ జమునని రీప్లేస్ చేసే మరో నటి లేకపోవటంతో ఆమెనే తిరిగి సినిమాల్లో పెట్టుకునేవారట.   ఎన్టీఆర్‌-ఏఎన్నార్ ల‌ను వ‌దిలేసి హరనాథ్, జగ్గయ్య తదితరుల సరసన జమున సినిమాలు చేశారు. లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌తోనూ త‌న‌ ఇమేజ్ పెంచుకున్నారు.

అప్పుడే బాలీవుడ్ నుంచి సైతం ఆఫ‌ర్లు రావ‌డం ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే  విజయా  సంస్థ అధినేతలు నాగిరెడ్డి .. చక్రపాణి లు  గుండమ్మ కథ తీయాలనుకున్నారు. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారు. అగ్ర హీరోలతో గొడవలు గురించి తెలుసుకుని రంగ ప్రవేశం చేశారు. అటు ఇద్దరు హీరోలతో .. ఇటు జమున ఆమె తండ్రి తో మాట్లాడారు.

మొత్తానికి ముగ్గురిమధ్య రాజీ కుదిర్చారు. ముందు క్షమాపణ పత్రం రాసివ్వమని ఆ ఇద్దరు హీరోలు అడిగారట. అందుకు ససేమిరా అన్న జమున వ్యక్తిగతం గా ఆ ఇద్దరినీ కలసి క్షమాపణ అడిగారట. ఆ తర్వాత గుండమ్మ కథ షూటింగ్ మొదలైంది.  జమున పేరు చెప్పగానే తెలుగువారికి గుర్తుకు వచ్చే చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి అని చెప్పుకోవచ్చు.

తర్వాత కాలంలో ఎన్టీఆర్ ,అక్కినేని లతో కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో జమున నటించడం విశేషం. 
దాదాపు మూడు దశాబ్ధాల పాటు తెలుగు తెరను ఆమె మకుటం లేని మహరాణిలా ఏలారు. జమున కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారంటే ఆమె స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. జముననే నమ్ముకుని ఎంతోమంది సినిమాలు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు.

——KNM

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!