River trip………………………………………..
అమెజాన్.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది .. అయినప్పటికీ ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. ఇక ఈ ప్రమాదకరమైన నది ..దాని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడటానికి Amazonia Expeditions సంస్థ నదీ యాత్రలు నిర్వహిస్తున్నది.
అమెజాన్ నది ఒడ్డునే హోటల్స్ కూడా వెలిశాయి. పెరూ లోని అమెజాన్ రివర్ బేసిన్ లో యాత్ర మొదలవుతుంది. సమీపంలోని కొన్ని ప్రాంతాలను తిలకించవచ్చు. ఈ టూర్ కి వివిధ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇక భయంకరమైన నది గురించి కొంచెం తెలుసుకుందాం.
అమెజాన్ నది వెడల్పు, లోతు చాలా ఎక్కువ. తక్కువలో తక్కువగా రెండు కిలోమీటర్ల నుంచి 9 కిలోమీటర్ల వెడల్పులో నది పారుతుంటుంది. వానాకాలంలో అయితే మరింత భారీగా మారుతుంది. కొన్నిచోట్ల అయితే ఏకంగా 40–50 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. అంతేగాక నదికి రెండు వైపులా దట్టమైన అడవి, బురద, చిత్తడి నేలలు ఉంటాయి.
అమెజాన్ అన్ని వేల కిలోమీటర్లు ప్రవహించినా.. చాలా భాగం దట్టమైన అడవుల నుంచే సాగుతుంది. రవాణా అవసరం తక్కువ. మధ్యలో అక్కడక్కడా పట్టణాలు ఉన్నా పడవలు, మరబోట్లు, ఫెర్రీలు, జెట్టీలతో మనుషులు, సరుకు రవాణా సాగుతుంది.
ఇక ఈ నది ప్రత్యేకతలు గురించి చెప్పుకోవాలంటే .. చాలానే ఉన్నాయి. మామూలుగా నదుల్లో చేపలు, పాములు ఉంటాయి. కొన్నిచోట్ల మొసళ్లూ కూడా ఉంటాయి. కానీ అమెజాన్‌లో పెద్ద పెద్ద అనకొండలు, కరెంటు షాకిచ్చే ఎలక్ట్రిక్ ఈల్ వంటి చేపలు, మాంసం వాసనొస్తే కొరికిపడేసే 60 రకాల ఫిరానా చేపలూ ఉన్నాయి.
మొత్తంగా ఈ నదిలో 5,600 రకాల చేపలు ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు.అమెజాన్‌కు మొత్తం 1,100కుపైగా ఉప నదులు ఉన్నాయి. అందులో 17 ఉప నదులు వెయ్యి కిలోమీటర్లకుపైగా పొడవు ఉండటం విశేషం. భూమ్మీద ఉన్న వేల నదుల నీళ్లన్నింటినీ కలిపి చూస్తే.. ఒక్క అమెజాన్‌లోనే 20శాతం నీళ్లు ప్రవహిస్తాయని అంచనా. దీని నుంచి సెకనుకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల నీళ్లు అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంటాయి.
అమెజాన్‌కు అతిపెద్ద ఉప నది రియో నీగ్రో. వేగంగా ప్రవహించే అమెజాన్‌లో నీళ్లు మట్టి, బురదతో గోధుమ రంగులో ఉంటాయి. దట్టమైన అడవుల మధ్య నుంచి మెల్లగా ప్రవహిస్తూ వచ్చే రియో నీగ్రో నీళ్లు నల్లగా ఉంటాయి. నది నీటిలో ఆకులు, కొమ్మలు, చెట్ల అవశేషాలు కుళ్లిపోతూ హ్యూమిక్ యాసిడ్‌ను విడుదల చేయడం మూలాన నీళ్లు ఇలా నలుపు రంగు లోకి మారతాయి.
అమెజాన్ నీళ్లు కాస్త వెచ్చగా ఉంటే, రియోనీగ్రో నీళ్లు చల్లగా ఉంటాయి. వీటన్నింటి వల్ల ఈ రెండింటి నీళ్లు వెంటనే కలిసిపోవు. కొద్ది కిలోమీటర్లు పాటు విడివిడి గా ప్రవహిస్తాయి. తర్వాత ఎక్కడో కలుస్తాయి.
ఇక ఈ నదిని ఈదిన వాళ్ళు కూడా తక్కువే. మార్టిన్ స్ట్రెల్ అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ లో 66 రోజుల పాటు ఈత కొట్టి రికార్డు సృష్టించాడు. 3,274 మైళ్లు నాన్‌స్టాప్‌గా ఈదడమంటే మాటలు కాదు .. మార్టిన్ ఆ లక్ష్యాన్నిసాధించాడు.