వంద మార్కులు కొట్టేశారా ?

Sharing is Caring...

Priyadarshini Krishna ………………………………..

I am not a much fan of director Manitatnam. దానివల్ల ఆయనకి నష్టమేం లేదనుకోండి  వేసవిసెలవులకు వైజాగ్‌ సంగం శరత్‌లో పిల్లల్ని బాబాయ్‌ అత్తయ్యలు తీసుకువెళ్ళడం వల్ల గీతాంజలి చూడబడ్డాను.ఆ తర్వాత ఆయన సఖి టీవీలో చూసిన గుర్తు… అంతే మళ్ళీ ఈ పెన్నియన్‌ సెల్వన్‌కి పనిగట్టుకు వెళ్ళడం అంటే మణి సర్‌ కోసం కాదండోయ్‌…. కేవలం విక్రం కోసం !

చూసాను….ఇంకామైకంలోనే వున్నాను… సినిమా పైన…!!  బుర్రంతా కమ్మేసింది…తీస్తే ఇలాంటి సినిమాలు తియ్యాలి, లేకుంటే ఎందుకూ బతుకు ఈ అనిపించింది. NCRT X, XI,XII classes చరిత్ర టెక్ట్స్ బుక్స్లో చోళుళు, చాళుక్యులు, రాష్ట్రకుటలు, కళింగులు, విజయనగర, కాకతీయులు చదువుతున్నప్పుడు ఇదంతా ‘మన కథే’ అని కలిగిన ఉద్వేగం అలాంటి చారిత్రక సినిమాలను చూసినపుడు కలుగుతుంది. ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు రావాలి అని ఆశకలుగుతుంది. 

ఎస్‌ ఇది రివ్యూనే…బాగా గెస్‌ చేసారు. సినిమా టెక్నీషియన్‌ అవడం వల్ల నేను ఈ సినిమానీ ఆ కళ్ళతోనే చూసాను.కథ ఇలా వుంటే బాగున్ను సీను ఇలావుంటే బాగున్ను ఈ పాత్రేంటి ఇలా ఉంది, ఈ నటుడు వేస్ట్ లాంటి విషయాలు చెప్పడం నావల్లకాదు. అన్నీ కూలంకషంగా చర్చించుకుందాం….
అందరికీ ఇప్పటికే తెలిసినట్లే ఇది దాదాపు డెబ్బైయేళ్ళ క్రితం కల్కి రాసిన తమిళ చారిత్రక నవల. ఆరోజుల్లో అది ఎంతో ప్రజాదరణ పొందింది.

దానిని తెరకెక్కిండం అనేది తన చిరకాల కల అని దర్శకుడు చెప్పుకున్నాడు….దానిలో పూర్తిగా కృతకృత్యుడు అయ్యాడు- యేంటీ భాష అనకండి !
ఉపోద్ఘాతం :
తమిళచరిత్రలోని పాత్రలను తెలుగువారికి పరిచయంచేసి కథలో మమేకమవడానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిసోవర్‌ ఇచ్చారు. ఇది పేలవంగా కృతకంగా నాటకీయంగా వుంది… సుహాసినీ  మణిరత్నంతో ఉన్న స్నేహం వల్ల ఈ ఫీట్‌ చేసారేమోగానీ కొంత బేస్‌ వాయిస్‌ వున్నవారితో చెప్పిస్తే బాగున్ను. మముట్టి అమితాబ్‌ లాంటి గొంతు అని నా ఉద్దేశం- వారు చెప్పుంటే అనికాదు.

స్క్రీన్‌ప్లే :
వేలపేజీలున్న నవల. అందునా జనబాహుళ్యంలో నానిన కథ- చరిత్ర. అంత నిడివిని తెర కెక్కించడమంటే కత్తిమీదసాము. కథంతా చెప్పాలనే ఆరాటం దర్శకునికుండటం సహజం. ఏది వుంచాలి అది తీసేయాలి యేది ఎంతవరకు చెప్పాలి అనేదే దర్శకుని ఊహాపోహశక్తికి తార్కాణం. అచ్చైనదానిని తెరపై చూపడం చాలామందికి కుదరని పని. కానీ దర్శకుడు వందమార్కులు కొట్టేసాడు.
ఎలంగో కూమారవేల్‌ తో కలిసి చేసిన ఈ స్క్రీన్‌ప్లే అద్భుతమనే చెప్పాలి.

ప్రొడక్షన్‌ డిజైన్‌:
ఇటువంటి పెద్దకాన్వాస్‌లకు అత్యంత కీలకమైన విభాగం ప్రొడక్షన్‌ డిజైన్‌. కథలోని ప్రతిపాత్రలో ఒక స్టార్‌ ఆక్టర్‌ ఉన్నప్పుడు, వారి కాంబినేషన్‌లు వారి డేట్‌లు మాత్రమేకాదు సహజంగా మారే సీజన్స్ ని కూడా మైండ్‌లో పెట్టుకుని దేనికి యే లొకేషన్‌ దేనికి యే ది VFX వుండాలి అనేది క్షున్నంగా అవగాహనలోవుంచుకుని చేసేదే ఆ ప్లానింగ్‌. స్వతహాగా సీసన్డ్ ఆర్ట్ డైరెక్టర్‌ అవ్వడం మూలంగా తోటతరణికి నల్లేరు మీదనడక అయింది. మొత్తంసినిమాని స్మూత్‌గా పూర్తిచేసేలా అమరింది.

సినిమాటోగ్రఫీ :
సినిమాను కళ్ళముదుంచేది కెమెరావర్క్. ఎన్నో మేటి సినిమాలకు పనిచేసిన రవివర్మన్‌ కి పేరుపెట్టేదే లేదు. డైరెక్టర్‌తో పూర్తి సింక్‌లో ఉండి ఆయనచెప్పేది చెప్పినదానికన్నా అత్యద్భుతంగా మనముందుంచండంలో రవివర్మకి సాటి లేరనే చెప్పొచ్చు. ఈయన చేసిన అన్నియన్‌ , దశావతార (తమిళ్), బర్ఫీ రామ్‌లీలా, మిషన్‌మంగళ్ (హింది) ఈయన పనితనానికి రుజువులు.

కథకి సీన్‌కి డైలాగ్స్కి అనువైన కలర్‌ స్కీంని ఎంచుకోడం, ఏయే భావానికి ఎలాంటి షాట్‌ కావాలో డైరెక్టర్‌ మనసులోని సృజనను గుర్తించి అలాంటి ఫీల్‌ తేవడంలో ఈయన దిట్ట. నటుల లోపాలను గుర్తించి కవర్‌చేసే కెమెరా యాంగిల్స్ పెట్టడంలో నేర్పరి. విక్రం మాచోనెస్‌ని త్రిష , ఐశ్వర్యల సొగసును, తోటతరణి గారి ఆర్ట్ పనితనాన్ని కన్నులపండుగగా చూపించాడు.

డైలాగ్స్:
తెలుగు డబ్బింగ్‌కోసం డైలాగ్‌ రచయితగా తనికెళ్ళ భరణిని తీసుకోడంతో సగం గెలిచినట్లే అయింది. ఒరిజినల్‌లో వున్న ఫ్లేవర్‌- భావాన్ని ఎక్కడా చెడకుండా, లింప్‌ సింక్‌ సరిగా వుండటం కోసం అవకతవక పదాలను పొదగకుండా రాసిన భరణికి వీరతాళ్ళు. ఆయన పెన్‌ వల్లనే తుప్పు తెలుగు కాకుండా స్వచ్ఛమైన తెలుగు వినగలిగాం… దానివల్లనే కథ ఇంకా బాగా అర్థమై పాత్రలు మనవాళ్ళే అని గట్టి భావన కలిగింది.

పాటల సాహిత్యం:
తమిళ- తెలుగు సినిమాల పాటలనగానే రాజశ్రీ, వెన్నెలకంటి గుర్తురావడం కద్దు. ఆ లోటు ఇక ఎప్పటికీ తీరనిదే. సింగిల్‌ కార్డ్ తో ఈ సినిమ ఛాన్స్ కొట్టేసిన అనంత్‌ శ్రీరాం చాలామంది తర్జుమాకవుల్లో ‘ఈ ఛాన్స్ నాకొచ్చుంటేనా’ అనిపించుంటాడు ఖచ్చితంగా… ఘోరాతిఘోరంగా వుంది పాటల సాహిత్యం. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
సంగీతం:
మణిరత్నం రెహమాన్‌ కాంబినేషన్‌ గురించి చెప్పేదేముంది. కానీ ఈ సినిమాలో రెహమాన్‌ మాజిక్‌ మిస్సయిందనే చెప్పొచ్చు. పాటలైతే థియేటర్‌నుండి బైటకొచ్చాక గుర్తుంటే ఒట్టు. బాగ్రౌండ్‌ స్కోర్‌కూడా కొన్నిచోట్ల పీరియాడికల్‌ సినిమా కాకుండా మాడర్న్ సినిమాకి చేసాడా అనిపించింది.
ఆర్ట్ వర్క్:
తోటతరణి చేసిన పనితనానికి ఇప్పుడు మనం లోపాలు వెతకడం కష్టమైనపనే…. కోటలు వంటి లొకేషన్లని వెతకడం ఇప్పుడున్నపరిస్థితిలో పెద్ద టాస్క్. దొరికిన కోటలను మ్యాచ్‌చేసుకోడమే.
కానీ, అద్భుతమైన శిల్పకళకి, నౌకానిర్మాణానికి పేరుగాంచిన చోళుల చరిత్రలోనే వారి కళను చూపించి మెప్పించాలి. ప్రతిచిన్న డిటేయ్‌లింగ్‌ మిస్సవకుండా తీర్చిదిద్దారు. కోటలు గుహలు ఎంత క్లియర్‌గా విసిబుల్‌గా వుంటాయో సంచులు ముంతలు ఝండాలు కూడా అంతకంత డిటేల్డ్ గా తీర్చిదిద్దారు. యుద్ధపు సీన్లలో వాడే శస్త్రాయుధా లు పరికరాలను డిజైన్‌ చెయ్యడమే అతికష్టమైన అంశం. దీనిలో బాహుబలినో వేరొక సినిమానో ప్రేక్షకులు కంపేర్‌ చెయ్యడం సహజం. ఆ ప్రమాదం నుండి నేర్పుగా తప్పించింది ఈయన పనితనం.
కాస్ట్యూమ్స్, :
పీరియాడికల్‌ సినిమాకు ఆహార్యం దుస్తులు అత్యంత కీలకం. యే చిన్నతేడా వచ్చినా క్రిటిక్స్ మాత్రమే కాదు ప్రేక్షకులుకూడా ఆడుకుంటారు. ఈసినిమాకి ఏకా లఖాని గెటప్స్ డిజైన్‌ చేసారు. చిన్నవయసులోనే స్టార్స్ కి స్టైలిస్ట్ గా ఎదిగిన ఈమె మణిరత్నం ‘రావణ్’ కి కూడా కాస్ట్యూమ్స్ అందించారు. పీరియాడికల్‌ లుక్‌ తేవడానికి ప్రేక్షకులను ఆ కాలానికి ట్రాన్స్పోర్ట్ చెయ్యడానికి ఆహార్యం ముఖ్యమైన విభాగం. డిజైనర్‌కి చరిత్రతోపాటు. ఆ ఎరాలో ఎటువంటి రంగులు ఫాబ్రిక్స్ వాడారో అవగాహన ఉండాలి. సీన్‌ని బట్టి పాత్రల మూడ్‌ని, సోషల్‌ స్ట్రేటస్ని బట్టి ఆయారంగులు ఫ్రాబ్రిక్స్ డిజైన్‌లు ఎన్నుకోవాలి.. దానిలో ఈమె పూర్తి మార్కులు సాధించారనే చెప్పాలి. పాటల్లో వచ్చే దుస్తులైతే అద్భుతమనే చెప్పాలి.
నృత్యం:
సాధారణంగా చారిత్రకసినిమాల్లో తప్పకుండా ఒక జానపదగీతం, ఒక పండగ గ్రూప్‌ డాన్స్ వుంటాయి. అదొక ఫార్మాట్‌.గతంలో వచ్చిన కమల్‌హాసన్‌ ఉత్తమవిలన్‌, బాలకృష్ణ శాతకర్ణి లో కూడా ఈ ఫార్మాట్‌ మిస్‌ కాలేదు.ఈ సినిమాలోకూడా ఈ రెండు గీతాలూ ఉన్నాయి. జానపదనృత్యంగా వచ్చే పాట తదుపరి వచ్చే కీలకమైన సీన్‌ కి ప్రీల్యూడ్‌ గా వాడుకున్నారు.

ఇందులో మంచి మీద చెడు ఎలా ప్రభావంచూపుతుంది తుదకు మంచే గెలుస్తుంది అనేది క్షుద్ర తాంత్రిక నేపథ్యంలో సర్రియలిస్టిక్‌గా తీర్చి దిద్దారు డాన్స్ మాస్టర్‌బృంద. తమిళ మళయాళ సంప్రదాయ నృత్యరీతులైన తెయ్యం విల్లుపట్టులను అందంగా వాడుకున్నారు. కంసవధ పాటలోని కృష్ణుని నృత్యంలో కొన్ని మాడర్న్ టెక్నీక్స్ మేళవించి అందంగా చూపించారు.
స్టంట్స్:
చారిత్రక నేపథ్యంలో సాగే కథలో యుద్ధాలు తప్పక ఉంటాయి. అసలు యుద్ధమే ముఖ్యకథనంగా సాగే సినిమాలు మనకి ఎన్నోవచ్చాయి. కొన్ని మెప్పించాయి కొన్ని చప్పరింపజేసాయి.ప్రస్తుతం రిలీజ వుతున్నసినిమాలను బాహుబలి ట్రిపులార్‌ మూవీలతో పోల్చడం సాధారణం. దానిని తప్పించుకోవాలంటే అంతకు మించి చెయ్యాలి.

రాజులు రాజ్యాలు కుతంత్రాలు ఉన్నప్పుడు యుద్ధాలు తప్పనివే. ఈ సినిమాలో కూడా హీరోల ఇంట్రో ఫైట్లూ కూడా మామూలే…భారీ ఎలివేషన్లు లేకుండా చాలా సహజంగా మన కళ్ళముందు జరుగుతున్నట్లుగానే వున్నాయి… ఒళ్ళు గగుర్పొడిచేలాగేం కంపోస్ చెయ్యలేదు ఈ స్టంట్‌‌ మాస్టర్స్…దిలీప్‌ సుబ్రహ్మనియన్‌, కిచ్చా కంప్కాడే, శ్యామ్‌కౌశల్‌ మొత్తం తమ ఎనర్జీ తుఫానులో ఓడలపై పోరుకే ఖర్చుచేసినట్లుంది. పేలవంగా వున్నాయు… పార్ట్ 2 లో ఏమైనా కనువిందుచేస్తారేమో…!

VFX : కోటలు, సముద్రంలో ఓడలు, ఓడలపై యుద్ధం, తుఫానులో ఓడలపై పోరు లాంటివాటికి VFX ని వాటిని బాగా వాడుకున్నారు. కానీ రక్తి కట్టలేదు. తేలిపోయాయి. కానీ మరీ రాధేశ్యాంలోని టైటానిక్‌ మునిగిపోవడం లాగా లేదు… రిఫ్లెక్షన్‌ పిక్చర్‌ స్టూడియో టీం అంచనాలకు తగినట్లుగా విష్యూవల్‌ ఎఫెక్ట్స్ లేవు.

ఇక నటులు వారి నటన గురించి ఇప్పటికే మనం చిలువలు పలువలుగా వచ్చిన రివ్యూలు చదివున్నాం.
ముఖ్యంగా చెప్పుకోవసింది నలుగురిని. కథను నడిపించే వల్లవరాయన్‌ పాత్రలో కార్తీ…
అలవర్కడియన్‌ వీరవైష్ణవ వేగుగా నటించిన జయరామన్‌ .. చోళయువరాణి కుందువై పాత్రలో నటించిన త్రిషా ,పొన్నియ సెల్వన్‌ గా చేసిన జయం రవి.. వీరు తాముగాకాకుండా పాత్రలే కనపడేంత చక్కగా నటించారు.

జయం రవి లో హూందాతనం రాజసం చాలా బాగున్నాయి. ఈ పార్ట్ లో వచ్చినది చిన్న నిడివే ఐనా చాలా బాగా నటించాడు. డైలాగ్‌ డెలివరీ బాడీలాంగ్వేజ్‌ మెప్పింపజేసాయి. జయరాం నటన నెక్ట్స్ లెవల్‌…అచ్చుగుద్దిన వీరవైష్ణవ బ్రాహ్మణుని గా బాగా చేసాడు. హ్యూమర్‌ పండిస్తూనే కథ గమనాన్ని చక్కగా పోషి స్తూ సస్పెన్స్ ని భద్రంగా తీసుకురాగలిగాడు.

చోళయువరాణి కుందువైగా నటించిన త్రిష ముందు చోళచరిత్రలో కీలక పాత్రైన నందిని గా చేసిన ఐష్వర్యా రాయ్‌ తేలిపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇద్దరు ఎదురుపడే సీన్‌లో అతిలోక సౌందర్యవతి ఐశ్వర్య -త్రిషా ముందు తేలిపోయింది. ఇన్ని సంవత్సరాల్లో త్రిషా చాలా పరిణితిచెంది తన screen  ప్రెజె న్స్ ని ఇంప్రూవ్‌చేసుకుంది.

ఇక చోళరాజు ఆదిత్య/ కరికాల చోళునిగా నటించిన విక్రం గురించి చెప్పడానికేముంది… తానున్న ప్రతి సీనులో ఇతర పాత్రలని మింగేసాడు.
డబ్బింగ్:
తెలుగులో డబ్‌ చేసారు కాబట్టి తెలుగులో పాత్రలకు గొంతు అరువిచ్చిన వారిగురించి కూడా చెప్పుకోవాలి….
గాత్రదానం వల్ల ప్లస్‌-
జయరామ్‌కు గొంతిచ్చిన తనికెళ్ళభరణి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. మొదటగా మనకు జయరామ్‌ బదులు భరణి కనపడతాడు/ వినపడీ కనపడతాడు… కానీ రాను రాను జయరామ్‌ నటన మనల్ని కమ్మేసి ఇది అతని గొంతే అని అనేంత అలవాటైపోతుంది.

గాత్రదానం వల్ల మైనస్‌‌-
చోళరాజ్య పతనానికి పావులుకదిపే నందిని పాత్రలో కనపడిన ఐశ్వర్య రాయ్‌ కి సింగర్‌ సునీత డబ్బింగ్‌ చెప్పింది. బహుషా ఇందువల్లనే ఆ పాత్ర అంతగా మనల్ని రంజింపచెయ్యలేదేమో అనిపిస్తుంది. డైలాగొచ్చిన ప్రతిసారీ సునీతే బుర్రలో తిరుగుతుంది. ఏ మాత్రం కొత్తదనంలేకుండా పదేపదే విన్న ఆగొంతు ఐశ్వర్యకి ఆమె నటనకి నప్పలేదు.

ఓవరాల్‌గా చరిత్ర కొంతైనా తెలిసినా కథతోపాటూ మనమూ ప్రయాణిస్తాము. ఎలాంటి ఎగుడుదిగుడులు లేకుండా చాలా అందంగా సాగిపోయింది.గందరగోళంగా వుంది…. అర్థం పర్థంలేకుండావుంది అన్న రివ్యూలను చూసి ఆశ్చర్యపోయాను.ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. నేటి జనరేషన్‌కి మన పూర్వీకులు ఎన్ని కష్టాలుపడ్డారు, రాజులు రాజ్యాలు వారి చరిత్రలు ఏంటి, స్వేచ్చావాయువులు మనకెలా దొరికాయి అనేవిషయాలు కొన్నైనా అర్థమవుతాయి.ఇది చూసాక రెండో పార్ట్ కోసం ఎదురు చూపులు తప్పవు…. కాని బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్నలేకుండానే!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!