prevention of child marriages………..
దేశంలో బాల్యవివాహాలకు సంబంధించి ఆ మధ్య కేంద్రం ఓ నివేదిక రూపొందించింది. ఆ నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 21 ఏళ్లకు ముందే పెళ్లికుమార్తెలుగా మారుతున్న వారి శాతం పశ్చిమ బెంగాల్ లో 54.9 కాగా, జార్ఖండ్ లో 54.6 శాతం గా నమోదు అయింది. లెక్కలోకి రానివి మరిన్ని ఉండొచ్చు.
ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అస్సాం లో చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు (Child Marriages) చేసుకున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఇందుకు పాల్పడిన వారిని ప్రభుత్వం అరెస్టు చేస్తున్నది. ఇప్పటివరకు అస్సాం లో 2,278 మందిని అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసు శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నమోదైన 4,074 ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. వీటిలో అత్యధికంగా దుబ్రి జిల్లాలో 374 మందిని అరెస్టు చేయగా, హెూజాయ్ జిల్లాలో 255 మంది, మోరిగోన్ జిల్లాలో 224 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అరెస్టు చేసిన వారిని విడుదల చేయమని పలువురు మహిళలు, వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు.
“ఆధార్లో మా కోడలి వయసు తప్పుగా ఉండటంతో నా కొడుకును అరెస్టు చేశారు. ఇప్పుడు శిక్ష పడి జైలుకు వెళితే నా కోడలు, ఏడాది బిడ్డతో ఎక్కడి పోవాలి? వారిని ఎవరు పోషిస్తారు?” అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేదన కూడా నిజమే … ఎపుడో జరిగిన పెళ్లిళ్ల వ్యవహారం లో ఇపుడు మరీ కఠినంగా వ్యవహరించకూడదు.
చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు జన్యుపరమైన లోపాలతో పుడుతున్నారని చెబుతున్న ప్రభుత్వం అవగాహన పెంచే దిశగా అడుగులు వేయాలి. ఈ అరెస్టుల ప్రక్రియ 2026 ఎన్నికల వరకు కొనసాగుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. మిగతా రాష్ట్రాలు కూడా అస్సాం మాదిరిగా స్పందించాలి. అపుడే దేశ వ్యాప్తంగా బాల్యవివాహాలు తగ్గుముఖం పడతాయి.