…………………………….
A different movie ………………………… ………….
వ్యవస్థల తీరుపై సంధించిన అస్త్రం.. ఈ జనగణమన. ముఖ్యంగా మీడియా పనితీరును ఉతికి ఆరేశారు. సందర్భానుసారంగా ఇతర వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపుతూ…. కడిగి పడేసారు. దర్శకుడు .. కథా రచయిత .. డైలాగ్ రైటర్ ఈ సినిమా కోసం చాలా వర్క్ చేసారు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే.
ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు.. అసలు నిజాలు తెలుసుకునే యత్నమే చేయకుండా.. సెన్సేషన్ కోసం పాకులాడే మీడియా కు బాగా చురకలు వేశారు. కట్టుకథలు, పిట్టకథలు, అబద్ధాలతో.. మీడియా చేసే ప్రచారం సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో చర్చించాడు దర్శకుడు.
దిశ ఎన్ కౌంటర్.. రోహిత్ వేముల ఆత్మహత్య.. ఇలా అన్నీ మనకు తెలిసిన కథలే.అలాంటి కథల వెనుక ఉన్న వ్యథలకు ఎలాంటి బూటకపు వైట్ కాలర్ రంగులద్దుతారో విశదీకరిస్తుంది సినిమా
పోలీస్, పొలిటికల్ సిస్టమ్స్ ఎలా చేతులు కలుపుతాయో దర్శకుడు చక్కగా చూపారు. . ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగుంటాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారన్న విషయాన్ని సెల్యూలాయిడ్ కి ఎక్కించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
రాజకీయ నాయకులు వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఓట్ల రాజకీయం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపారు.మొదటి భాగం ఒక పాత్ర పరంగా కథ నడిపితే రెండో భాగం మరో పాత్ర ద్వారా కథ నడుపుతారు.
ద్వితీయార్థంలో కోర్టులో వాదనలు ఆకట్టుకుంటాయి. కథలో ట్విస్టులకు కొదవే లేదు.సమాజంలో నిజానికి చోటు ఎంత ? అబద్దానికి బలం ఎంత ? న్యాయ వ్యవస్థ మీద జనాలకు ఉన్న నమ్మకం ఎంత ? వంటి అంశాలు బాగా చూపించాడు డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ. ఈ కథను రాసింది షరీస్ మహమ్మద్. కథకు తగినట్టు మంచి నటులు దొరికారు కాబట్టి అన్ని సీన్లు పండాయి.
ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్,మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పుకోవాలి. ఫొటోగ్రఫీ , మ్యూజిక్ కూడా సినిమాకు బలాన్ని ఇచ్చాయి. సీరియస్ సినిమాలు చూసే వారికి ఇది బాగా నచ్చుతుంది. వ్యవస్థలోని చెడుకి అంతిమ గీతం పాడాల్సిందే అనే భావన తో జనగణమన టైటిల్ ఎంచుకోవడం బాగుంది. టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చారు.