సాలగ్రామాలకు దివ్యశక్తులు ఉన్నాయా ?

Sharing is Caring...

Are these all fossils? ………………………………………………

హిందూ దేవాలయాలలో ముఖ్యంగా వైష్ణవ ఆలయాలలో ….అలాగే విష్ణుమూర్తి ని కొలిచే భక్తుల ఇండ్లలోని  పూజా గృహాలలో పూజించే ఒక రకమైన నల్లని రాళ్ళని సాలిగ్రామాలు/సాలగ్రామాలు అంటారు. ఇవి నేపాల్ లోని గండకీ నది పరీవాహక ప్రాంతంలో లభిస్తాయి.ఈ రాళ్ళు మృదువుగా అక్కడక్కడా కొన్ని గుర్తులతో అండాకారం లో ఉంటాయి.

ఆ గుర్తులు విష్ణువు ఆయుధాలని చెప్పుకునే శంఖం,చక్రం, గదలను, విష్ణువు అవతారాలైన మత్స్య,కూర్మావతారాలను తలపించే విధంగా ఉండటం వలన ఆ రాళ్ళకు దివ్య శక్తులున్నట్లు ప్రజలు విశ్వసిస్తారు.

గండకీ నదిలో లభ్యమయ్యే ఈ సాలగ్రామాలలో కొన్ని సౌమ్యమైనవి .. కొన్ని ఉగ్రమైనవి ఉంటాయని అంటారు. వీటిలో శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి ,శిలా శుద్ధి ,వర్ణశుద్ధి గల వాటినే పూజించాలని చెబుతారు. పలు రంగులు కలిగినవాటిని, ముక్కలైనవాటిని పూజించకూడదని అంటారు.

నారసింహా, పాతాళ నరసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలని చెబుతారు. విష్ణు, సీతారామ, గోపాల వంటి సాలగ్రామాలను గృహస్తులు పూజించాలి. తిరుపతిలో వెంకన్నకు,మంత్రాలయంలో రాఘవేంద్రస్వామికి విశేష మహిమలు ఉండటానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అని అంటారు.

పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్త్రీ మూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని, ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామివారు, మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించినపుడు.. తాను సాల గ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తానని చెప్పినట్టు కథనం ప్రచారంలో ఉంది.

వేరే కథనాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ఈ సాలగ్రామాలు ఒక్క గండకీ నదిలో తప్ప ఎక్కడ దొరకవని అంటారు.అక్కడే లెక్కలేని సంఖ్యలో పుడతాయట. ముక్తినాథ్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ సాలగ్రామాలు తెచ్చుకుంటారు. శ్రీమన్నారాయణుని రూపాలుగా భావించే సాలిగ్రామ శిలల ప్రసక్తి విష్ణుపురాణం, గండకీ మహాత్మ్యంలో ఉంది. బౌద్ధులు వీటిని  ‘చ్యుమింగ్‌ గ్యట్సా’ అని వ్యవహరిస్తారు.అంటే ‘శతజలా’లని అర్థం. పురాతన కాలం నుంచి  వీటి ఉనికి ఉంది.

ఇక జియాలజీ పరంగా చెప్పుకోవాలంటే  65 మిలియన్ సంవత్సరాల క్రితం (క్రెటేషియస్ శకం) అంతరించిపోయిన ‘అమ్మో నైట్స్’ అనే సముద్ర జీవజాతుల శిలాజ అవశేషాలుగా వాటిని శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనొసార్లు అంతరించింది కూడా ఈ కాలంలోనే. భూభాగాలు రెండు దగ్గరికి జరిగి బలంగా ఢీకొని సముద్రపు నేల బయటకు చొచ్చుకు వచ్చి హిమాలయాలుగా రూపాంతరం చెందాయి.  

ఈ సంఘటన వల్ల అక్కడ ఉన్న సముద్రం మొత్తం కప్పబడి, అందులో ఉన్న జీవజాతులన్నీ నేలలోకి కూరుకుపోయి శిలాజాలుగా మారాయి.బలంగా ఉండే నత్త గుల్లలు,తాబేలు దొప్పలు, చేప ఎముకల ఆనవాళ్ళు మట్టి మీద అలాగే ఉండిపోయి కాలక్రమంలో ఆమట్టి గట్టి రాళ్ళలాగా మారిపోయాయి అంటారు.

హిమాలయాల పై నుంచి మంచు కరిగి ప్రవహించడం ద్వారా ఏర్పడ్డ గండకీ నది లో దొర్లుకుంటూ ఇవి ప్రయాణించడం వల్ల రాళ్ళ ఉపరితలం మృదువుగా మారుతుంది.ఇదే తరహాలో యూరప్ లో కూడా పాముల నుండి ఏర్పడిన ‘సెర్పెంటిన్’ అనే రాళ్ళకు దైవశక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారట.
ఇక ఈ సాలగ్రామాలు అమెజాన్ లో దొరుకుతున్నాయి. వీటి ధర 100 నుంచి 2000 వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి    >>>>>>>  ఏమిటీ మదాలసోపాఖ్యానం ?

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. Phanikumar November 20, 2024

Leave a Comment!

error: Content is protected !!