Classic movie……………………………………………..
గుండమ్మకథ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు చాలా కృషి చేశారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట.
ముందుగా కథ ఫైనలైజ్ కావడానికి చాలా సమయం పట్టింది. ఈ కథ ఒరిజినల్ లైన్ జానపద బ్రహ్మ విఠలాచార్యది. విఠలాచార్య కన్నడంలో “మనె తుంబిద హెణ్ణు” పేరిట ఒక సినిమా తీశారు. దాని హక్కులు విజయా నాగిరెడ్డి కొనుక్కున్నారు. తెలుగులో రీ మేక్ చేయడానికి పూనుకున్నారు. కన్నడ సినిమా కథలో ” గుండమ్మ” అనే గయ్యాళికి, నోరు మెదపలేని భర్త ఉంటాడు.
ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ సొంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ ఒకతనికి ఇచ్చి పెళ్ళిజరిగేలా ప్లాన్ చేస్తాడు. అలా సాగుతుంది కన్నడ సినిమా కథ.
ఈ కథకు మార్పులు చేర్పులు ప్రముఖ రచయిత డీవీ నరసరాజు చేత చేయించారు. తొలుత ఆ సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని ఎంచుకున్నారు. అయితే బి.ఎన్.రెడ్డి కి కూడా ఈ కథ అంతగా నచ్చలేదట .. దాంతో నాగిరెడ్డి పి.పుల్లయ్య ను సంప్రదించారు. అప్పటికే పుల్లయ్యకు హిట్ డైరెక్టర్ గా పేరుంది.
బండరాముడు , జయభేరి , శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం సినిమాలు ఆయన డైరెక్షన్లో వచ్చాయి. అప్పట్లో పరిశ్రమలో ఇంకో పుల్లయ్య కూడా డైరెక్టర్ గా ఉన్నారు. చిత్తజల్లు పుల్లయ్య గా ఆయన పాపులర్. లవకుశ వంటి హిట్ సినిమాకు ఆయనే దర్శకుడు. వారి అబ్బాయే సీఎస్ రావు.
కాగా నరసరాజు తాను సిద్ధం చేసిన స్క్రిప్ట్ ను పీ. పుల్లయ్య కు వినిపించారట. పుల్లయ్య కథ, ట్రీట్మెంట్ నచ్చలేదని పెదవి విరిచారు. దీంతో నాగిరెడ్డి కి విసుగొచ్చి స్క్రిప్ట్ ను సహా నిర్మాత , రచయిత చక్రపాణికి ఇచ్చారట. చక్రపాణి కథలో చాలామార్పులు చేసి .. కొన్ని క్యారెక్టర్స్ లేపేసి మరికొన్ని కొత్త పాత్రలను ప్రవేశ పెట్టారు.
అపుడు దానికో రూపం వచ్చింది. ఆ వెంటనే అప్పటికే విజయా ప్రొడక్షన్స్ లో పని చేస్తున్న దర్శకుడు కమలాకర కామేశ్వర రావు ని పిలిపించారు. ఆయన కొన్ని మార్పులు సూచించారు. వాటికి ఒకే అన్న నాగిరెడ్డి కామేశ్వరరావునే దర్శకుడిగా ఖరారు చేశారు. కామేశ్వరరావు విజయా వారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ గా పనిచేశాడు.
తర్వాత విజయా వారే నిర్మించిన చంద్రహారం సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యాడు. కేవీరెడ్డి , కామేశ్వరావులు ఒకే లాడ్జిలో ఉండేవారట.కేవీ రెడ్డి దగ్గర చాలా సినిమాలకు కామేశ్వర రావు వర్కు చేశారు.అంతకు ముందు వాహిని వారి గృహలక్ష్మి,దేవత వంటి సాంఘిక సినిమాలకు పనిచేశారు. ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావును విజయావారి కి పరిచయం చేసింది కూడా ఆయనే.
అలా కామేశ్వరరావు దర్శకుడిగా ఫిక్స్ అయ్యాక చక్రపాణి, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కథను, కథనాన్ని నిర్ణయించారు. గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను విధవరాలిగా చూపించాలని నిర్ణయించారు. కథలో పలు మార్పులు చేశారు. సినిమాలో గుండమ్మ పాత్ర చుట్టూ కథ తిరిగేలా చూసారు.
సినిమాలో సూర్యకాంతం పోషించిన పాత్ర పేరు గుండమ్మ. నిజానికి అది తెలుగుపేరు కాదు కన్నడపేరు. దాన్నిఅలాగే ఉంచేసి సినిమా టైటిల్ కూడా గుండమ్మకథ అని ఫైనల్ చేసారు. సినిమాకు అందరి నటుల కాల్ షీట్లు ఒకే సారి దొరకక … దొరికినవారివి దొరికినట్టు సినిమా పూర్తి చేశారు. ఆవిధంగా ఆరోజుల్లో నిర్మాతలు రచయితలు అంత కష్టపడ్డారు కాబట్టి గుండమ్మకథ సూపర్ హిట్ అయింది.
ఇదే కథ ను “మానితన్ మారవిల్లై”పేరిట తమిళం లో కూడా తీశారు. ఆ సినిమాను చక్రపాణి డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ బదులు జెమినీగణేశన్ చేశారు. నాగేశ్వరరావు ,జమున, సావిత్రి లు అవే పాత్రల్లో నటించారు. ఇందులో సరోజ పాత్ర చేసిన నాటి హీరోయిన్ జమున కు హీరో పాత్రలో చేసిన అక్కినేనికి అప్పట్లో మాటల్లేవట. నాగిరెడ్డి ఆ ఇద్దరితో మాట్లాడి సమస్య సాల్వ్ చేసి సినిమా మొదలు పెట్టారు.
గుండమ్మకథ’ విడుదలకు 10రోజులు ముందు ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో ఈ సినిమాను ప్రదర్శించారు. అక్కడ తెరపై ఎన్టీఆర్ నిక్కర్‌తో కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న పిల్లలు,పెద్దలు అందరూ నవ్వేశారట.అదే సమయంలో కథ ఏమీ లేదని, సూర్యకాంతంలో గయ్యాళితనాన్ని సరిగా చూపించలేదనీ విమర్శలు వచ్చాయి.పిల్లలు నవ్వగానే చక్రపాణి మన సినిమా హిట్ అన్నారట.
అదే జరిగింది. ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచే టాప్ క్లాసిక్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. అన్నట్టు ఈ సినిమాను తెలుగులోనే మళ్ళీ తీద్దామని కొన్ని ప్రయత్నాలు జరిగేయి కానీ అవేవి ఫల ప్రదం కాలేదు. ఈ సినిమా విడుదల అయి 60 ఏళ్లు అయినా ఇప్పటికీ గుండమ్మ కథ ఓ క్లాసిక్. ఈ సినిమాను రీమేక్ చేస్తే మిగతా పాత్రలకు నటులు దొరుకుతారు కానీ గుండమ్మ పాత్ర చేసే నటి దొరకడం అసంభవం. అదే సూర్యకాంతం ప్రత్యేకత.
—KNMURTHY