Subramanyam Dogiparthi ………………… Rebellion against the rule of doralu
బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ , క్లాసిక్ సినిమా . పాండవులు అనో,లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు. టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది.
భారతంలో పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా అయిదుగురు పాండవులు , ఓ దుర్యోధన+దుశ్శాసనుడు ఉంటాడు, ఓ శకుని ఉంటాడు. వీరందరూ ఉన్నాక కృష్ణుడు లేకుండా ఎలా ఉంటాడు !? కాకపోతే భారతంలో కృష్ణుడు బలరాముడి తమ్ముడు , ఈ సినిమాలో దుర్యోధనుడు+దుశ్శాసనుడికి తమ్ముడు. ఆపాత్రను కృష్ణంరాజు పోషించారు.
ఈ సినిమా నిర్మాణంలో కృష్ణంరాజు కూడా భాగస్వామి..ఆయన పాత్రను వెరైటీ గా సృష్టించారు..ఆ పాత్రకు పాటలు కూడా పెట్టారు. భారతంలో లాగా ద్రౌపది ఉండదు.మోసగించబడిన, అవమానించబడిన స్త్రీ ఉంటుంది. పండిత పామరుల మెప్పు పొందిన ఈ మన ఊరి పాండవులు సినిమా 1978 లో వచ్చింది .
‘పడువారళ్ళి పాండవురు’ అనే కన్నడ సినిమాకు రీమేక్. కన్నడంలో అంబరీష్ , రామకృష్ణ (మన రామకృష్ణ కాదు) , ఆరతి , తదితరులు నటించారు. ఆ తర్వాత కాలంలో బాపుయే హిందీ లోకి ‘హం పాంచ్’ అనే టైటిలుతో రీమేక్ చేసారు. హిందీలో సంజీవ్ కుమార్ , మిధున్ చక్రవర్తి తదితరులు నటించారు. ఈ ‘హం పాంచ్’ ని హిందీలో నటి శ్రీ దేవి భర్త బోనీకపూర్ తీశారు.
బాపు దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా ఇదే. ఈ సినిమాకు బాలు నేపథ్య సంగీతం అందించారు. పాటలకు లక్ష్మీ కాంత్-ప్యారే లాల్ సంగీతం అందించారు. సినిమా విజయం సాధించి బాపు హిందీలో మరిన్ని సినిమాలు తీయడానికి దోహదపడింది.తమిళ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అయింది.తమిళ సినిమాలో శరత్ బాబు , సరిత , గీత , తదితరులు నటించారు.
మన తెలుగు సినిమాకు మూడు అవార్డులు కూడా వచ్చాయి. కృష్ణంరాజుకు ఉత్తమ నటుడిగా , నిర్మాతలకు ఉత్తమ చిత్రంగా , బాలూ మహేంద్రకు ఉత్తమ సినిమాటోగ్రాఫరుగా అవార్డులు వచ్చాయి. అవార్డులతో పాటు డబ్బులు కూడా దండిగానే వచ్చాయి.
ఈ సినిమా చాలామందికి సినిమా జీవితాన్నిఇచ్చింది. ప్రముఖ నటీమణి గీతకు , ప్రముఖ నటుడు భానుచందర్ కి ఇది మొదటి సినిమాయే. చిరంజీవికి రెండో సినిమా. సినిమాలో దుర్యోధనుడికి మేనల్లుడిగా, మేనమామను ప్రతిఘటించే యువకుడిగా ఎనర్జిటిక్ గా నటించి , మంచి పేరు తెచ్చుకున్నారు.
చిన్న పాత్ర అయినా చిరంజీవి కెరీర్ కి ఈ సినిమా ఊపునిచ్చింది.చిరంజీవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు తెలుగుతెరకు భవిష్యత్తు తారను అందించిన ఘనత ‘మనఊరి పాండవులు’ సినిమాకు దక్కుతుంది.
ప్రసాద్ బాబుకి కూడా రెండో సినిమాయే. ఈ సినిమాలో సుందరి పాత్ర పోషించిన శోభ తెలుగులో రెండు సినిమాల్లోనే నటించింది. ఆ రెండింటిలో ఒకటి ఈ సినిమా. అమాయక గ్రామీణ యువతిగా,దొరగారి చేతిలో భంగపడిన యువతిగా చాలా బాగా నటించింది.
ముళ్ళపూడి డైలాగులు సినిమాకు పెద్ద ఎస్సెట్. ‘కోపానికి,ఆడదాని అందానికి పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారు.’ ‘దొరగారి చేతి సీసాలకు మూతలుండవు’.. ‘పేకాట లోను ఇంకోదాంట్లోనూ అరువులు కుదరవు.’ ‘దేవుడు పేదోడికి సాక్ష్యం చెప్పడు, సహాయం చేయడు’.. ‘వానపాములు కూడా బుసకొడుతున్నాయి’. ‘మీరు దొరలూ .. మేము బంట్లమ్’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి.
ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు సమీపంలో ఉన్న దోసకాయలపల్లి గ్రామంలో జరిగింది. సినిమా కధకు చక్కని నేపధ్యం ఈ గ్రామంలో కనిపిస్తుంది. నిత్యం దొరగారి చేతిలో ఓడిపోయి డబ్బులు సమర్పించుకునేందుకు ఓ పేకాట పిచ్చోడు ధర్మయ్య పాత్ర కూడా ఉంది.ఆపాత్రను కాంతారావు పోషించారు.
కన్నప్ప పాత్రలో అల్లు రామలింగయ్య చెలరేగిపోయారు. దొర పాత్రలో రావుగోపాలరావు నట విరాట్ స్వరూపాన్ని చూపారు.. ఇతర ప్రధాన పాత్రల్లో సారధి , ఝాన్సీ , హలంలు నటించారు .కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా బాగుంటాయి. కొన్ని బాగా హిట్టయ్యాయి కూడా . పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా అనే అల్లుని టీజ్ చేసే సాంగ్ బాగుంటుంది. నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా పాట కూడా బాగుంటుంది. ప్రసాద్ బాబు , గీతల మీద తోటలో చిత్రీకరించారు.
సిత్రాలు చేయురో శివుడో శివుడా , ఒరేయ్ పిచ్చి సన్నాసీ , మంచికి చెడ్డకి పోరాటం పాటలు కృష్ణంరాజుతో ఉంటాయి . కదిలిందయ్యో రధము కదిలిందయ్యో దొరగారు చెయి వేస్తే కదిలిందయ్యో పాటతోనే సినిమా మొదలవుతుంది. జయమాలిని మీద కూడా ఓ పాట , డాన్స్ ఉంది కానీ బాపు మార్కు కనిపించదు. బాలు మహేంద్ర కెమెరా పనితనం సినిమాకు ప్లస్ అయింది. యూట్యూబ్ లో సినిమా ఉంది .. చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి.