గయ్యాళి తనానికి ట్రేడ్ మార్క్ !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala …………………………………….

సూర్యకాంతం. చాలా చక్కటి పేరు. అలాంటి పేరు ఎవరూ పెట్టుకోడానికి లేకుండా చేశావు కదమ్మా అని గుమ్మడి వెంకటేశ్వర్రావు వాపోయేవారు. అంతటి ప్రభావవంతమైన నటనతో తెలుగు సినిమాను వెలిగించిన నటి సూర్యకాంతం. అమాయకత్వం లా అనిపించే ఓ తరహా సెల్ఫ్ సెంటెర్డ్ నేచర్ ఉన్న కారక్టర్లను పోషించారు తప్ప సూర్యకాంతం పూర్తి స్థాయి విలనీ చేయలేదు.

ఆవిడ చేసిన గయ్యాళి పాత్రల్లో కాస్త అమాయకత్వం కలగలసి ఉండడం చేత ఆడియన్స్ కు జాలితో కూడిన కోసం వస్తుంది తప్ప సీరియస్ గా కోపం రాదు. దర్శకులో రచయితలో చెప్తే ఆవిడ అలా చేసుంటారు అని అనుకోలేం. ఆవిడ తనకి వచ్చిన పాత్రలను అలా మలచుకున్నట్టు అనిపిస్తుంది.

ముళ్ళపూడి వెంకట రమణగారు అన్నట్టు మంచీ చెడు విడి విడిగా రాసులు పోసి ఉండవు. ఓ మంచి వాడు వెంటవెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడుగా మారిపోవచ్చు. ఓ చెడ్డవాడు అస్సలు అవకాశాలు రాక మంచివాడుగా మిగిలిపోవచ్చు. అలా తను చేసే పాత్ర సైకాలజీని కూడా అర్ధం చేసుకుని నటించడం సూర్యకాంతం సాధించిన ప్రతిభ.తను నటించిన ఏ పాత్ర చూసినా ఈ విషయం ఇట్టే అర్ధమైపోతుంది.

మాయాబజార్ సినిమాలో హిడింబిగా సూర్యకాంతం నటన డైలాగ్ చెప్పే పద్దతి … మర్చిపోవడం సాధ్యమా? కొడుకు మంచివాడేగానీ … కాస్త దుడుకు స్వభావి. దాంతో తానే ప్రమాదంలో ఇరుక్కుంటాడో … ఎవరికే ప్రమాదం తెస్తాడో అని ఓ కన్ను ఎప్పుడూ కొడుకు మీదే వేసి ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్న కొడుకును ఏమన్నా అంటే హర్ట్ అవుతాడని..

కుమారా … కుమారా అంటూ అనునయంగానే గద్దిస్తూ మాట్లాడడం … చూస్తే … మన ఇళ్లల్లో మన బంధువుల్లో ఇలాంటి తల్లులు గుర్తుకు రాకమానరు. పైగా ఎస్వీఆర్ తల్లిగా చేసి మెప్పించడం ….
తల్లి తనను కంటికి రెప్పలా చూసుకుంటోందని ఘటోత్కచునికీ తెల్సు. అందుకే తల్లంటే అంతటి మర్యాద.

తను మాయాశశిరేఖ గా అంతఃపురంలో ఉన్నప్పుడు రేవతీదేవి రాక గమనించి అమ్మొస్తోందని చెలికత్తెలు అనగానే … అసంకల్పితంగా “హమ్మో అమ్మే ” అనేస్తాడు ఘటోత్కచుడు. ప్రేక్షకులు కూడా విపరీతంగా కన్విన్స్ అయిపోతారు.సింగిల్ మదర్ …. పిల్లల పట్ల వ్యవహరించే తీరును సూర్యకాంతం అభినయించిన తీరు గురించి ఎన్ని గ్రంధాలైనా రాయవచ్చు. మాయాబజార్ లో అందరి గురించీ మాట్లాడుతూ ఉంటారుగానీ సూర్యకాంతం పాత్ర నడిపిన తీరు ఆవిడ నటించిన తీరు అద్భుతం.

1924 లో కాకినాడ దగ్గర వెంకట కృష్ణ రాయవరంలో పుట్టిన సూర్యకాంతం 1949లో సినిమా ప్రవేశం చేశారు.అదీ డాన్సర్ గా…. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా..చంద్రలేఖ……. ఆ తర్వాత రుక్మాంగద, నారద నారది చిత్రాలతో కాస్త కనిపించే వేషాలు వేశారు.

నిజానికి హిందీ సినిమాల్లో నటించాలనే అభిలాష బలంగా ఉండేది సూర్యకాంతం కు. అయితే ఎల్వీ ప్రసాద్, సీఎస్ఆర్ లాంటి వారు నచ్చచెప్పడంతో తెలుగు సినిమాకే పరిమితం అయ్యారు. లేకపోతే తెలుగు సినిమా ఎంత నష్టపోయేదో తల్చుకుంటేనే మనసు బాధతో మూలుగుతుంది.

సంసారం చిత్రంతో గయ్యాళి తనానికి ట్రేడ్ మార్క్ గా మారిపోయింది సూర్యకాంతం. సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో జీవాన్ని నింపిన సహజ నటి సూర్యకాంతం.
సూర్యకాంతానికి నటించే అలవాటు బొత్తిగా లేదు…. జస్ట్ ఆ కారక్టర్ లో బిహేవ్ చేస్తారంతే. ఇక డైలాగ్ రైటర్ రాసిన డైలాగుల్ని అబ్జర్వ్ చేసి వాటిని తన డిక్షన్ లోకి మార్చేసుకుని స్క్రీన్ మీద అదరగొట్టేస్తారు సూర్యకాంతం.. .

సూర్యకాంతం చేసిన గయ్యాళి పాత్రలన్నీ ఒక స్పెషల్ క్యాటగిరీకి చెందినవే. స్వార్ధంతో కంటే సెల్ఫ్ సెంటర్డ్ నెస్ తో కళ్లుమూసుకుపోయి దెబ్బతినే పాత్రలే ఎక్కువగా సూర్యకాంతం చేసింది. అంతిమంగా తప్పు తెల్సుకుని చెంపలేసుకునే పాత్రలూ అనేకం ఉన్నాయి వాటిలో. సూర్యకాంతం చేసిన చాలా గయ్యాళి తరహా పాత్రల్లో హాస్యరసం మిళితమై ఉంటుంది. వాటిని హాస్యపాత్రలూ అనవచ్చా అనేది చర్చనీయాంశం. అది తేలితే తప్ప సూర్యకాంతాన్ని కమేడియన్ అనలేం.

అన్నపూర్ణావారి తోడి కోడళ్లు లో అదే తరహా పాత్ర చేశారు సూర్యకాంతం…. ఎవరు ఎన్ని విధాలుగా నిర్వచించినా…సూర్యకాంతం పేరు చెప్పగానే హడలెత్తిపోవడం సహజం…. ఒక సారి సూర్యకాంతం ఇంట్లో వంట పనిచేయడానికి ఒకావిడను కాకినాడలో ట్రైన్ ఎక్కించారట బంధువులు. ఎవరింట్లో వంట చెయ్యాలో ఆవిడకు చెప్పలేదు.

తీరా మద్రాసులో దిగీదిగ్గానే తను వంట చేయాల్సింది సూర్యకాంతం ఇంట్లో అని రిసీవ్ చేసుకోడానికి వచ్చిన వాళ్ల ద్వారా తెల్సుకుని … ససేమిరా అని వెనకాల ట్రైన్ లో కాకినాడ పారిపోయిందట ఆవిడ.అదీ సూర్యకాంతం ఇమేజ్ పవర్… బెజవాడ గాంధీనగర్ లో సూర్యకాంతం కి ఓ ఇల్లుండేది.
ఆ ఇంట్లో ఆవిడ బంధువులు అద్దెకుండేవారు. అప్పుడప్పుడూ రహస్యంగా వారింటికి వచ్చిపోతూ ఉండేవారు సూర్యకాంతం.

ఓ సారి ఆవిడ తెల్లారు ఝాము మూడున్నరకు రైలు దిగి ముసుగు కప్పుకుని ఓ రిక్షా మాట్లాడుకుని ఇంటి ముందు దిగి లోపలకి పోతున్నారు. తన బంధువులు పై పోర్షనులో ఉన్నారు. క్రింద పోర్షనులో వేరే ఇంకెవరో అద్దెకున్నారు.వారింట్లోంచీ మాటలు వినిపిస్తున్నాయి …నువ్వు సూర్యకాంతంలా సతాయించకే ఐదింటి రైలుకు ఊరెళ్లాలి వంట తొందరగా తెముల్చు అంటున్నారట ఆ పోర్షనులో ఉన్న భర్తగారు.

పర్వాలేదు జనం తనను సర్వనామంగా మార్చేశారు అని ఆనందించారట ఆవిడ. కడవంత కందగడ్డైనా కత్తిపీటకు లోకువే అనే సామెత మనకు దసరాబుల్లోడు లాంటి సినిమాలు చూస్తే నిజమే అనిపిస్తాయి.
ఎందుకంటే..ఎస్వీ రంగారావు లాంటి పెర్సనాల్టీని మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది సూర్యకాంతం.

దసరా మామూలిచ్చారా లేదా అని భర్తని నిలదీసే సీన్ లో సూర్యకాంతం…ఎస్వీఆర్ ఇద్దరికిద్దరూ అదరగొట్టేస్తారు. సూర్యకాంతంలో గయ్యాళి తనమే కాదు. భోళాతనం కూడా అద్భుతంగా పలుకుతుంది.
ఈ విషయం బాపు రమణలకు చాలా బాగా తెల్సు. అందుకేనేమో వాళ్లంటే సూర్యకాంతమ్మకు చాలా చాలా ఇష్టం. బుద్దిమంతుడు సినిమాలో సూర్యకాంతంలోని మరో కోణాన్ని జనం ముందు ఆవిష్కరించారు బాపు రమణలు.

అంతటి సూర్యకాంతమ్మను మోసం చేసే పాత్రలో నాగభూషణాన్ని ప్రవేశపెట్టి సూర్యకాంతం మీద జాలి పుట్టిస్తారు. దాదాపు అదే పద్దతి పాత్ర ముత్యాలముగ్గులోనూ చేయించారు… భర్త రావుగోపాల్రావు దుర్మార్గం తెలియక … పతిదేవుడని కొలుస్తూ ఉంటుందా పాత్ర. తెల్సాక మాత్రం తల్లడిల్లిపోతుంది.

ఆ ప్రకృతిని సూర్యకాంతం ప్రదర్శించిన తీరు ఆడియన్స్ తో కన్నీళ్లు పెట్టిస్తుంది. .. సూర్యకాంతం మీద విజయా చక్రపాణికి చాలా గురి. గుండమ్మకథ ఒరిజనల్ లో గుండమ్మకు భర్త పాత్ర ఉంటుంది. కానీ రీమేక్ లో ఆ పాత్రను పీకేశారు. అదేంటండీ అంటే సూర్యకాంతానికి మొగుడేవిటసలు అని చక్కన్న ఎదురు ప్రశ్నించే సరికి ఆ పాత్ర ఎగిరిపోయింది.

ఎన్.టి.ఆర్, ఎఎన్నార్ కలసి చేసిన మల్టీ స్టారర్ మూవీకి సూర్యకాంతం పాత్ర పేరు టైటిల్ గా డిసైడ్ చేయడం చూస్తేనే తెలుస్తుంది సూర్యకాంతానికి విజయాలో ఉన్న మర్యాదేమిటో..గుండమ్మకథలో తన పెంపకం నిర్వాకం వల్లే కూతురు జీవితం అలా అయిపోయిందని అర్ధమయ్యాక విలవిల్లాడిపోతుంది. ప్రేక్షకులకు అయ్యో పాపం ఇలాంటి వాళ్లు మా బంధువుల్లోనూ ఉన్నారయ్యా అని అనుకునేలా చేస్తుంది.

అందుకే సూర్యకాంతం చేసిన పాత్రలు గయ్యాళి పాత్రలే అయినా అవి ఆడియన్స్ కు అంతగా నచ్చేశాయి. గుర్తుండిపోయాయి… జ్ఞాపకాల్లో పదిలంగా ఉండిపోయాయి. కోడళ్లను ఆరళ్లు పెట్టే అత్తపాత్రకు కూడా సూర్యకాంతం పేటెంట్ హోల్డరే… సరిగ్గా ఈ విషయంలోనే సూర్యకాంతంపేరు సర్వనామమైపోయింది.

గోరంత దీపం లో హమ్మ కోడళ్లో హమ్మ కోడళ్లో అంటూ పొరుగింటి రాధాకుమారికి తన కోడలి మీద కంప్లైంట్లు చెప్పే సీన్ లో సూర్యకాంతం నటన మతులు పోగొట్టేస్తుంది. సూర్యకాంతం గురించి ముళ్లపూడి నేతృత్వంలో ఆరుద్ర ఓ పోయం రాస్తూ… చూపు చుర్రున చేయి చల్లన…మాట ఫెళ్లున…మనసు ఝల్లన అంటాడు.

సూర్యకాంతం సెట్ లోకి వచ్చేప్పుడు ఇంటి నుంచి బోల్డు చిరుతిళ్లు తెచ్చి యూనిట్ లో అందరికీ పెట్టి తను తింటూ కాలక్షేపం చేసేవారట. అందుకే అందాలరాముడులో ఓడలో హోటల్ పెట్టి ఉన్నోళ్ల దగ్గర వసూలు చేస్తూ…లేనోళ్లకు ఉచితంగా పెడుతూ భలే కారక్టర్ చేశారు సూర్యకాంతం. ఓడ సరంగు తన భర్తే.

అయితే అతని తాగుడు కంట్రోల్ చేయాలని కాస్త కట్టడిలో పెడుతుందిగానీ భర్తంటే జాలే. … పిచ్చ సచ్చినోడు అని ముద్దుగా పిల్చుకుంటూ ఓ రెండు రూపాయలు ఇస్తుంది … అదేంటంటే … నేనివ్వకపోతే ఇంకెక్కడో అడిగి ఎక్కువ తాగేస్తాడు బాబూ అంటుంది. సూర్యకాంతం మొగుడి వేషం వేయడం అంటే మామూలు విషయం కాదు.

అక్కా చెల్లెలు సినిమాలో ఓ సీన్ లో రాజబాబు కాసేపు సూర్యకాంతం భర్తగా నటించి కాలరెత్తుకు తిరగడం మొదలెట్టాడట.
అదేంటంటే…
సూర్యకాంతం మొగుడుగా చేసా..నాకేంటనేవాడట…. మరి సూర్యకాంతం ముందు నిలబడి నటించడం అంత తేలిక కాదు కదా.

ఆవిడ లేని సినిమా ఉప్పు లేని చారుతో సమానం. సూర్యకాంతం వచ్చి సీన్ లో నిలుచుంటే..పరుగులే పరుగులు…ఇదీ సూర్యకాంతం గురించి ఆవిడ అభిమానులు చెప్పుకునే మాట.లవకుశ సినిమాలో సూర్యకాంతం పతిభక్తి ప్రదర్శించే సన్నివేశం చూస్తే అర్ధమైపోతుంది. పైగా సతీ అనసూయ తన బంధువే అంటుంది కూడా.

వేలు విడిచిన మేనత్తో ఎవరో అన్నట్టు చెప్పే పద్దతి ఇంకొకరి వల్ల అవుతుందా … సూర్యకాంతం మాత్రమే పలికించే హావభావాలు అవి. 1946లో నారద నారదితో మొదలైన సూర్యకాంతం నట ప్రయాణం…జె.డి.చక్రవర్తి నటించిన ఒన్ బై టు..రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేసిన గోవిందా గోవిందా వరకు అప్రతిహతంగా కొనసాగింది.

సూర్యకాంతం వెళ్లిపోయినా … ఆవిడ తెలుగు వారి స్థిరాస్తి. … మల్లాది అన్నట్టు … తెలుగుతనంతో మెరిసిన తెలుగుధనం. రిప్లేస్మెంట్ లేని నటి సూర్యకాంతంకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఏం చేయగలం?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!