మానస సరోవరం నీటిని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారని , ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని హిందువులు నమ్ముతారు. అలాగే మానస సరోవర పరిక్రమ లేదా ప్రదక్షిణ చేసినా ముక్తి తధ్యమని భావిస్తుంటారు.కానీ ఆ ప్రదక్షిణ కష్టమైనది.
మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర తీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు ‘ఓం’ ఆకారంలో ఉంటాయని కూడా చెబుతుంటారు.
ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు ఉంటుంది. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది. కొంతమంది భక్తులు ఈ సరోవరంలో స్నానమాచరించి కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. దీన్నే కైలాష్ పరిక్రమ అంటారు.
మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమ చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. నడక అలవాటు లేని భక్తులకు కైలాష్ పరిక్రమ ఇబ్బందికరంగా ఉంటుంది. గుర్రాలపై కూర్చుని కొంతదూరం వెళ్ళవచ్చు. మరికొంత దూరం తప్పనిసరిగా నడవాలి.
ఈ ప్రాంతంలో పరిక్రమ వాతావరణ పరిస్థితిపై ఆధారపడి వుంటుంది. వాతావరణం అనుకూలంగా లేక చల్లగా మారితే … మంచు పడుతుంటే కైలాష్ పరిక్రమ కష్టతరం అవుతుంది. కైలాష్ పరిక్రమ 4,600 మీటర్ల ఎత్తు నుండి మొదలవుతుంది. మధ్యలో ఎత్తైన పర్వతాలు ..పల్లపు ప్రాంతాలు ఉంటాయి. వాటి గుండా ప్రయాణించాలి. మూడు రోజులపాటు సాగే యాత్రలో మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి … ఆహరం తినడానికి , రాత్రిళ్ళు విశ్రమించడానికి కొన్ని చోట్ల గుడారాలు ఏర్పాటు చేశారు. అక్కడే ఉండాలి.
మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను, ఎత్తైన పర్వతాలను దాటాల్సి ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడటంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు. అయితే మెడికల్ గా ఫిట్ అయినా వాళ్ళు వెళితేనే మంచిది. అక్కడి వాతావరణం అందరికి పడదు. విమానాల ద్వారా కూడా పరిక్రమ చేయవచ్చు. అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. టిక్కెట్ బుక్ చేసుకుంటే అన్ని ట్రావెల్ ఏజెన్సీ వారే చూసుకుంటారు.
—————— Theja
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>> పంచమర్హి శివుడిని చూడాలంటే … ప్రాణాలకు తెగించాలి!