Polygamy …………………………..
ఒక పెళ్ళాంతోనే వేగడం చాలా కష్టం. మరి 38 మంది భార్యలతో అతగాడు ఎలా కాపురం చేసాడో ?ఎలా మేనేజ్ చేసాడో ? బహు భార్యలున్నవారిని జస్ట్ తలుచుకుంటే చాలు .. ఎన్నో కథలు .. సినిమాలు కళ్ళముందు మెదులుతాయి.
అసలు 38 మందిని అతగాడు ఎలా చేసుకున్నాడు ? వాళ్లంతా ఎలా ఒప్పుకున్నారు ? అందరిని ఒకే చోట ఉంచి, వారిలో వారికి గొడవలు లేకుండా ఎలా చూసాడో ? నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఒక వెబ్ సీరీస్ తీయొచ్చు.
ఇక అసలు కథలోకి వస్తే …….. జియోనా అనే వ్యక్తి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకున్నాడు. రికార్డులు బద్దలు కొట్టాడు. మిజోరాం కి చెందిన జియోనా 38 మంది భార్యలు ,89 మంది పిల్లలు, 14 మంది కోడళ్ళు, 33 మంది మనవళ్లు, మనవరాళ్ల తో జీవితాన్ని ఎంజాయ్ చేసాడు.
జియోనా నివాసం మిజోరాం లోని Baktawng Tlangnuam గ్రామం. ఆ గ్రామానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడానికి జియోనా కుటుంబం కూడా ఒక కారణం అంటారు. జియోనా తన మొదటి భార్యను 1959 లో 15 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతనికంటే మూడేళ్ళ పెద్దది. ఇక 2004లో 38 వ భార్యను 60ఏళ్ళ వయసులో వివాహం చేసుకున్నాడు.
90 దశకంలో ఒకే ఏడాది 10 మందిని చేసుకున్నాడని గ్రామస్తులు అంటున్నారు. ఒకే కాంప్లెక్స్ లో వీరందరితో జియోనా కలసి ఉండటం విశేషం. అందరితో కలసి ఉండేందుకు నాలుగు అంతస్తుల ఇంటిని సొంతంగా నిర్మించుకున్నాడు. ఆ ఇంటిని చువాన్ థార్ రన్ లేదా న్యూ జనరేషన్ హోమ్ అని పిలుస్తుంటారు.
అక్కడే చిన్న గెస్ట్ హౌస్ కూడా కట్టాడు.బంధువులు,సందర్శకులు వచ్చినప్పుడు అక్కడ ఉంటారు. తన కుటుంబం కోసం పెద్ద ఆట స్థలం .. పాఠశాల ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మిజోరాంలో ని ఐజ్వాల్ దగ్గరలో ఉన్న పర్వత ప్రాంతాల్లో జియోనా సొంత భవనం ఉంది. ఇక్కడి కొచ్చే టూరిస్టులు జియోనా కుటుంబం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవారు.
ఆ నాలుగంతస్తుల భవనంలో 100 గదులు ఉన్నాయి. వాటిల్లోనే ఆయన కొడుకులు … వారి భార్యలు.. పిల్లలు ఉండేవారు.పెద్ద కామన్ కిచెన్ ను అందరూ షేర్ చేసుకుంటారు. జియోనా బెడ్ రూమ్ కి దగ్గర్లో ఒక డార్మిటరీ కట్టారు. అందులో జియోనా భార్యలు ఉండేవారు.
జియోనా చానా 1945 లో క్రైసవ కుటుంబంలో జన్మించారు. ఆ గ్రామంలో మత పెద్దగా వ్యవహరించే వారు. ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.కుటుంబ సభ్యులంతా క్రమశిక్షణతో వ్యవహరిస్తారట. పెద్ద భార్య కుటుంబ వ్యవహారాలను పర్యవేక్షించడంతో పాటు వంట వార్పు పనులను దగ్గరుండి చేయించే వారు. వారి ఒక పూట భోజనానికి 100 కేజీల బియ్యం, 60 కేజీల బంగాళాదుంపలు, 30 కోళ్లు అవసరమయ్యేవి.
జియోనా తమ పిల్లలకు కూడా పెళ్లి విషయంలో స్వేచ్ఛ నిచ్చారట. ఎవరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా అభ్యంతర పెట్టేవాడు కాదు. ఇక తన భార్యలతో రొటేషన్ పద్దతిలో కాపురం చేసేవాడట. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కుటుంబ పెద్ద గా గుర్తింపు పొందిన జియోనా 76 ఏళ్ళ వయసులో 2021 జూన్ 13 న కన్నుమూసారు.