ఎందరికో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………….  The director who brought star image to many 

లా చదివి సినిమాల్లో ప్రవేశించి సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డైరక్టర్ గా కంటిన్యూ అయిన క్రాంతికుమార్ సినిమాల్లో కోర్డు సీన్లు చాలానే కనిపిస్తాయి. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. సినిమాల మీద ఇంట్రస్ట్ తో నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనుకున్నారు.

కొందరు మిత్రులతో కల్సి రామకృష్ణా పిలింస్ బ్యానర్ మీద గుత్తా రామినీడు దర్శకత్వంలో తల్లీకూతుళ్లు నిర్మించారు. శోభన్ బాబు హీరోగా చేసిన ఆ సినిమా పెద్దగా సక్సస్ కాలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డారు క్రాంతికుమార్. ఆ తర్వాత హనుమాన్ ప్రసాద్ తో కల్సి శారద తీశారు. ఇక వెనక్కి తిరిగి చూడలేదు.

గీతాసింగ్ అనే మరాఠా డైరక్టరు కన్నడంలో యావద జన్మ మైత్రి సినిమా తీశారు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే…విని రైట్స్ తీసుకుని హనుమాన్ ప్రసాద్ తో ట్రీట్ మెంట్ రాయించారు. హీరో శోభన్ ను కల్సి కథ చెప్పారు. ఆయన సజషన్ మేరకు కె. విశ్వనాథ్ ను డైరక్టర్ గా తీసుకుని ఆయన చేతుల్లో స్క్రిప్ట్ పెట్టారు.

శారద హిట్ కొట్టడమే కాదు విలన్ సత్యనారాయణకు కారక్టర్ ఆర్టిస్ట్ గా టర్నింగ్ ఇచ్చింది. చక్రవర్తిని బిగ్ మ్యూజిక్ డైరక్టర్ ను చేసింది.శారద క్లైమాక్స్ సుఖాంతం చేయాలని సీనియర్ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు సలహా చెప్పారు. అంటే వితంతువుగా కూడా ఊరు శారదను నెత్తిన పెట్టుకుంటుంది. అలా శోభన్ సమాధి దగ్గరే బతుకీడుస్తూ…వృద్దాప్యంలో కన్నుమూస్తుందనేది ప్రకాశరావుగారు చెప్పిన క్లైమాక్స్. అయితే హనుమాన్ ప్రసాద్ కాదనడంతో ఊరు చేరుతూనే పడవలోనే శారద కన్నుమూస్తుంది. ఆడియన్స్ కు ఈ క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయింది.

క్రాంతికుమార్ కొత్త తరహా కథాంశాలను ఎన్నుకోవడంలో చాలా ముందుంటారు. కథలో ఓ కొత్త కాన్ ప్లిక్ట్ కోరుకుంటారాయన. ఇదే ఆయన చిత్రాలకు ప్రత్యేకత సాధించిపెట్టింది. క్రాంతికుమార్ చిత్రాలతోనే రాఘవేంద్రరావు డైరక్టర్ గా సక్సస్ ట్రాక్ ఎక్కారు. కోదండరామిరెడ్డిని మాస్ డైరక్టర్ ను చేసిందీ క్రాంతికుమారే.

అక్కినేనికి సరికొత్త ఇమేజ్ తెచ్చిందీ క్రాంతికుమారే.శారద సక్సస్ అయ్యాక వెంటనే శారదతోనే కొత్త సినిమా అనౌన్స్ చేశారు క్రాంతికుమార్. కథ కురూపితనం నేపద్యంలో సాగుతుంది. చక్రవర్తే మ్యూజిక్ చేసిన ఈ సినిమాలో ప్రతి అందం జంట కోసం కలవరించి పోతుంది…పాట సూపర్ డూపర్ హిట్ కొట్టింది.

నిజానికి ఊర్వశి చిత్రానికి రాఘవేంద్రరావును దర్శకుడుగా పెట్టుకోవాలనుకున్నారు. చివరి నిమిషంలో బాపయ్యకు బాద్యతలు అప్పగించారు. ఊర్వశి ఫ్లాప్ కావడంతో నెక్ట్స్ మూవీ జ్యోతిని డైరక్ట్ చేసే బాధ్యత రాఘవేంద్రరావుకే అప్పగించారు. రాఘవేంద్రరావు తొలిచిత్రం బాబు కూడా ఓ మోస్తరుగానే ఆడింది. దీంతో కసిగా జ్యోతి సినిమా తీశారాయన.

అనుకోని పరిస్ధితుల్లో ఓ పదహారేళ్ల అమ్మాయి ఆరు పదులు దాటేసిన ముసలాణ్ణి పెళ్లి చేసుకుంటుంది…ఈ సంఘర్షణను అందంగా, అర్ధవంతంగానూ తెరకెక్కించి సక్సస్ కొట్టారు క్రాంతికుమార్, రాఘవేంద్రరావులు.మురళీమోహన్, జయసుధలను హీరోహీరోయిన్స్ గా ఎంపిక చేసుకున్నారు. జ్యోతి సినిమా దర్శకుడుగా రాఘవేంద్రరావు కెపాసిటీ మీద ఆడియన్స్ లో నమ్మకాన్ని నింపింది. అలాగే నిర్మాతగా క్రాంతికుమార్ కు తన మీద తనకు నమ్మకాన్నిచ్చింది.

రాఘవేంద్రరావు కాంబినేషన్ లోనే తెరకెక్కిన మరోచిత్రం ఆమెకథ. స్క్రిజోఫెర్నియాతో బాధపడుతున్న ఓ అమ్మాయి …కొత్తగా పెళ్లైన ఓ జంట జీవితంలో ఎలాంటి కల్లోలం సృష్టించిందనే కాన్సెప్ట్ తో సాగుతుంది ఆమెకథ చిత్రం. మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందీ సినిమా. జయసుధకు ఆ తర్వాత వచ్చిన సహజనటి బిరుదు వెనుక ఈ సినిమా కూడా ఉంది.

క్రాంతికుమార్ నిర్మాణంలో రాఘవేంద్రరావు తీసిన జ్యోతి, ఆమెకథ, కల్పన చిత్రాలన్నీ లోబడ్జట్ చిత్రాలే. కథను నమ్ముకుని తీసినవే. వాస్తవిక ధోరణితో సాగేవే. తమిళ్ లో సక్సస్ ఫుల్ ట్రెండ్ గా కంటిన్యూ అవుతున్న బాలచందర్ మార్క్ చిత్రాల తరహాలోనే ఈ సినిమాలు కూడా పెద్ద సినిమాలతో పోటీ పడి విజయాలు సాధించాయి. కల్పన తర్వాత రాఘవేంద్రరావు పూర్తి స్థాయిలో బిగ్ సినిమాలకే పరిమితం అయ్యారు.

మంచి సినిమా చెడ్డ సినిమా అనే తేడాలుంటాయిగానీ…స్టార్ సినిమా నాన్ స్టార్ సినిమా అనే తేడాలుండవని తరచు చెప్పేవారు క్రాంతికుమార్. బిగ్ స్టార్స్ తో కూడా సెన్స్ బుల్ మూవీస్ చేయవచ్చని ఆయన బలంగా నమ్మేవారు. నమ్మడమే కాదు…ఆచరణలో చేసి చూపించారు కూడా. కథను నమ్ముకుని సినిమా తీస్తే జనం తప్పకుండా చూస్తారని క్రాంతికుమార్ నమ్మిన సూత్రమే ఆయన్ను సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ ని చేసింది.

కల్పన తర్వాత రాఘవేంద్రరావు బిగ్ అండ్ బిజీ డైరక్టర్ అయిపోవడంతో ఆల్డర్ నేటివ్స్ కోసం వెతకడం మొదలెట్టారు క్రాంతికుమార్. అప్పుడు రవీంద్రభారతిలో అనుకోకుండా సి.ఎస్.రావు రచన ప్రాణం ఖరీదు నాటకం చూశారు. విపరీతంగా నచ్చేసింది. ప్రత్యగాత్మ కొడుకు వాసుకు దాని దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. మెగాస్టార్ చిరంజీవి నటించగా విడుదలైన మొదటి చిత్రంగానే కాదు..ఓ మంచి చిత్రంగా కూడా ప్రాణం ఖరీదు మంచి మార్కులే సాధించింది.

సత్యనారాయణతో ప్రాణం ఖరీదులో ఓ అద్భుతమైన పాత్ర చేయించారు క్రాంతికుమార్. ఆ పాత్రకు జాలాదితో అనితరసాధ్యం అనిపించే స్టైల్ లో ఓ పాట రాయించారు. యాతమేసి తోడినా…ఏరు ఎండదు…పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాట.

తర్వాత ఓ హిందీ సినిమా ఆధారంగా రాఘవేంద్రరావు డైరక్షన్ లో కమర్షియల్ మూవీ తీశారు. మోసగాడు టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటిసారిగా శ్రీదేవితో కల్సి డాన్స్ చేస్తారు చిరంజీవి. చిరంజీవిని మెయిన్ విలన్ గా చేసిన ఏకైక సినిమాగా కూడా ఇదే. అంతే కాదు శ్రీదేవి నెగెటివ్ షేడ్ ఉన్న కారక్టర్ చేయడం కూడా ఇదే.

స్టార్స్ తో అయినా సెన్సు బుల్ మూవీస్ చేయచ్చని ప్రూవ్ చేసిన వాడు క్రాంతికుమార్. ఎన్.టి.రామారావు అనగానే…అడవిరాముడు, వేటగాడు లాంటి కథలే కావాలనుకోనవసరం లేదని ప్రూవ్ చేసిన సినిమా సర్దార్ పాపారాయుడు. దాసరి చెప్పిన స్టోరీ లైన్ కు వెంటనే ఓకే చెప్పిన క్రాంతికుమార్ భారీ ఎత్తున తెరకెక్కించిన సర్దార్ పాపారాయుడు ఎన్.టి.ఆర్ కెరీర్ లోనే ఓ స్పెషల్ మూవీగా నిల్చిపోయింది.

అనంతరం డి.కామేశ్వరి కథ తో ‘న్యాయం కావాలి’ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో తెరకెక్కించారు. ప్రియుడి చేతిలో మోసపోయిన స్త్రీ ఆత్మహత్యకు పాల్పడకుండా ధైర్యంగా కోర్టు బోనులో నిలబడి అతని మోసాన్ని బయటపెట్టటం ప్రేక్షకుల జేజేలు అందుకుని కొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది.

తర్వాత చిరంజీవి, మోహన్ బాబులతో కోదండరామిరెడ్డి డైరక్షన్ లోనే కిరాయి రౌడీలు పేరుతో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కించారు క్రాంతికుమార్. చిరంజీవికి మాస్ లో క్రేజీ ఇమేజ్ తెచ్చిన చిత్రాల్లో కిరాయి రౌడీలు ఒకటి. సంధ్య, న్యాయంకావాలి చిత్రాలతో మహిళా దర్శకుడు ఇమేజ్ తెచ్చుకున్న కోదండరామిరెడ్డిని మాస్ డైరక్టర్ గా ప్రూవ్ చేసిన సినిమా కిరాయి రౌడీలు.

విజయభాస్కర్ తో చేసిన ప్రయోగం ఇది పెళ్లంటారా? ప్రేక్షకాదరణ పొందకపోవడంతో….మళ్లీ కోదండరామిరెడ్డితో శివుడు శివుడు శివుడు తీశారు. అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతున్న మార్షల్ ఆర్ట్స్ మూవీస్ కి తెలుగు కమర్షియల్ అనుసరణే ఈ చిత్రం. సినిమా అద్భుతంగా తెరకెక్కించినా…ఆడియన్స్ ప్రాపర్ గా రిసీవ్ చేసుకోలేదు. దీంతో ఓపెనింగ్స్ కే పరిమితం అయిపోయింది.

అప్పటి వరకు నిర్మాణానికే పరిమితం అయిన క్రాంతికుమార్ మెగాఫోన్ పట్టాలని నిర్ణయించుకున్నారు. పాపారాయుడు కథలో శారద, యంగ్ ఎన్.టి.ఆర్ పాత్రలనే తీసుకుని ఎన్.టి.ఆర్ కారక్టర్ ను స్త్రీగా మార్చి చేసిన ప్రయోగం స్వాతి. భర్త ఎవరో చెప్పలేని తల్లి. తండ్రి ఎవరో తెలియని కూతురు సాగించే జీవన ప్రయాణం స్వాతి. సినిమా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది.

సుహాసినికి స్ఠార్ ఇమేజ్ తీసుకువచ్చింది.క్రాంతికుమార్ తరచు ఓ మాట చెప్పేవారు. మృణాల్ సేన్ తరహా చిత్రాలు తీయడం పెద్ద కష్టం కాదుగానీ…మన్మోహన్ దేశాయ్ తీసే కమర్షియల్ ఎంటర్ టైనర్లు తీయడం చాలా కష్టం అనేవారు. ఆయన జీవితంలో అదే జరిగింది. సెన్సుబుల్ సినిమాలు అద్భుతంగా తెరకెక్కించిన క్రాంతికుమార్ భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్లు తీయాలనుకున్న ప్రతిసారీ భంగపడుతూనే వచ్చారు.

స్వాతి సంచలన విజయం సాధించిన తర్వాత క్రాంతి చిత్ర బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం అగ్నిగుండం. తన బ్యానర్ హీరో చిరంజీవితో దర్శకుడుగా క్రాంతికుమార్ తీసిన అగ్నిగుండం బాక్సాఫీసు దగ్గర ఢమాల్ అనేసింది. నాగార్జునతో నేటి సిద్దార్ద టైటిల్ తో చేసిన ప్రయత్నం కూడా కలసి రాలేదు. ఇలా లాభం లేదనుకుని…తను కేవలం తెరవెనక్కే పరిమితమై కోడి రామకృష్ణతో తీయించిన రిక్షావోడు కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ చేసింది.అగ్నిగుండం డిజాస్టర్ తర్వాత తనదైన స్టైల్ లో శారద ప్రధాన పాత్రలో శారదాంబ అనే మరో మహిళా చిత్రం తెరకెక్కించారు క్రాంతికుమార్.

క్రాంతికుమార్ బయట నిర్మాతలకు కూడా కొన్ని అద్భుతమైన చిత్రాలు తీసిపెట్టారు. వాటిలో అక్కినేనితో చేసిన సీతారామయ్యగారి మనవరాలు ఒకటి. వి.ఎమ్.సి దొరస్వామి రాజు నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం ఓ కొత్త నాగేశ్వర్రావును ప్రేక్షకులకు పరిచయం చేసింది. విగ్గులేకుండా మీసం పెంచి…అక్కినేని చాలా కొత్తగా అందంగా హుందాగా ఉంటారు.

రాజశేఖర్ హీరోగా సి.హెచ్.వి. అప్పారావు కోసం తీసిన అక్కమొగుడు చిత్రం కూడా మంచి విజయం సాధించింది. యాక్షన్ హీరోగా ఎదుగుతున్న రాజశేఖర్ తో సెంటిమెంటల్ చిత్రం తీసి సక్సస్ కొట్టడం మామూలు విషయం కాదు. ఆ ఫీట్ క్రాంతికుమార్ చాలా అద్భుతంగా చేసేశారు.

అక్కమొగుడు తర్వాత క్రాంతికుమార్ చేసిన ఏ ప్రయత్నమూ కల్సిరాలేదు. ఓ తమిళ దర్శకుడితో చేసిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమా ఆడలేదు. సౌందర్యతో తీసిన ప్రయోగాత్మక చిత్రం తొమ్మిది నెలలు చిత్రానికి రావల్సిన ప్రేక్షకుల గుర్తింపు దక్కలేదు.

అవార్టులకే పరిమితం అయిపోవడం వల్ల క్రాంతికుమార్ దర్శకుడుగా సంతోషపడ్డా…నిర్మాతగా మాత్రం డీలా పడ్డారు.తెలుగులోనే కాకుండా హిందీలో రెండు, కన్నడంలో మూడు, ఒరియాలో మూడు చిత్రాలకు నిర్మాతగా, దర్శకునిగా ఉన్న క్రాంతికుమార్ 2003 మే 9న కన్నుమూశారు. 

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!