Attraction of Bhouddham ………...
పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు అజన్ సిరిపాన్యో (Ajahn Siripanyo). ఆయన దాదాపు రూ. 40,000 కోట్ల ($5 బిలియన్లు) ఆస్తిని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి బౌద్ధ సన్యాసిగా మారారు. ఆధునిక కాలంలో సిద్ధార్థుడిలా (గౌతమ బుద్ధునిలా) సర్వసంగ పరిత్యాగం చేసిన వ్యక్తిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అజన్ సిరిపాన్యో ఎవరు?
ఈయన మలేషియాలో 3వ అత్యంత ధనవంతుడు, ప్రముఖ వ్యాపారవేత్త (ఒకప్పుడు భారతదేశంలో ‘ఎయిర్‌సెల్’ టెలికాం సంస్థ యజమాని) అయిన ఆనంద కృష్ణన్ ఏకైక కుమారుడు.ఆయన లండన్‌లో జన్మించారు, బ్రిటన్‌లోనే ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఆయనకు ఇంగ్లీష్‌తో పాటు దాదాపు 8 భాషలు మాట్లాడటం వచ్చు.ఈయన తల్లి ‘సుప్రిందా చక్రబాన్’ థాయిలాండ్ రాజకుటుంబానికి చెందిన మహిళ.
ఆయన సన్యాసం తీసుకోవడం వెనుక ఎటువంటి పెద్ద విషాదం లేదా వైరాగ్యం లేదు, అది చాలా విచిత్రంగా ఒక చిన్న సంఘటనతో ప్రారంభమైంది.
అజన్ సిరిపాన్యోకు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, థాయిలాండ్‌లోని తన తల్లిగారి కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లారు.అక్కడ కేవలం సరదా కోసం, జిజ్ఞాస తో ఒక బౌద్ధ ధ్యాన కేంద్రంలో కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా సన్యాసిగా మారారు.
ఆ కొద్ది రోజుల ధ్యానంలో ఆయనకు లభించిన మానసిక ప్రశాంతత, అపారమైన శాంతి, క్రమశిక్షణ ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. కోట్ల ఆస్తి ఇచ్చే సుఖం కంటే, ఈ సరళమైన జీవితంలోనే నిజమైన ఆనందం ఉందని గ్రహించి, ఆ తాత్కాలిక అనుభవాన్ని తన జీవిత కాల నిర్ణయంగా మార్చుకుని శాశ్వతంగా సన్యాసం తీసుకున్నారు.
అజన్ సిరిపాన్యో గత 20 సంవత్సరాలకు పైగా థాయ్ అటవీ సంప్రదాయాన్ని పాటిస్తూ అడవుల్లోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన థాయిలాండ్-మయన్మార్ (బర్మా) సరిహద్దుల్లోని సాయి యోక్ నేషనల్ పార్క్ లో, దట్టమైన అడవుల మధ్య ఉన్న ‘ద్తావ్ దమ్’ (Dtao Dum Monastery) ఆశ్రమానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆధునిక వసతులు, కరెంట్, ఫోన్లు ఏవీ లేని ఆ అరణ్యంలో వన్యప్రాణుల మధ్య ఉంటూ ఆయన ధ్యాన సాధన చేస్తున్నారు. ‘థాయ్ అటవీ సంప్రదాయం’ ప్రకారం బౌద్ధ సన్యాసుల భోజన నియమాలు అత్యంత కఠినంగా, క్రమశిక్షణతో కూడి ఉంటాయి.
వీరు ప్రకృతికి దగ్గరగా చాలా సాధారణ ఆహారాన్ని తీసుకుంటారు. రోజు మొత్తంలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారు.సాధారణంగా ఉదయం పూట లేదా మధ్యాహ్నం 12:00 ಗಂಟಲ లోపు మాత్రమే వీరు భోజనం ముగించాలి. మధ్యాహ్నం దాటిన తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు ఎలాంటి ఘన ఆహారాన్ని ముట్టరు. కేవలం నీరు లేదా కొన్ని రకాల ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటారు.
మనలాగా ప్లేట్లు, రకరకాల గిన్నెలను ఉపయోగించరు. కేవలం తమ వద్ద ఉండే ఒకే ఒక భిక్షాపాత్ర లోనే అన్నం, కూరలు,పండ్లు, స్వీట్లు అన్నీ ఒకదానిపై ఒకటి వేసుకుని తింటారు. కేవలం శరీరాన్ని బ్రతికించడానికి మాత్రమే అన్నట్లుగా తింటారు.
సాధారణంగా ఈ సంప్రదాయంలో సన్యాసులు ఉదయాన్నే గ్రామాల్లోకి వెళ్లి ప్రజలు భిక్షగా ఇచ్చే ఆహారాన్ని సేకరిస్తారు.అయితే, ఆశ్రమం దట్టమైన అడవిలో, గ్రామాలకు చాలా దూరంలో ఉండటం వల్ల… దాతలు, భక్తులు క్రమం తప్పకుండా ఆశ్రమానికి తెచ్చే రేషన్, కూరగాయలను స్థానిక కార్మికులు వండి సన్యాసులకు సమర్పిస్తారు.బయట ఊర్లకు వెళ్ళినపుడు మాత్రం భిక్షాటన చేస్తుంటారు.


