దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన కొద్దిరోజుల్లో కొంత మేరకు పతనాన్ని చూశాయి. ఈ పరిణామంతో చిన్నఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు లభించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు దిద్దుబాటుకు లోనయ్యాయి. ఈ సమయంలో స్థిరత్వాన్నిచ్చే లార్జ్‌క్యాప్, మంచి రాబడులను ఇచ్చే మిడ్‌క్యాప్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు.
అది కూడా నేరుగా మార్కెట్ లో షేర్లు కొనకుండా మ్యూచువల్ ఫండ్ పథకాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీర్ఘకాలంగా మంచి పనితీరు చూపిస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఒకటి. సగటు కి మించి రాబడులను ఈ పథకం ఇస్తోంది. అస్థిరతల మార్కెట్లలో రిస్క్ తక్కువగా ఉండాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ పథకం పూర్తిగా అనుకూలం. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు.
స్టాక్ మార్కెట్లో నేరుగా మదుపు చేయలేని ఇన్వెస్టర్లకు, చిన్న ఇన్వెస్టర్లకు ” సిప్ “చాలా అనుకూలమైనది . సిప్ అంటే మదుపు చేసే ఒక పద్ధతి. సిష్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోసీజర్ దీన్నే తెలుగులో క్రమానుగత పెట్టుబడి విధానం అంటారు. దీర్ఘ కాలిక వ్యూహం తో మదుపు చేసే ఇన్వెస్టర్ లకు ఈ సిప్ చాలా అనువైనది. ఇపుడు చాలామంది ఇన్వెస్టర్లు సిప్ ద్వారానే ఈక్విటీ పధకాల్లో మదుపు చేస్తున్నారు.
రికరింగ్ డిపాజిట్ తరహాలోనే నెలకు నిర్ణీత మొత్తాన్ని ఫండ్స్ లో మదుపు చేస్తున్నారు. బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో మదుపు చేస్తే రికరింగ్ అంటాం. అదే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే సిప్ అంటాం. అంతకు మించి పద్దతిలో తేడా లేదు. మ్యూచువల్ ఫండ్స్ సమీకరించిన మొత్తాలను షేర్ల లో మదుపు చేస్తాయి కాబట్టి కొంత మేరకు నష్ట భయం వుంటుంది. అయితే ఫండ్స్ ను మార్కెట్ లో అనుభవం గల నిపుణులు నిర్వహిస్తారు కాబటి నష్టం తక్కువ ఉంటుందనే నమ్మకం తోనే ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
ఇక ఎస్ బీ ఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ పధకం గతంలో ఎస్బీఐ మాగ్నం మల్టీప్లయర్ ఫండ్‌గా ఉండేది. ఈ పధకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసింది. మ్యూచువల్ ఫండ్ పథకాల పునర్వ్యవస్థీకరణ తర్వాత లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకంగా మారింది. 1993 నుంచి ఈ పథకం అమలులో ఉంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13 శాతం రాబడిని ఇచ్చింది.
మూడేళ్లలో చూస్తే వార్షిక రాబడి 17 శాతంగా ఉంది. ఐదేళ్లలో 12 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 16 శాతానికి పైనే వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు అందించింది. ఇందులో మూడేళ్లకు పైన రాబడులున్నవి గతంలో లార్జ్‌క్యాప్ ఆధారంగా వచ్చినవి. ఇప్పుడు లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ప్రాధాన్యంగా ఇన్వెస్ట్ చేస్తుంది కనుక మెరుగైన ప్రతిఫలాన్ని ఈ పథకం నుంచి ఆశించవచ్చు.
ఈ పథకం ద్వారా వచ్చిన సొమ్మును ఫండ్ మేనేజర్లు భిన్నరంగాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. వృద్ధి, వ్యాల్యూ ఇన్వెస్టింగ్ రెండూ ఈ పథకంలో భాగంగా ఉండడం మరో ఆకర్షణీయమైన అంశం. భారీ వృద్ధికి అవకాశాలున్న కంపెనీల్లో మేనేజర్లు ఇన్వెస్ట్ చేస్తారు.
అదే సమయంలో ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్ అవుతున్న, వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెడతారు. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియో పీఈ 44గా ఉండడం అన్నది గ్రోత్ ఆధారిత పోర్ట్‌ఫోలియోను సూచిస్తోంది. గత మూడేళ్లలో మార్కెట్ల నష్టాల సమయాల్లో ఎన్ఏవీ క్షీణతను పరిమితం చేసింది.
ఈ మ్యూచువల్ ఫండ్ పధకం పోర్ట్ ఫోలియో లో సాధారణంగా 55నుంచి 60 స్టాక్స్ వరకు ఉంటాయి. ఒకే రంగానికి చెందిన షేర్లు కాకుండా వైవిధ్యం ఉండేలా చూస్తుంటుంది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకం కనుక ఒక్కో విభాగంలో కనీసం 35 శాతం మేర పెట్టుబడులను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,599 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 94.2 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తం నగదు రూపంలో ఉంది. లార్జ్‌క్యాప్ విభాగంలో పెట్టుబడులు 51 శాతంగా ఉన్నాయి.
మిడ్‌క్యాప్ కంపెనీలకు 35 శాతాన్ని కేటాయించగా.. స్మాల్‌క్యాప్‌లోనూ 14 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్థిరత్వంతోపాటు రాబడులకు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంది. పెట్టుబడుల పరంగా రంగాల వారీ ప్రాధాన్యాన్ని గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 19 శాతం, ఆటోమొబైల్ 10%, హెల్త్‌కేర్ రంగాలకు 9 శాతం చొప్పున కేటాయించింది. ఫండ్ పోర్ట్ ఫోలియో లో ICICI బ్యాంక్ ,పేజ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీ,హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్,స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, ఇండియన్ హోటల్స్ , ఐటీసీ, తదితర షేర్లు ఉన్నాయి.