ఐటెం భామలు vs స్టార్ హీరోయిన్స్ !!

Sharing is Caring...

New wine in Old bottle ……………………………..

తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ / స్పెషల్ సాంగ్స్ కొత్తగా వచ్చినవి కాదు .. ఐటెం సాంగ్స్ లో హీరోయిన్స్ నటించడం కొత్తేమీ కాదు. స్టార్ హీరోయిన్ సమంత ఒక్కరే కొత్తగా ఐటెం సాంగ్ చేయలేదు. అంతకు ముందు కూడా ఎందరో అగ్ర తారలు ఐటెం సాంగ్స్ చేసిన ఉదాహరణలున్నాయి. సమంత ఫస్ట్ టైం ఒక ఐటెం సాంగ్ చేయడం తో అందరూ దాని గురించే చర్చించు కుంటున్నారు. మీడియా కూడా ఈ అంశాన్ని బాగా  హైప్ చేసింది.

హీరోయిన్లు ఐటెం పాపలు గా మారి స్పెషల్ సాంగ్స్ చేయడం చాలా కాలంగా ఉన్న విధానమే. బాలీవుడ్ లో కరీనా కపూర్, కత్రినా కైఫ్ వారి కంటే ముందు ఖల్ నాయక్ లో మాధురీ దీక్షిత్, నీనా గుప్తా తదితరులు అలాంటి ఐటెం సాంగ్స్ చేశారు. ప్రముఖ డాన్సర్ హెలెన్ సంగతి చెప్పనక్కర్లేదు.  హీరోయిన్స్ కూడా కథలో భాగం గా చేసిన ఐటెం సాంగ్స్ ఎన్నో ఉన్నాయి.

తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు  ఐటెం సాంగ్స్ చేసేందుకు ఎల్. విజయ లక్ష్మి, రాజ సులోచన, విజయలలిత, జ్యోతిలక్ష్మి, హలం,జయమాలిని. సిల్క్ స్మిత, జయకుమారి,అనురాధ, డిస్కో శాంతి, అనురాధ కూతురు అభినయ, జయసుధ చెల్లెలు సుభాషిణి , తాతినేని రాజేశ్వరి వంటి డాన్సర్లు ప్రత్యేకంగా ఉండేవారు. వీరంతా తెరపై నర్తిస్తుంటే థియేటర్లు ఈలలు ..కేకలతో మారు మోగి పోయేవి. వాస్తవం చెప్పుకోవాలంటే ఆ తారల ముందు ఇప్పటి హీరోయిన్లు పనికి రారు.

తర్వాత కాలంలో ముమైత్ ఖాన్ కొన్నాళ్ళు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  కాలక్రమంలో నిర్మాతలు దర్శకులు హీరోయిన్ల చేతనే ప్రత్యేక డాన్సులు చేయించడం మొదలు పెట్టారు. సినిమాల్లో నటిస్తూనే శ్రేదేవి, జయప్రద, ఊర్మిళ .. ఇటీవల కాలంలో వచ్చిన  హీరోయిన్స్ ఇలాంటి పాటలు ఎన్నో చేశారు.అంతకు ముందు రాజశ్రీ, కాంచన, జయలలిత, వాణిశ్రీ  వంటి వారు సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తూనే ఇలాంటి స్పెషల్ సాంగ్స్ లో నటించారు.

కాంచన ‘దేముడు చేసిన మనుషులు’ చిత్రంలో ‘మసక మసక చీకటిలో’ అనే పాటలో చేశారు. వాణిశ్రీ ‘ఎదురులేని మనిషి’లో ఒక స్పెషల్ సాంగ్ లో చేశారు.అప్పట్లో ఆమె పై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఆమె సినిమాల్లో మానివేయడానికి కారణాల్లో ఈ అంశం కూడా ఒకటి. ఏడంతస్తుల మేడ సినిమాలో జయప్రద కేవలం ఒక ఐటెం సాంగ్ చేశారు.

గత ఇరవై ఏళ్ల కాలంలో రాశి, రంభ, రమ్యకృష్ణ తదితర నటీమణులు కూడా స్పెషల్ సాంగ్స్ చేశారు.ఇక శ్రియ .. ఛార్మి వంటి తారలు తాము హీరోయిన్లుగా నటించని సినిమాల్లో కొన్ని ఐటెం సాంగ్స్ చేశారు. అప్పటి నుంచి ట్రెండ్ మారింది. సినిమాల్లో హీరోయిన్ గా నటించని బయటి హీరోయిన్స్ తో ఐటెం సాంగ్స్ తీస్తున్నారు.  ఈ క్రమంలోనే  తమన్నా .. కాజల్ అగర్వాల్ .. హన్సిక ,, శృతిహాసన్ .. అనుష్క .. వంటి వారు కూడా  ఐటెం సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

అలాగే  అంజలి, హంసా నందిని, మోత్వాని, సమీరా రెడ్డి, పార్వతి మెల్టన్, యానా గుప్తా, శ్వేతా బసు ప్రసాద్, రచనా మౌర్య, మలైకా అరోరా ఖాన్ వంటి వారు ఐటెం సాంగ్స్ చేశారు. రెండేళ్ల క్రితం పూజా హెగ్డే కూడా రంగస్థలంలో ఒక పాటలో నర్తించారు. వీళ్ళే కాకుండా సెకండ్ హీరోయిన్స్ గా చేసేవాళ్ళు కూడా ఐటెం సాంగ్స్ చేసి ప్రేక్షకులచే మెప్పు పొందారు. సమంత తాజాగా ఈ జాబితాలో చేరారు.

ఈ తరం  హీరోయిన్స్ లో చాలామంది  ఐటెం సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాము కాదంటే ఆ ఛాన్స్ మరొకరికి వెళుతుందనే భయంతో ఒకే అంటున్నారు. హీరోయిన్ గా తెరపై కనబడేది స్వల్ప కాలమే. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. మెజారిటీ ప్రేక్షకులు చూస్తున్నారు. నిర్మాత,దర్శకులు ఐటెం సాంగ్స్ తీస్తున్నారు. డిమాండ్ ను బట్టే ఏదైనా.

ఒకప్పుడైతే అగ్ర తారలు ఇలాంటి డాన్సులు చేయలేదు. కథాపరంగా సినిమాల్లో డాన్సులు చేసినా ఎక్కడా అశ్లీలం ఉండేది కాదు. ఇపుడు ట్రెండ్ మారింది కాబట్టి ఐటెం సాంగ్స్ తో సహా అన్నీ హీరోయిన్లు చేస్తున్నారు. వారు చేస్తున్నారు కాబట్టి నిర్మాతలు తీస్తున్నారు. ప్రేక్షకులు చూస్తున్నారు. అంతా కాల మహిమ .. కాదు ..కాదు కమర్షియల్ పోకడ మహిమ !
ఈ అంశంలో కేవలం సమంతను మాత్రమే తిట్టి పోయడం అన్యాయం. తిడితే అందర్నీ తిట్టాలి. 

————K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!