ఆ రోజు ఉదయమే టీవీ ఛానెల్స్ లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ని చూసి అదిరిపడింది అనిత.”పటాంచెరులో ఓ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుండి పడి రాగిణి అనే ఓ యువతి మృతి.” అని తెలుపుతూ ఆమె ఫొటోని చూపించారు.ఆ దుర్వార్త విని ఆమె ఫొటోని చూడగానే ఆమె తన ఫ్రెండ్ రాగిణే అని నిర్ధారణ చేసుకుని షాక్ కి గురైంది అనిత. వెంటనే రాగిణి నెంబర్ కి ఫోన్ చేసింది.
తను ఊహించినట్టుగానే రాగిణి భర్త సుధాకర్ ఏడుస్తూ ఆన్సర్ చేసాడు. “తాను, తన తల్లి వారిస్తున్నా విన కుండా రాత్రి చీకటి పడ్డాక టెర్రేస్ పై ఆరేసిన బట్టలను తేవడానికి వెళ్ళింది. ఓ టవల్ క్రిందికి పడిపోయిందని ఆతృతగా దానిని పట్టుకోబోయి కాలు జారి పట్టుతప్పి అక్కడినుండి క్రిందికి పడింది. ఆమెను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళినా ప్రాణం దక్కలేదు. పోస్ట్ మార్టం అయ్యింది .బాడీని ఇప్పుడే అప్పగించారు. ఈ సాయంత్రం దహనక్రియలు ఏర్పాటు చేసాం” అని సుధాకర్ చెప్పుకొచ్చాడు.
“అయ్యో… నేనొస్తున్నానండి.” అని చెప్పి ఫోన్పెట్టేసి వెంటనే అప్పటికే ఆఫీసుకి వెళ్ళడానికి సిద్దమైన తన భర్త రాజేష్ కి విషయం చెప్పి తనను రాగిణి ఇంటికి తీసుకెళ్ళమని అడిగింది. ఆ తరువాత తమ ప్రక్క ఫ్లాట్ లో ఉండే తమ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఝాన్సీకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె కూడా వస్తానంది. రాజేష్ డ్రైవ్ చేస్తుండగా తమ కారులో ఝాన్సీని ఎక్కించుకుని రాగిణి ఇంటికి బయలు దేరింది అనిత.
అక్కడ ఆమె మృత దేహాన్ని చూసేసరికి అనిత తట్టుకోలేకపోయింది. రాగిణి ముఖంలోని అమాయకత్వం అనిత హృదయాన్ని కదిలించింది.వారు తిరుగు ప్రయాణంలో కొంతదూరం వచ్చేసరికి అనితలో మార్పొచ్చింది. కారుని ఆపమంది ఆమె. ఎంతో మృదువుగా మాట్లాడే అనిత కంఠ స్వరంలో తీవ్రత ధ్వనించింది. ఆ తీవ్రతకి రాజేష్, ఝాన్సీ ఉలిక్కి పడ్డారు. రాజేష్ వెంటనే కారుని ప్రక్కకి తీసి ఆపాడు.
ఒక్క ఉదుటున కారులోంచి దిగి వేగంగా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న అనితని ఆశ్చర్యంగా చూస్తూ “ఏంటి అనిత…ఎక్కడికెడుతున్నావ్? ” అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆపబోయాడు రాజేష్. ఆమె అతని చెయ్యిని విదిలించి తీవ్ర స్వరంతో అంది “నో… నన్ను ముట్టుకోవద్దు నేను అనితని కాదు.” అంది
ఆ మాటలను విన్న రాజేష్ ఆశ్చర్యపోయి కారులో కూర్చున్న ఝాన్సీని పిలిచాడు. ఆమె వెంటనే కారు దిగి అక్కడికి పరిగెత్తుకొచ్చింది.”ఏమైంది?” అని రాజేష్ ని అడిగి ఆ వెంటనే అనితని చూస్తూ “ఏయ్ అనితా..ఏమైందే? రోడ్ మీద ఇలా బిహేవ్ చేస్తున్నావేంటీ? రా..వచ్చి కారెక్కు.” అంటూ ఆమె చేయి పట్టుకుంది ఝాన్సి. “చెప్పానుగా.. నేను అనితని కాదని.” అంటూ గట్టిగా అరిచింది. బిత్తర పోయి ఒకరినొకరు చూసుకున్నారు ఝాన్సి, రాజేష్. వారికేం పాలుపోలేదు.
“తన ప్రాణ స్నేహితురాలు చనిపోయిన షాక్ లో ఉన్నట్టుంది” రాజేష్ అనుకుంటున్నాడు తనలో తాను. “నువ్వు అనితవి కాకపోతే ఎవరివి?” తెలివిగా ప్రశ్నించింది ఝాన్సి. “నేను రాగిణిని. నన్ను పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళండి.” ఆదేశిస్తున్నట్లుగా చెప్పింది. “రాగిణి ఆత్మ ఆవహించినట్టుంది” అని రాజేష్ తో చెప్పి “తను చెప్పినట్టు చెయ్యండి.”అంది ఝాన్సీ. “సరే అయితే..రా నువ్వు కోరినట్టే తీసుకెడతాను.” అతని మాటని విన్నఅనిత దూకుడుగా వచ్చి కారెక్కింది.వెనక సీటులో ఆమె ప్రక్కన కూర్చోడానికి సంశయిస్తూ భయంగా కూర్చుంది ఝాన్సి. కారుని పటాంచెరు పోలీస్ స్టేషన్ దగ్గరకి తీసుకెళ్ళి ఆపాడు రాజేష్. కారు దిగీ దిగగానే దూకుడుగా వెళ్ళి ఇన్స్పెక్టర్ ముందు ఉన్న కుర్చీలో కూర్చుంది అనిత.
ఆమె అలా వచ్చి కూర్చోవడం చూసిన ఇన్స్పెక్టర్ ఒక్క క్షణం పాటు డంగై పోయి ప్రశ్నార్ధకం గా రాజేష్ ని చూసాడు. ఇన్స్పెక్టర్ ని ఓసారి ప్రక్కకి రండన్నట్ట సైగలతో పిలిచాడు రాజేష్. ఇన్స్పెక్టర్ లేచి ప్రక్క గదిలోకి వెళ్ళాడు. అతనిననుసరించి వెళ్ళిన రాజేష్. “సారీ ఇన్స్పెక్టర్ గారూ..” అని దారిలో జరిగిన విషయాన్ని చెప్పాడు. అది విన్న ఇన్స్పెక్టర్ అపనమ్మకంతో తిరిగి వచ్చి తన సీటులో కూర్చుని “నీ పేరేంటమ్మా?” అని అడిగాడు.
” రాగిణి ” అంతలో అక్కడికొచ్చిన రాజేష్ ని, ఝాన్సీని చూసి “నేను ఇనస్పెక్టర్ గారితో పెర్సనల్ గా మాట్లాడాలి” అంది.అది విన్న రాజేష్, ఝాన్సీ బయటికెళ్ళిపోయారు. రాగిణి తనది యాక్సిడెంటల్ డెత్ కాదనీ, తన అత్త , భర్త అధిక కట్నం కోసం తననెలా హింసించి, అది రాక పోవడంతో తననొదిలించుకుని మరో పెళ్లి చేసుకునే దురుద్దేశంతో చివరికి తనని మేడమీదనుంచి తోసి చంపేసారని చెప్పింది.
అది విన్న ఇనస్పెక్టర్ వెంటనే వెళ్ళి రాగిణి భర్తనీ, అత్తగారినీ కస్టడీ లోకి తీసుకుని తమదైన శైలిలో విచారించేసరికి వారిద్దరూ తమ నేరాన్ని ఒప్పుకోవడంతో వారిద్దరికి హత్యానేరంపై యావజ్జీవ కారాగారవాస శిక్షని విధించింది కోర్టు. నేరస్తులకు శిక్ష పడిన అనంతరం కోర్ట్ హాలు నుండి రిలాక్సెడ్ గా బయటికొస్తున్న అనితతో “మొత్తానికి రాగిణి ఆత్మ నీపై ఆవహించి తనను హత్య చేసిన వారికి శిక్ష పడేలా చేసింది.” అన్నాడు రాజేష్.
“ఆత్మా కాదు..మరేమీ కాదు. తనను అత్తా, భర్తా కలిసి ఎంతెలా హింసిస్తున్నారో రోజూ ఫోన్ లో చెప్పి ఏడుస్తుందేది రాగిణి. ఏదో రకంగా తనను చంపాలనుకుంటున్నారని కూడా ఆ ముందురోజే నాతో చెప్పి భయపడింది. దాంతో వారే ఈ హత్య చేసి కధను అల్లారని అనుమానం వచ్చి నన్ను ఆత్మ ఆవహించినట్లు నాటక మాడాను. అది నిజమని నమ్మిన పోలీసులు తమదైన శైలిలో విచారించి నిజాన్ని రాబట్టారు. ఇప్పుడు రాగిణి ఆత్మ శాంతిస్తుంది.” అంది అనిత.