Flash back …………………
ఈ ఫొటోలో కనిపించే ప్రముఖుడు ఎవరో చెప్పనక్కర్లదు. ఆయన చిన్నతనంలోనే నాట్యం నేర్చుకున్నారు. ఎక్కువగా నాట్యం మీదే దృష్టి పెట్టి కూచిపూడి,భరత నాట్యం ,కథక్ నృత్య రీతుల్లో శిక్షణ పొందారు.
కమల్ ఐదారేళ్ళ వయసులోనే కలత్తూర్ కన్నమ్మ (1960) చిత్రంలో బాలనటుడిగా నటించారు. అప్పట్లోనే ఉత్తమ బాలనటుడిగా రాష్ట్రపతి నుంచి బంగారు పతకాన్ని అందుకున్నాడు .బాల నటుడిగా, ఆయన మరో ఐదు చిత్రాలలో నటించారు..
ఇలా సినిమాలు చేస్తున్న సమయంలోనే తల్లితో కలసి కూచిపూడి ప్రదర్శనను చూడటానికి వెళ్లారు. అక్కడ ఆ నర్తకి నాట్య ప్రదర్శన చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా నాట్య కళాకారుడిగా ఎదగాలనుకున్నారు. తల్లి ప్రోత్సాహంతో ఎంఎస్ నటరాజన్ అనే డాన్స్ మాస్టారు వద్ద భరత నాట్యం నేర్చుకున్నారు.
రోజులో ఆరేడు గంటలు ప్రాక్టీస్ చేసేవారు. తర్వాత అరంగేట్రం ఇచ్చారు. అంతటితో ఆగకుండా కూచిపూడి కళా రీతులు నేర్చుకునేందుకు ప్రఖ్యాత నాట్య కళాకారుడు నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నాట్యం అభ్యసించారు.
అప్పట్లో నటరాజ రామకృష్ణ శిష్యులను మహారాష్ట్ర పోలీసులు ఆహ్వానించగా వెళ్లి మహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇలా ప్రదర్శనలు ఇస్తున్న సమయంలోనే కథక్ కూడా నేర్చుకోవాలని కమల్ ఆశ పడ్డారు. నటరాజన్ కొల్హాపూర్ నుండి కులకర్ణి అనే కథక్ బోధకుడిని పిలిపించారు.ఆయన వద్ద కమల్ కథక్ నేర్చుకున్నారు. నాట్య కళాకారుడిగా ఎదిగాడు. కమల్ ప్రతిభ ను గుర్తించి పలువురు ఆయనకు సినిమాలకు కొరియోగ్రఫీ చేయమని సూచించారు.
ప్రముఖ డాన్స్ మాష్టారు తంగప్పన్ వద్ద అసిస్టెంట్ గా చేరారు. తంగప్పన్ ఆ రోజుల్లో తమిళ, తెలుగు సినిమాలకు కొరియోగ్రఫీ చేసేవారు. కమల్ అలా అసిస్టెంట్ గా తమిళ,తెలుగు సినిమాలకు పనిచేశారు. ‘శ్రీమంతుడు’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కి స్టెప్స్ నేర్పించారు. తర్వాత కృష్ణం రాజు మరికొందరి నటులకు కూడా స్టెప్స్ నేర్పించారు.
కమల్ పెద్దయ్యాక ‘మానవన్’ అనే సినిమాలో(1970)మొదటి సారిగా ఒక నృత్య సన్నివేశంలో ఒక పాత్ర లో కనిపించారు. తర్వాత ప్రముఖ దర్శకుడు బాలచందర్ తీసిన ‘అరంగేట్రం’ సినిమాలో ఒక పాత్రలో నటించారు. ఇక అక్కడి నుంచి కమల్ ప్రయాణం ఆయన కూడా ఊహించని విధంగా సాగింది. తెలుగులో ‘సాగర సంగమం’ కమల్ నాట్య ప్రతిభకు అద్దం పట్టిన సినిమా అని చెప్పుకోవచ్చు.