డా.వంగల రామకృష్ణ …………………… A famous poet and scholar
వచన రచనకు మేస్త్రీ .. ఈ తరానికి తెలియని ప్రముఖ కవి పండితుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి. సినీ సాహిత్యంలో ఆయన శైలి విభిన్నం. ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. చాలా పాటలు ఆయన ఘోస్ట్ రైటర్ గానే రాశారు. ప్రముఖ రచయిత సీనియర్ సముద్రాల వద్ద ఆయన కొన్నాళ్ళు పనిచేశారు. ఆకాలంలో రాసిన పాటలు అన్నీ కూడా సముద్రాల పేరు మీదనే ప్రచారంలో కొచ్చాయి.
తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ సినిమా రచనకు సంబంధించి సలహాలకోసం శాస్త్రి గారిని మద్రాసుకు ఆహ్వానించారు. అపుడే సీనియర్ సముద్రాల గారితో పరిచయం అయింది. ఆ ఇద్దరూ కలసి ఆ సినిమాకు పనిచేశారు. ఆ విధంగా 1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రి తర్వాత కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు.
చిత్రసీమలో మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రవేశించే నాటికి సముద్రాల రాఘవాచార్య పరిశ్రమలో పెద్ద రచయితగా పేరుపొందారు. సినిమా రచనలో ఆయన బిజీగా ఉండేవారు. సముద్రాలవారిని ‘అన్నయ్యా’ అంటూ అభిమానంగా పిలిచేవారు మల్లాది. సముద్రాల కూడా మల్లాదిని అన్నయ్య అని పిలిచేవారట.
ఈ క్రమంలో సముద్రాల రాఘవాచార్యకూ మల్లాది రామకృష్ణశాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఏర్పడింది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలంపాటు “ఘోస్ట్ రైటర్”గా పనిచేశారు. అది కూడా ఎక్కువగా సముద్రాల కే పనిచేశారు. దేవదాసులో పాటలను మల్లాది వారే రాసారని ఆనాటి సినీ ప్రముఖులకు కూడా తెలుసు.
పాత దేవదాసులోని ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ పాట ను మల్లాది వారే రాసారని శ్రీశ్రీ ఒక సందర్భంగా బయటపెట్టారు. అప్పటి నుంచీ ‘దేవదాసు’ పాటలు మల్లాది వారివే అనే ప్రచారం జరిగింది. అయితే మల్లాది వారు మాత్రం ఏ నాడూ ఆ పాటలు తనవేనని చెప్పుకోలేదు.
అప్పట్లో ఆరుద్ర ఈయన శిష్యరికం చేశారు. వీరు మద్రాస్ పానగల్ పార్కులో సాయంకాలాల్లో ఎక్కువగా కలిసేవారు. ఒకసారి భాగవతుల సదా శివశంకర శాస్త్రి(ఆరుద్ర) కూడా అడిగారట. మీ సొంత పేరుతో పాటలు రాయవచ్చుకదా అని. దానికి మల్లాది వారు నీ కలం పేరు ఏమిటి ? అని అడిగారట. ఆరుద్ర అన్నారట భాగవతుల సదాశివశంకర శాస్త్రి. మల్లాది వారు నా కలం పేరు ‘సముద్రాల’ అన్నారట.
ఆరుద్ర, శ్రీశ్రీ, మద్దిపట్ల సూరి లను కొంతమంది నిర్మాత,దర్శకులకు పరిచయం చేసి పాటలు రాసే అవకాశాలు మల్లాది వారే ఇప్పించారట. శ్రీ శ్రీ దేవదాసు పాటల విషయం లీక్ చేసాక .. సముద్రాల కూడా నీపేరు మీద రాసుకో అన్నయ్యా అన్నారట. అప్పటి నుంచి సొంత పేరుతో 39 చిత్రాలలో 200 పైగా పాటలను రాశారు.
ఇక రామకృష్ణశాస్త్రి గారికి వందకు పైగా భాషల్లో కవిత్వం చెప్పగలిగిన పాండిత్యం ఉండేది. ఒకసారి ఆరుద్ర మల్లాది వారితో మాట్లాడుతూ మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి” అన్నారట.
అప్పుడు మల్లాది వారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేయగా మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రి చెప్పిన విషయం. వేదాంత శాస్త్రాన్ని కూడా మల్లాది వారు అవపోశన పట్టారు. ఆయన రాసిన కొన్ని పాటల్లో వేదాంత ధోరణి కనిపిస్తుంది. అందుకు ఉదాహరణ దేవదాసు పాటలే.
చిన్నతనం లో యడవల్లి సుబ్బావధాన్లుగారి దగ్గర వేదవిద్యను, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి దగ్గర మహాభాష్యాన్ని, శిష్ట్యా నరసింహశాస్త్రి గారి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది. నాటి సంగీత దర్శకులు కూడా ఈయన దగ్గర సలహాలు తీసుకునేవారట. ఒక్క పదం కూడా మార్చాల్సిన అవసరం లేకుండా పాటలు రాయడం లో మల్లాది వారు దిట్ట.
జయభేరి లోని ‘మది శారదాదేవి మందిరమే’,’రసికరాజ తగువారముకామా, రాగమయీ రావే అనురాగమయీ రావే’. కన్యాశుల్కం లోని ‘చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా’ … “ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక… చిరంజీవుల్లోని ‘కనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైన బ్రతుకెందుకో… ‘చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు’… ‘తెల్లవారవచ్చె తెలియక నా సామి” వంటి ఎన్నో గీతాలను మల్లాది వారు తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన కేవలం సినిమా పాటలే గాక కథలు ,నవలలు , నాటికలు కూడా రాశారు.
మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 17న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. 1965 లో సెప్టెంబర్ 12 న కన్నుమూశారు.