ఆ ఇద్దరిని ఏకి పారేసిన మల్లెమాల !

Sharing is Caring...

“ఇదీ నాకథ ” పేరుతో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి  పన్నెండేళ్ల  క్రితం  తన ఆత్మకథ రాసుకున్నారు. ఈ ఎమ్మెస్ రెడ్డి ని మల్లెమాల అని కూడా అంటారు. అది వాళ్ళింటి పేరు. అప్పట్లో ఆయన ఆత్మకథ పుస్తకం కాపీలు కొన్నిమాత్రమే బయటకొచ్చాయి. ఆ పుస్తకం బయటకొస్తే సినిమా పరిశ్రమలో కలకలం రేగుతుందని అప్పట్లోనే ఆయన కుమారుడు శ్యాంసుందర్ రెడ్డి వాటిని బయటకు రాకుండా అడ్డుకున్నారు.

ఆ తర్వాత 2011 లో ఎమ్మెస్ రెడ్డి కన్నుమూసారు. నిర్మాత ఎమ్మెస్ రెడ్డి సీనియర్ ఎన్టీఆర్‌ తో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ,రాజశేఖర్ ను కూడా తన ఆత్మ కథ లో ఉతికి ఆరేశారు. టాలీవుడ్ ప్రముఖులపై పదునైన వ్యాఖ్యలతో విమర్శలు చేశారు.

శ్రీకృష్ణ విజయం సినిమాలో ఎన్టీ రామారావు తాను వేసిన కృష్ణుడి గెటప్ కి నాగభూషణం వేసిన పౌండ్రక వాసుదేవుడి గెటప్ కి తేడా లేకపోవడం తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారట. అసలు ఆపాత్ర పురాణాల్లో లేదని ఎన్టీఅర్ వాదించగా అందుకు జవాబుగా ఎమ్మెస్ రెడ్డి మీరు మంచి నటులు అని ఒప్పుకుంటా, కానీ పురాణాల పట్ల మీకు అవగాహన లేదని చెప్పారట.

ఆ పాత్ర గెటప్ అలాగే ఉంటుందని – సినిమాలో నటిస్తే నటించండి, లేకుంటే మానుకోండి అని చెప్పారట . దాంతో ఎన్టీఆర్ దిగి వచ్చారని , మారు మాట్లాడకుండా నటించారని ఎమ్మెస్ రెడ్డి ఆత్మకథలో చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడితో కూతురు భువనేశ్వరి పెళ్లి సందర్భం గా తనను గదులు బుక్ చేయాలని ఎన్టీఆర్ అడిగారని, ఆ తర్వాత వాటి బిల్లులు పంపితే ఆ డబ్బులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు . అలాంటిదే మరో సంఘటనను కూడా ఆత్మకథ లో వివరించారు.

ఈ చేదు అనుభవాలతో భార్య ఒత్తిడి మేరకు తాను ఎన్టీ రామారావుతో సినిమాలు తీయడమే మానేసారట.జూనియర్ ఎన్టీఆర్ తీరుపై ఎమ్మెస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలరామాయణం సినిమాలో దర్శకుడు గుణశేఖర్ వద్దంటున్నా జూనియర్ ఎన్టీఆర్‌కు రాముడి పాత్ర ఇచ్చానని, తాను ఓసారి వెళ్తే తనను బయట నిలబెట్టారని, దాంతో తాను వెనక్కి తిరిగి వచ్చానని ఆయన వాపోయారు. 

దర్శకుడు గుణశేఖర్‌ కి విశ్వాసం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలో తాను రాసిన పాటను తీసేసి, తల పొగురు సమాధానం ఇచ్చారని, ఇష్టం వచ్చిన రీతిలో బడ్జెట్ పెంచేసి తనను కష్టాల పాలు చేశారని ఆత్మ కథ లో పేర్కొన్నారు.

ప్రముఖ హీరో చిరంజీవి తో తన చేదు అనుభవాన్నికూడా రాసుకున్నారు. సినీ నటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య తన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారని ఆయన చెప్పారు. తాతయ్య ప్రేమలీలలు సినిమాతో తాను నష్టపోయానని, ఆ సమయంలో చిరంజీవితో సినిమా తీసి నష్టం పూడ్చుకోవాలని అల్లు రామలింగయ్య సూచించారని, చిరంజీవికి అల్లు రామలింగయ్య చెప్పారట.

అయినా చిరంజీవి తనకు సమయం కేటాయించలేదని, ఆ విషయం అడగడానికి వెళ్తే మొహం చాటేశారని ఆయన రాసుకున్నారు. ఇక శోభన్‌బాబుకు, జమునకు తాను షాక్ ఇచ్చిన విషయాలను కూడా ఆత్మ కథ లో ఆయన పొందు పరిచారు . రాజశేఖర్‌తో సినిమా తీస్తే అడుక్కు తినాల్సిందే అని ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

గాయకుడు ఘంటసాల చనిపోతే ఎన్టీఅర్,అక్కినేని లు అంత్య క్రియలకు వెళ్లకుండా ఎగ్గొట్టారని కూడారాసారు.మొత్తం మీద ఎమ్మెస్ రెడ్డి ప్రముఖులందరికీ చురకలు అంటించారు. అయితే ఈ ఆత్మ కథ లో ఆయన రాసినవన్నీ నిజాలేనా ? అనే సందేహాలు కూడా వ్యక్త మైనాయి. 

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!