కొన్ని పాటలు అంతే … అలా మనసుకు హత్తుకుపోతాయి ..

Sharing is Caring...

Bharadwaja Rangavajhala………………

Heart touching songs……………………………..

కొన్ని పాటలు అంతే…మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు. లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు…
కలనైనా నీ వలపే … పాట తొలిచేస్తాందని చెప్పానుగా …ఈ పాటలో ..కళలూ కాంతులు నీ కొరకేలే అని లీలగారు పాడేప్పుడు …ఠక్కున మనసు’ రామకథను వినరయ్యా ‘లోకి దూకేస్తుంది.

అదే లైనును పై స్థాయిలో కాక కోమలంగా పాడినప్పుడు అదే మనసు పూజాఫలంలో … ‘పగలే వెన్నెల’ లోకి జారుతుంది. ఏమిట్రా ఈ గోల అని తరచి చూడగా …ఈ పాటలు హిందోళంలో స్వరపరచారు అని అర్ధమవుతుంది. ఈ హిందోళం అనే రాగమేదైతే ఉందో … అది చాలా హంటింగ్ స్వీటు రాగమన్నమాట …

బాదం బర్ఫీ తింటున్నప్పుడు ఇంకో రెండు అయినా పర్లేదని ఎన్ని తిన్నా అనిపిస్తుంది కదా అలాన్నమాట …
ఇలా ఆవేశపడి తినేసి ఆరోగ్యాలు పాడుచేసుకుంటారనే దాని రేటు కాస్త ఎక్కువ పెట్టారు తప్ప మిఠాయి కొట్టు వాళ్ల స్వార్ధం ఏ మాత్రం లేదనే చెప్పాలి.

ఇంకా…
ఈ హిందోళ రాగంలో నాయనా …అన్నీ కూడానూ కోమల స్వరాలే …అందువల్ల రుచిగా తీయగా ఉండుద్దన్నమాట …
అంచేత మనాళ్లు కరుణ, భక్తి, శృంగార రసాలను ఆవిష్కరించడానికి ఠక్కున ఈ రాగంలోకి వెళ్తారన్నమాట …
అవ్విధంబుగా … హిందూస్తానీ సంగీతంలోని “మాల్‌కోన్స్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని హిందోళం రాగానికి సమానం అంటారు పెద్దలు. నాకు పెద్దగా తెల్దు .

సంగీత దర్శకుడు ఆదినారాయణరావు అనే కుర్రాడూ …ఎక్కువగా హిందూస్తానీ పోకడల్లోనే స్వరాలు కూర్చేవారు.
కారణం ఏమిట్రా భగమంతుడా అంటే ఆయన రంగస్థలం నుంచీ రావడమే … అన్జెప్పాడు భగమంతుడు. అంటే ఏంటీ .
మన నాటకాల్లో ఉండేటువంటి పాటలకు పారశీక సంగీతం ప్రేరణగా ఉండేది …ముఖ్యంగా నాటకం లో కానీ సినిమా లో కానీ…పాట సంబాషణాత్మకంగా సాగాలి… కనుక ఖవ్వాలీ తరహా ట్యూనులను అధికంగా ఉపయోగించుకునేవారు …

అంచేత గురువుగారికి అలా అవి ఒంటపట్టాయి. “మాల్‌కోన్స్‌” రాగంలో కంపోజ్ చేయడం వల్లనే ..సువర్ణ సుందరి సినిమాలో పిలువకురా అలుగకురా… అంటూ సుశీల గారు పాడిన పాట కూడా మనకి కలనైనా నీవలపే కు దగ్గరగా అనిపిస్తుంది. … అందులోనూ ముఖ్యంగా సమయము కాదురా అన్న దగ్గర మనకి ఠక్కున కలనైనా నీ వలపే గుర్తొస్తుంది.

ఆ సంగతి అలా వదిలిపెడితే …తెలుగు సినిమాల్లో హిందోళాన్ని అధికంగా వాడుకున్న సంగీత దర్శకుల్లో ఘంటసాల , రాజేశ్పర్రావు లు ముఖ్యులు. ఆ విషయం నాకు లీలగా గుర్తుంది అని ఎవరేనా అంటే.. ఏడ్చావులే … ఘంటసాలలా గుర్తు లేదూ అనే వారు కదా …ఊర్నే జోగ్గా … అలా … లీల అనే ఆవిడ పాడే పద్దతి ఘంటసాల గారు పాడే పద్దతికి ఒక రకమైన అనుసరణలానే అనిపిస్తుంది.

ఫీమేల్ వర్షన్ ఆఫ్ ఘంటసాల అన్నమాట …దీనికి కారణం ఆ మధ్య భార్గవి గారు వివరించారు. ఇలాంటి అనుసరణలు సినిమాల్లో చాలానే కనిపిస్తాయి. ఉదాహరణకి … కాంచన అనే హీరోయిన్ను డైలాగు చెప్పే పద్దతి అక్కినేని నాగేస్పర్రావు ఇమిటేషన్ లోనే నడుస్తుంది …అబ్జర్వ్ చేయండి .. తెల్సిపోతుంది …

అట్టాగే …కమలహసనూ అనబడే మహా నటుడు డైలాగు చెప్పే పద్దతి వీరోయిన్ లక్ష్మి అని ఒకావిడ ఉండుద్ది కదా ..
ఆ మధ్య ఏదో బేబి సినిమాలో కూడా ఏసింది కదండీ ఆవిడ డైలాగ్ చెప్పే పద్దతిలోనే నడుస్తుంది … ఇట్టా బోల్డు మందిరి ఉన్నారు. అయినా నాకెందుకు ..

ఇలా ఈ కలనైనా పాటను పట్టుకుని ఏడుస్తున్నాను ఎప్పుడైనా సరే ఈవాళ్టికి ఇంతే … అనుకోవడమే…రేత్రికి నిద్రలోగానీ ఇది వదల్దు … చిన్నప్పుడు పొద్దున్న లేవగానే మెడ నెప్పిగా ఉంది ఉంటే … మా అమ్మ అనేదీ … నిద్రలో పట్టేసి ఉంటుంది … అది నిద్రలోనే పోవాలి … పట్టించుకోకు స్నానం చేసి బడికి బయల్దేరు అని … అలాన్నమాట …

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!