చరిత్ర అడక్కు .. చెప్పింది విను !

Sharing is Caring...

తెలుగు సినిమా రచయితల్లో హాస్య రచయితలు ఎందరో ఉన్నారు.. వారిలో రాణించిన వారు కొందరే. డైలాగు వినగానే ఇది ఆయనే రాశాడు అన్న ఖ్యాతి ని సంపాదించిన వాడు జంధ్యాల. ఆయన బ్రాండ్ డైలాగులు అంతగా పాపులర్ అయ్యాయి. ఆయన కామెడీ డిఫరెంట్ గా ఉంటుంది. బాగా చిరాగ్గా ఉన్నపుడు జంధ్యాల సినిమా చూస్తే మంచి టాబ్లెట్ లా మనసుపై పనిచేస్తుంది. చిరాకంతా పోయి హాయిగా నవ్వుకుంటాం. 

హాస్యంలో జంధ్యాలది ప్రత్యేక శైలి.  వెరైటీ తిట్లు ప్రవేశపెట్టిన రచయిత. హాస్యంతో పాటు సీరియస్ సంభాషణలు రాయడం లోనూ ఆయన దిట్ట. ‘వేటగాడు’ లో ‘అడవి రాముడు’ లో తండ్రి కొడుకుల పాత్రలకు జంధ్యాల రాసిన డైలాగులు నవ్వులు పూయిస్తాయి. ఎంత బిగుసుకు పోయే వారైనా నవ్వు ఆపుకోలేరు. 

‘వేటగాడు’ సినిమాలో రావు గోపాలరావు కి రాసిన అతి పెద్ద ప్రాసల డైలాగ్ అత్యంత ఆదరణ పొందిన డైలాగు గా చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో నటుడు సత్యనారాయణ  “అబ్బా… నీ ప్రాసతో చస్తున్నాను నాన్నా. గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస మాట్లాడతావో మాట్లాడు చూస్తాను”. అంటాడు. 

దానికి రావు గోపాలరావు స్పందించి “సరదాగా ఉందా? అయితే విను. ఈస్ట్‌ స్టువర్ట్‌పురం స్టేషన్‌ మాస్టారుగారి ఫస్ట్‌ సన్‌ వెస్ట్‌కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిష్టర్‌ టెస్ట్‌లో ఫస్ట్‌ క్లాసులో బెస్టుగా ప్యాసయ్యాడని తన నెక్ట్స్‌ ఇంటాయన్ని ఫీస్టుకని గెస్టుగా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న  చికెన్‌ రోస్ట్‌ను బెస్ట్‌ బెస్టని తినేసి హోస్టుకు కూడా మిగల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్టు చేయకుండా సుష్టుగా భోంచేసి పేస్టు పెట్టుకుని పళ్లు తోముకొని రెస్టు తీసుకున్నాడట ఏ రొష్టు లేకుండా. చాలా ఇంకా వదలమంటావా భాషా భరాటాలు.. మాటల తూటాలు.. యతి ప్రాసల పరోటాలు’  అంటాడు.

అంత పెద్ద డైలాగు అందులోను ప్రాసలతో కూడిన దాన్ని రావు గోపాలరావు గుక్కతిప్పుకోకుండా అద్భుతంగా చెప్పి శభాష్ అనిపించుకున్నారు. ఆ దెబ్బకు సత్యనారాయణ “వద్దు నాన్నోయ్‌… తల తిరిగిపోయింది నాన్నోయ్‌” అని బిక్కమొహం పెడతాడు. ఇలాంటి డైలాగులు వేటగాడు లో చాలానే ఉన్నాయి. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన అడవి రాముడు లో కూడా అదిరిపోయే డైలాగులు రాసి ప్రశంసలు పొందారు జంధ్యాల.

సీనియర్ నటుడు నాగభూషణం  డైలాగ్ కింగ్. ఆ పేరు నిలబెట్టేలా సంభాషణలు రాశారు. “చరిత్ర అడక్కు చెప్పింది విను” పంచ్‌ డైలాగ్‌ పేలిపోయింది. ఈ  సినిమాలో నాగభూషణం సత్యనారాయణ తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు ఏదడిగినా తండ్రి ఏదో ఒక పాత ఉదంతం చెబుతుంటాడు.

ఒక సన్నివేశంలో  నాగభూషణం “రేయ్‌… హరిశ్చంద్ర నాటకంలో కృష్ణుడి పద్యాలు పాడి చెప్పుదెబ్బలు తిన్న దొనకొండ గాబ్రియల్‌లాగా కావడం నాకిష్టం లేదు” అంటాడు. అందుకు సత్యనారాయణ “దొనకొండ గాబ్రియలా? ఆయనెవరు?” అని అడుగుతాడు. నాగభూషణం” చరిత్ర అడక్కు. చెప్పింది విను ” అంటాడు. ఇలా తండ్రి కొడుకుల కామెడీ హిట్ కావడంతో జంధ్యాల వేటగాడు లో దాన్ని రిపీట్ చేశారు. 

ఇక హాస్యనటి శ్రీ లక్ష్మి కి రాసిన  ‘నేను కవిని కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా…’ అన్న డైలాగు ఎంత పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. అలాగే సుత్తి ద్వయానికి,  బ్రహ్మానందానికి, పొట్టి ప్రసాద్ కి పలు సినిమాల్లో రాసిన సంభాషణలు ఎంతగా ప్రశంసలు పొందాయో, ఆ నటులను ఏ స్థాయికి తీసుకు వెళ్ళాయో అందరికి  తెల్సిన విషయమే.  

———KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!