మన దేశానికి చెందిన ప్రముఖులలో చాలామంది మరణాలపై ఎన్నో సందేహాలున్నాయి. దేశ రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణంపై కూడా సందేహాలిప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అసలేమీ జరిగిందో ఎవరికి తెలీదు. 1966 లో ప్రధాని హోదాలో శాస్త్రి అప్పటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌తో రష్యాలోని తాష్కంట్‌లో చర్చలు జరిపారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే శాస్త్రి తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు రష్యన్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రకటనతో ప్రపంచమంతా నివ్వెర పోయింది. ఆరోజు రాత్రి శాస్త్రి కుమార్తె తాష్కంట్‌లో ఉన్న తన తండ్రితో ఫోన్లో మాట్లాడారు.ఆ సమయంలో ఆయన కాస్త గాబరాగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పాలు తాగి పడుకోబోతున్నట్టు తన తండ్రి చెప్పారని సుమన్ అన్నారు.
ఈలోగా ఫోన్ లైన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత లైన్ దొరికింది కానీ శాస్త్రిజీ ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అరోగ్యపరంగా ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటు వచ్చినా … కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
ఆ తర్వాత 15నిమిషాలకే ఆయన మరణించినట్లు రష్యన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. శాస్త్రీజీ మరణంపై సుమన్ లాగానే పలువురు సందేహాలు వ్యక్తంచేశారు. అయితే శాస్త్రి మృతదేహానికి రష్యాలోగానీ, భారత్‌లొ గానీ పోస్టుమార్టం జరప లేదు. అంతకుముందు శాస్త్రికి ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవు. పైగా ఆయన మృత దేహాన్ని చూసిన భార్య అనేక సందేహాలు వ్యక్తం చేశారు.
శరీరంపై పలు చోట్ల కోతపెట్టిన గాయాలున్నాయని, శరీరం నీలం రంగులో మారి ఉందన్న విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. విష ప్రయోగం జరిగిందని మరో సందర్భంలో సందేహం వ్యక్తం చేశారు. కాగా శాస్త్రి వెంట ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ చుగ్ కూడా తాష్కంట్ వెళ్ళాడు.
అతనూ పక్కగదిలోనే ఉన్నాడు. కనీసం శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా సోవియట్ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పారు.ఇది కూడా సందేహించదగిన విషయమే. అందుకే ఆయన మరణం మిస్టరీ అని అప్పట్లోనే అందరూ అన్నారు.
కాగా 1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు రాజనరేన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు డాక్టర్ చుగ్ కారులో ఢిల్లీ వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. చుగ్ అక్కడికక్కడే మరణించాడు. అలాగే శాస్త్రి వ్యక్తిగత సేవకుడు రామ్‌నాధ్ కూడా ఆయనతో పాటు తాష్కంట్ వెళ్ళాడు. మృతదేహం వెంటే ఆయనా తిరిగొచ్చాడు.
అతనిని కూడా కమిటీ సాక్షిగా పరిగణించింది. అతని నుంచి స్టేట్మెంట్ తీసుకోవడానికి పిల్చింది. మోతీలాల్నెహ్రూ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయట కేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామ్‌నాధ్ రెండు కాళ్ళూ నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన గతాన్ని మర్చిపోయాడు.అలా సాక్ష్యాలు లేకుండా పోయాయి.
శాస్త్రి మరణంపై అధ్యయనం జరిపిన రాజ్ నరేన్ కమిటీ నివేదిక భారత పార్లమెంట్ లైబ్రరీలో కూడా అందుబాటులో లేకుండా పోయింది. 2018 లో రాజ్ నరేన్ కమిటీ రికార్డులను బహిరంగపరచాలని కేంద్ర సమాచార కమిషన్ ప్రధానమంత్రి కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. అయితే రికార్డులు లభించలేదని లైబ్రరీ అధికారులు తెలిపారు. ఆ విధంగా శాస్త్రీజీ మరణం నూరు శాతం అనుమానాస్పదంగానే చరిత్రలో నిలిచి పోయింది.
—————- KNM